పొల్లాచ్చి (pollachi) సెక్స్ రాకెట్.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలనే కాదు.. దేశం మొత్తం కలకలం సృష్టిస్తోన్న ఘటన ఇది. దాదాపు ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నా ఇప్పటివరకూ దీనికి సంబంధించి పోలీసులకు కానీ.. బయట ప్రపంచానికి కానీ ఏమాత్రం తెలియకపోవడం గమనార్హం. అత్యాచారం (rape) చేశారని బయటకు పొక్కితే తమ కుటుంబ పరువు ఏమైపోతుందో అన్న భయమే వారెవరూ బయటకు రాకుండా చేస్తోంది. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నా.. అమ్మాయిలు సోషల్‌మీడియా మాయాజాలంలో పడి అబ్బాయిలను నమ్మడం.. మోసపోవడం జరుగుతూనే ఉంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని పొల్లాచ్చికి చెందిన ఓ కాలేజీ అమ్మాయి గత నెల పోలీసులకు చేసిన ఫిర్యాదు ద్వారా ఈ సంఘటన బయటకొచ్చింది. 19 సంవత్సరాల ఆ అమ్మాయి తనతో ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేసిన ఓ వ్యక్తి కలవడానికి రమ్మన్నాడని.. ఫిబ్రవరి 12న అతనిని కలవడానికి వెళ్లినప్పుడు లాంగ్‌డ్రైవ్ అని చెప్పి.. తనని కార్లో తీసుకెళ్లి అత్యాచారం చేశారని పేర్కొంది. ఆ అత్యాచార ఘటనను వీడియోలు కూడా తీశారని తెలిపింది. ఇప్పుడు ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని తనని వాళ్లు బెదిరిస్తున్నారని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన ఫిర్యాదు ఆధారంగా శబరి రాజన్ (25), తిరునావుక్కరసు(25), సతీష్ (28), వసంత్ కుమార్ (27) అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. ముందు చిన్నదే అనుకున్నా.. వారిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాతే ఈ కేసు చాలా పెద్దదని గుర్తించారు. నిందితులు నలుగురి ఫోన్లలో కేవలం ఒకరిద్దరివి మాత్రమే కాదు.. వందలాది అమ్మాయిలకు చెందిన వీడియోలు ఉండడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారే. ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారెందరో ఈ రాకెట్‌లో చిక్కుకున్నారు. ఇలా ఈ ముఠా ద్వారా మోసపోయిన అమ్మాయిలు 200 మందికి పైగానే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నలుగురు తమకు తెలిసిన అమ్మాయిలు చదువుతున్న కాలేజీకి చెందిన యువతుల నంబర్లను సంపాదించి వారితో స్నేహం చేసేవారు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారిని నమ్మించేవారు. వారితో చాలాకాలం స్నేహం చేసిన తర్వాత నమ్మినవాళ్లని కలవడానికి పిలిచేవారు. అలా వచ్చిన వారిని హింసించి, బెదిరించి.. లేదంటే మత్తు మందు ఇచ్చి వారిని రేప్ చేసేవారు.
దీనికోసం అన్నామలై అడవులకు దగ్గరగా ఉన్న ఓ ఫాం హౌజ్‌తో పాటు వివిధ హోటల్స్, కదులుతున్న వాహనాలు ఉపయోగించేవారట. ఈ రాక్షస కాండను వారు వీడియోలు కూడా తీసేవారట. ఆ తర్వాత ఆ వీడియోలను చూపిస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని అమ్మాయిలను బెదిరించి వారి నుంచి డబ్బు లాగడం, వారిని తమ శృంగార వాంఛల కోసం ఉపయోగించుకోవడం చేసేవారు. ఇలా ఈ ముఠా సభ్యులు దాదాపు కొన్ని కోట్ల డబ్బును.. అమ్మాయిలను బెదిరించి వారి నుండి తీసుకోవడం గమనార్హం.
అయితే ఈ ముఠాలో కేవలం ఈ నలుగురు మాత్రమే కాదు.. ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు ఫిర్యాదు చేసిన బాధితురాలి పేరు, వివరాలు బయటపెట్టడం.. ఫిర్యాదిదారు కుటుంబాన్ని స్థానిక రాజకీయ నాయకుడు బెదిరించడం వంటివి చూస్తే.. మరే బాధితురాలు బయటకు రాకుండా ఈ విషయాన్ని ఇంతటితో సద్దుమణిగేలా చేసేందుకు బాగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. చట్టపరంగా బాధితురాలి పేరు వెల్లడించకూడదని నిబంధనలున్నా.. తన ఐడెంటిటీని బయటపెట్టొద్దని ఆ అమ్మాయి తిరిగి జిల్లా కలెక్టర్‌కు కంప్లైంట్ చేసే వరకూ.. వాటిని తుంగలో తొక్కి ప్రతి మీడియా సమావేశంలోనూ బాధితురాలి పేరు, వివరాలను పోలీసులు వెల్లడించడం విచారకరం.
