Beauty

బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?

Soujanya Gangam  |  Feb 27, 2019
బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?

ప్ర‌కృతి మ‌న‌కు ఇచ్చిన వ‌రం నోరూరించే పండ్లు.. ఇవి కేవ‌లం ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందులో ముఖ్య‌మైన పండు బొప్పాయి(Papaya). ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌తో నిండి ఉన్న ఈ పండు చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులోని విటమిన్ ఎ మ‌న చ‌ర్మాన్ని ఎంతో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మారుస్తుంది. విట‌మిన్ సి మ‌న చ‌ర్మంలోని కొల్లాజెన్ బంధాల‌ను బ‌లోపేతం చేసి చ‌ర్మం న‌వ‌య‌వ్వ‌నంగా క‌నిపించేలా చేస్తుంది.

ఇందులోని ప‌పైన్ కొత్త చ‌ర్మ క‌ణాలు ఏర్ప‌డేందుకు తోడ్ప‌డుతుంది. అంతేకాదు.. ఇది మ‌న చ‌ర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, మొటిమ‌లు, రాషెస్‌ని త‌గ్గిస్తుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌, పొటాషియం వంటివి క‌లిగిన బొప్పాయి చ‌ర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి చ‌ర్మంలో తేమ‌ను పెంచుతుంది. ఇంకా బొప్పాయి ప్ర‌యోజ‌నాలు చెప్పుకుంటూ పోవాలే గానీ బోలెడ‌న్ని ఉన్నాయి.. అలాంటి బొప్పాయితో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్ (Face pack) త‌యారుచేసుకొని మెరుపును సంపాదించుకోవ‌డం ఎలాగో తెలుసుకుందామా..

ఈ వేస‌విలో ఎండ బారి నుంచి మ‌న‌ల్ని కాపాడుతూ చ‌ర్మానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు అందించే ఈ బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ల‌ను త‌యారుచేసే విధానం తెలుసుకుందాం రండి..

పొడి చ‌ర్మం కోసం..

తేనె మ‌న చ‌ర్మానికి తేమ‌ను అందించే ముఖ్య‌మైన ప‌దార్థం. దీన్ని బొప్పాయితో క‌లిపితే మ‌న చ‌ర్మానికి చ‌క్క‌టి హైడ్రేటింగ్ మాస్క్‌గా పనిచేస్తుంది. ఎండ వేడికి పొడి చర్మం మ‌రింత‌గా పొడిబారిపోతుంది. ఇలాంటి చ‌ర్మం ఉన్న‌వారు బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్ ఉప‌యోగిస్తే చ‌ర్మానికి తేమ అందుతుంది.

దీని కోసం ఒక బౌల్‌లో అరక‌ప్పు బొప్పాయి గుజ్జు, టేబుల్ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ల ప‌చ్చిపాలు పోసి ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చ‌ల్ల‌ని నీళ్ల‌తో క‌డిగేయాలి. వేస‌వి మొత్తం ఈ ఫేస్‌ప్యాక్‌ని వారానికి రెండుసార్లు వేసుకుంటూ ఉండండి.

వేస‌విలో ఎక్కువ‌గా వ‌చ్చే మొటిమ‌ల కోసం..

వేస‌విలో సాధార‌ణం కంటే ఎక్కువ మొత్తంలో నూనె విడుద‌ల‌య్యి మొటిమ‌లు ఎక్కువ‌ అవుతుంటాయి. ఇలాంట‌ప్పుడు ఈ మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు బొప్పాయి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో పాటు నిమ్మ‌ర‌సం, తేనెను కూడా ఉప‌యోగించండి. ఈ మూడు మొటిమ‌ల‌ను అరిక‌ట్టేందుకు అద్భుత‌మైన ప‌దార్థాలుగా చెప్ప‌వ‌చ్చు. బొప్పాయిలోని ఎంజైమ్స్ చ‌ర్మ రంధ్రాల‌ను తెరిచి లోప‌ల ఉన్న మ‌లినాల‌ను తొల‌గించడానికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నిమ్మ‌ర‌సం మొటిమ‌ల‌ను క‌లిగించే బ్యాక్టీరియాను త‌గ్గిస్తే.. తేనె చ‌ర్మం జిడ్డును త‌గ్గించి స‌హ‌జ తేమ‌ను పెంచుతుంది. దీని కోసం బొప్పాయి గుజ్జులో టీస్పూన్ తేనె, ఒక నిమ్మ‌కాయ ర‌సం క‌లిపి ఫేస్‌ప్యాక్ త‌యారుచేసుకోవాలి. దీన్ని మీ చ‌ర్మానికి అప్లై చేసుకొని ఇర‌వై నిమిషాల త‌ర్వాత క‌డిగేసుకోవాలి. ఇలా నాలుగైదు రోజుల‌కు ఒక‌సారి చేస్తే మీ చ‌ర్మం మొటిమ‌లు, మ‌చ్చ‌లు లేకుండా మెరిసిపోతుంది.

చ‌ర్మ‌రంధ్రాల‌ను మూసేయ‌డానికి..

చాలామందికి చ‌ర్మ‌రంధ్రాలు తెరుచుకొని ఉండి ఇబ్బందిపెడుతుంటాయి. ఇవి మొటిమ‌లు, బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్ లాంటి స‌మ‌స్య‌ల‌ను కూడా తీసుకొస్తాయి. దీన్ని త‌గ్గించుకోవ‌డానికి చాలామంది గుడ్డులోని తెల్ల‌సొనను మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. ఇది మ‌న చ‌ర్మంపై ఎక్కువ‌గా విడుద‌ల‌య్యే నూనెల‌ను కంట్రోల్ చేసి చ‌ర్మ‌రంధ్రాల‌ను చిన్న‌గా చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దీనికి బొప్పాయిని క‌ల‌ప‌డం వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాలు రెట్టింప‌వుతాయి.

ఎందుకంటే చ‌ర్మంపై స‌హ‌జ నూనెల‌ను కంట్రోల్ చేయ‌డానికి బొప్పాయి చాలా చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకోసం చేయాల్సింద‌ల్లా గుడ్డులోని తెల్ల‌సొన‌ను బాగా బీట్ చేసి తెల్ల‌ని నుర‌గ‌లా మారేలా చేసుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జును చేర్చుకొని మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. దీన్ని పావుగంట పాటు అలాగే ఉంచుకొని క‌డిగేసుకోవాలి. బొప్పాయి చ‌ర్మ‌రంధ్రాల‌ను చ‌క్కగా శుభ్రం చేస్తుంది కూడా..!

చ‌క్క‌టి మెరిసే చ‌ర్మానికి ..

నిమ్మ‌ర‌సం, బొప్పాయి రెండిట్లోనూ విట‌మిన్ సి చాలా ఎక్కువ‌గా ఉంటుంది. నిమ్మ‌ర‌సంతో పాటు బొప్పాయి కూడా నేచుర‌ల్ క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేసి చ‌ర్మ ఛాయ‌ను పెంచుతుంది. ఎండాకాలంలో స‌న్‌ట్యాన్ వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌బ‌డే అవకాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

అలాంట‌ప్పుడు ఈ ఫేస్‌ప్యాక్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల మీ చ‌ర్మం రంగు మార‌కుండా కాపాడుకోవ‌చ్చు. దీని కోసం ఒక బౌల్‌లో కొంత బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని పిండాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇర‌వై నిమిషాల త‌ర్వాత క‌డిగేసుకోవాలి. ఎండ నుంచి కాపాడుకోవ‌డానికి ఇలా క‌నీసం వారానికి మూడుసార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం రంగు మార‌కుండా కాపాడుకోవ‌చ్చు.

క‌మిలిన చ‌ర్మం మామూలుగా మారేందుకు..

ఎండాకాలం కాసేపు బ‌య‌ట‌కు వెళ్లొస్తే చాలు.. ఎండ వేడికి చ‌ర్మం మొత్తం క‌మిలిన‌ట్లుగా మారుతుంది. అందుకే మ‌నం వివిధ ర‌కాలుగా ఎండ మ‌న ముఖంపై ప‌డ‌కుండా ప్ర‌య‌త్నిస్తాం. ఇలాంటి స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు బొప్పాయి మ‌నకు స్వాంత‌న‌ను అందిస్తుంది. క‌మిలిన చ‌ర్మాన్ని తిరిగి మామూలుగా మార్చుతుంది. దీంతోపాటు కీరా కూడా ఎండ‌దెబ్బ‌నుంచి చ‌ర్మాన్ని కాపాడుతుంది.