అంతేకాదు.. ఈ కేసులో నిందితులను అత్యాచారం లేదా నిర్భయ కేసు కింద అరెస్ట్ చేయకుండా రౌడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశారు. బాధితురాలిని రేప్ చేస్తూ తీసిన వీడియోల్లో రెండు ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తుండడంతో ఇలాంటివి చూడవద్దని కొందరు సెలబ్రిటీలు ప్రజలను కోరుతున్నారు. అలాగే మరింత మంది బాధితులు ముందుకొస్తే తప్ప.. ఈ కేసు విచారణ సాగదని పోలీసులు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికేలా చేసిన ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. నేషనల్ మీడియా ఈ విషయంపై వార్తలు రాయాలని ఎంతో మంది సెలబ్రిటీలు కోరడం ఒక విషయమైతే.. మద్రాస్ హైకోర్టు కూడా నేషనల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇంత పెద్ద కేసు గురించి అస్సలు వార్తలు రాయకపోవడమేంటని కోర్టు ప్రశ్నించింది.
మరోవైపు నిందితులకు కఠినమైన శిక్ష వేసి బాధితులను కాపాడాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కోరుకుంటున్నారు.
నటి రాశీఖన్నా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ “పొల్లాచ్చి సంఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటివారికి వేసే శిక్షను చూసి అందరికీ వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడే ఇలాంటివి తగ్గుతాయి. ప్రభుత్వం మరింతమంది బాధితులు బయటకు వచ్చేలా వారికి రక్షణనిస్తుందని భావిస్తున్నా” అని ట్వీట్ చేసిందామె.
“పొల్లాచ్చి రేప్ సంఘటన గురించి విన్న తర్వాత నా రక్తం మరిగిపోతోంది. కానీ చాలామంది దీనిపై స్పందించకపోవడం చూసి మహిళా సాధికారత, మహిళల రక్షణ వంటివి కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమేమో అనిపిస్తోంది. చెప్పిన దాన్ని చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారా?” అని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు.
నటుడు సిద్ధార్థ్ స్పందిస్తూ “పొల్లాచ్చిలో జరిగిన ఘటన గురించి తెలుసుకొని షాక్‌కి గురయ్యాను. బాధితులు బయటకు వచ్చి కేసు పెట్టడానికి తగిన సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నా. అలా అందరూ బయటకి వచ్చి కేసులు పెట్టడం వల్లే ఈ రాక్షసులకు శిక్ష పడుతుంది. సోషల్‌మీడియా ద్వారా అమ్మాయిలకు హాని జరగడం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. దీని నుంచి మన ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అంటూ ట్వీట్ చేశారు.
నటుడు జయం రవి ట్వీట్ చేస్తూ “నా సినిమాల ద్వారా అయినా.. వ్యక్తిగతంగా అయినా నా స్పందన ఒకటే. మహిళల హక్కులకు, చిన్నారుల అందమైన జీవితానికి హాని కలిగించే నిందితులను శిక్షించేందుకు కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే ఇలాంటివారు మరికొందరు పుట్టుకురాకుండా ఉంటారు” అని తెలిపారు.
కేవలం తమిళనాడులోనే కాదు.. మన రాష్ట్రాల్లోనూ ఇలా ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకొని.. స్నేహం చేసి, ఆ తర్వాత లైంగికంగా దాడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయికి.. కిళ్లీలో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన గురించి మనం విన్నాం.
అందుకే అమ్మాయిలూ.. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అవతలి వారు మంచివాళ్లే అయినా వారితో మీకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అపరిచితులతో స్నేహం చేయకపోవడం మంచిది. అలాగే కొత్త వాళ్లను కలిసేందుకు ఒంటరిగా వెళ్లకూడదు. మీతో పాటు ఇంకెవరినైనా తోడు తీసుకెళ్లడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా ఒకవేళ ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైతే పరువు కోసం ఆలోచించి ఇబ్బందిపడడం కంటే పోలీసులకు కంప్లైట్ చేయడం, మీ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరడం మంచిది.
ఇవి కూడా చదవండి.
#POPxoWomenWantMore ఈ విమెన్ బయోపిక్స్ .. చాలా చాలా స్పెషల్ ..!
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..
అమ్మాయిలూ.. వీటి గురించి అసలు బాధ పడాల్సిన అవసరమే లేదు..!
Images : Pixabay