ఇక అరటి పండ్లలో ఉన్న ఆరోగ్యక‌ర‌మైన కొవ్వు ప‌దార్థాలు చ‌ర్మంలో తేమ‌ను నింపి ఏవైనా ముడ‌త‌లుంటే వాటిని త‌గ్గిస్తాయి. దీనికోసం చేయాల్సింద‌ల్లా బొప్పాయి, అర‌టి, కీరా ముక్క‌లను స‌మ‌పాళ్ల‌లో తీసుకొని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికే కాదు. ఎండ‌వ‌ల్ల ప్ర‌భావిత‌మైన ప్ర‌దేశాల్లో రుద్దుకొని పావు గంట పాటు ఉంచుకొని ముందు గోరువెచ్చ‌ని నీటితో క‌డుక్కోవాలి. ఆ త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో మ‌రోసారి ముఖాన్ని క‌డుక్కోవాలి. దీన్ని క‌నీసం వారానికోసారి చేయ‌డం వ‌ల్ల ఎండ బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోగ‌లుగుతాం.

చ‌ర్మంపై జిడ్డును త‌గ్గించాలంటే..

నిమ్మ‌లాగే నారింజ‌ల్లో కూడా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో పాటు ఇది స‌హ‌జ‌మైన ఆస్ట్రింజెంట్‌లా ప‌నిచేస్తుంది. చ‌ర్మ‌రంధ్రాల‌ను మూసివేయ‌డంలో తోడ్ప‌డుతుంది. దీంతో జిడ్డును కూడా కంట్రోల్ చేయ‌చ్చు. ఇక బొప్పాయి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

చ‌ర్మ‌రంధ్రాలను శుభ్రం చేసే ఈ పండు.. చ‌ర్మంపై అధికంగా ఉన్న జిడ్డును కూడా త‌గ్గిస్తుంది. అంతేకాదు.. దీనిలోని స‌హ‌జ గుణాలు న‌ల్ల‌మ‌చ్చ‌లు, పిగ్మెంటేష‌న్‌, న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను కూడా త‌గ్గిస్తుంది. జిడ్డును త‌గ్గించేందుకు నారింజ ర‌సాన్ని బొప్పాయి గుజ్జుతో క‌ల‌పాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి ప‌ది నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇది జిడ్డును త‌గ్గించ‌డంతో పాటు ఎండ‌కు చ‌ర్మం న‌ల్ల‌గా మార‌కుండా కూడా కాపాడుతుంది. దీన్ని వారానికోసారి ఉప‌యోగిస్తే స‌రి.

హెయిర్ రిమూవ‌ల్ కోసం కూడా..

ఆశ్చ‌ర్య‌పోయారా? కానీ ఇది నిజం. బొప్పాయిని ఉప‌యోగించి మీ ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల‌ను కూడా తొల‌గించుకోవ‌చ్చు. దీని కోసం బొప్పాయితో పాటు ప‌సుపును కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది. బొప్పాయిలోని ఎంజైమ్స్ జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌హీనం చేస్తే.. ప‌సుపులోని యాంటీబ‌యోటిక్ గుణాలు అలా వ‌దులైన కుదుళ్ల‌లోకి సూక్ష్మ‌జీవులు ప్ర‌వేశించ‌కుండా కాపాడుతాయి.

ఈ ప్యాక్‌ని పెట్టుకొని ట‌వ‌ల్‌లో కాస్త గ‌ట్టిగా రుద్దితే చాలు.. అవాంఛిత రోమాలు చాలావ‌ర‌కూ వూడిపోతాయి. దీని కోసం బొప్పాయిని గుజ్జు చేసుకొని అందులో టీస్పూన్ ప‌సుపు క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, అవాంఛిత రోమాలున్న ఇత‌ర శ‌రీర భాగాల‌కి ప‌ట్టించి ఆరిపోనివ్వాలి. త‌ర్వాత వేళ్ల‌తో దీన్ని బాగా రుద్దుతూ మ‌సాజ్ చేయాలి. ఇలా చేసిన‌ప్పుడే కొన్ని వెంట్రుక‌లు వూడి వ‌చ్చేస్తాయి. ఆపై చ‌ల్ల‌ని నీటితో ముఖాన్ని క‌డుక్కొని ట‌వ‌ల్‌తో తుడుచుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి.

 మీ అంద‌మైన మెరిసే జుట్టు కోసం.. చ‌క్క‌టి షాంపూ బ్రాండ్లివే..!

ఫేషియ‌ల్ బ్లీచ్‌తో.. మెరిసే అందాన్ని సొంతం చేసుకుందాం.. !

చుండ్రుకు చెక్ పెట్టాలా? అయితే ఈ చిట్కాలు ప్ర‌య‌త్నించండి.

Read More From Beauty