Bollywood

మల్లేశం మూవీ రివ్యూ – ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం

Sandeep Thatla  |  Jun 20, 2019
మల్లేశం మూవీ రివ్యూ – ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం

“ఆపదలొచ్చినప్పుడు.. అన్ని దార్లు మూసుకుపోయినట్టు అనిపిస్తది.. కాని దైర్యంగ నిలబడి ఆలోచిస్తే ఏదో ఒక్క దారి తెరిచే ఉంటది”.

పైన చెప్పిన మాట ఈ సినిమాకి ఒకరకంగా వెన్నెముక లాంటిది. ఎందుకంటే ఇంజనీరింగ్ పట్టా లేని ఒక సామాన్యుడు.. ఏ ఇంజనీర్ కూడా కనిపెట్టలేని ఒక యంత్రాన్ని కనిపెట్టడమంటే మాటలు కాదు కదా! అదే ఈ మల్లేశం సినిమా కథ. ఆసు యంత్రాన్ని కనిపెట్టి ఎందరో స్త్రీల కష్టాన్ని దూరం చేసిన పద్మశ్రీ చింతకింది మల్లేశం గారి కథే ఈ సినిమా కథ.

మల్లేశం సినిమా గురించి టూకీగా మీకోసం..

ఎన్నో ఏళ్ళుగా ఆసు పోస్తుండడంతో లక్ష్మి (ఝాన్సీ) భుజాల ఎముకలు అరిగిపోయి చేయి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలోనే ఆసు చేతితో పోయడం కన్నా.. దాని కోసం ఒక యంత్రాన్ని కనిపెట్టడం మంచిదని ఆ ప్రయత్నాల్లో ఉంటాడు లక్ష్మి కొడుకు మల్లేశం (ప్రియదర్శి). ఆ తర్వాత కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఆరవ తరగతిలోనే చదువు ఆపేసిన వాడు… ఆసు యంత్రాన్ని ఎలా కనిపెట్టాడు? కనిపెట్టే ప్రయత్నంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు? ఎన్నో కష్టాలకోర్చి కనిపెట్టిన ఆసు యంత్రం పనిచేసిందా?

ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు వెండితెర పై మల్లేశం చిత్రంలో లభిస్తాయి. 

Mallesham Movie

"మల్లేశం" చిత్రంలో పాత్రలు పండిన తీరు..

ఈ చిత్రంలో చింతకింది మల్లేశం (Chintakindi Mallesham) పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడనే చెప్పాలి. ఎక్కడా కూడా పాత్ర నుండి బయటకి రాకుండా పూర్తిగా పాత్రలోనే లీనమై అద్భుతంగా అభినయించాడు. ఈ పాత్ర ప్రియదర్శి (Priyadarshi) కెరీర్‌లో ఎప్పటికి చెప్పుకునే ఓ పాత్రగా నిలిచిపోతుంది. తెలంగాణ మాండలికం పై మంచి పట్టు ఉండడం ఈ పాత్రకి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నటి అనన్య. మల్లేశం భార్య పద్మ పాత్రలో ఆమె జీవించిందనే చెప్పాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సగటు మహిళ ఎలాగైతే మాట్లాడుతుందో .. అచ్ఛం అలాగే అనన్య అభినయం సాగింది. ఎల్లప్పుడూ భర్తకి తోడుగా నిలిచే పాత్రలో చాలా చక్కగా నటించింది.

 

Ananya in Mallesham

ఇక యాంకర్‌గా, నటిగా ఎన్నో పాత్రలు చేసి మెప్పించిన ఝాన్సీ… ఈ చిత్రంతో మాత్రం వాటన్నిటిని మైమరిపించేలా నటించింది. మల్లేశం తల్లి లక్ష్మి పాత్రలో ఆమె ప్రదర్శించిన నటన కచ్చితంగా.. ఆమెకి అవార్డులతో పాటుగా రివార్డులు తెచ్చిపెట్టేలా ఉంది. తెలంగాణ మాండలికంలో ఆమె పలికిన సంభాషణల్లో ఎక్కడా కూడా అసహజత్వం మనకి కనిపించదు.

వీరితో పాటుగా మల్లేశం స్నేహితులుగా చేసిన ఇద్దరు, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ, బాల్యంలో ప్రధాన పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకోగలిగారు.

 

Jhansi in Mallesham

దర్శకుడి పనితీరు ఎలా ఉందంటే –

TEDx Hyderabad లో చింతకింది మల్లేశం గారి వీడియోని చూసి.. స్ఫూర్తిని పొంది ఈ చిత్రాన్ని తీశారు దర్శకుడు రాజ్ ఆర్. అయితే కేవలం ఒక 20 నిమిషాల వీడియో నుండి స్ఫూర్తిని పొంది సినిమా తీయాలనుకోవడం ఒకెత్తయితే.. ఆ సినిమాని అత్యంత సహజంగా రూపొందించడం మరో ఎత్తు. ఇంకా చెప్పాలంటే ఓ తెలంగాణ పల్లెలో మనం జీవిస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ విధంగా చిత్రాన్ని తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు దర్శకుడు.

ఈమధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో సినిమాల రాక పెరిగినప్పటికి, ఈ చిత్రంలో చూపించిన సన్నివేశాలు, ఆచార వ్యవహారాలు, వినిపించిన మాటలు… ఇలా ఒకటేమిటి, అచ్ఛం తెలంగాణ బతుకు చిత్రాన్ని ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అదే సమయంలో ఆసు యంత్రం తయారు చేసే ప్రయత్నంలో విఫలమవుతున్న వేళ.. మల్లేశం తన భార్యతో గొడవ పడే అత్యంత సాధారణమైన సన్నివేశాన్ని కూడా అసాధారణ రీతిలో తీసి శభాష్ అనిపించుకున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఏ సన్నివేశం కూడా మనకు కృత్రిమంగా అనిపించదు. అయితే కథనం విషయానికి వస్తే, సెకండ్ హాఫ్‌‌లో అక్కడక్కడా కాస్త ఫ్లో తగ్గిన్నట్లు అనిపిస్తుంది. అంతకు మించి సినిమా మొత్తం చాలా సహజంగా సాగుతుంది. ఆసు యంత్రాన్ని తయారుచేసే మల్లేశం ప్రయాణం మన కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నాన్ని సెల్యూలాయిడ్ పై చాలా చక్కగా చిత్రీకరించారు దర్శకులు. 

Chinthakindi Mallesham

సాంకేతిక వర్గం పై ఒక లుక్ వేస్తే –

ఈ సినిమాలో వచ్చే పాటలు ఎక్కడా కూడా అసందర్భంగా కాని అర్థరహితంగా ఉండవు. మంచి సాహిత్యం చిత్రానికి అదనపు బోనస్. మార్క్ రాబిన్ సంగీతం, బాలు శాండిల్య ఛాయాగ్రహణం ఈ సినిమాని మరో మెట్టు పై నిలబెట్టాయి. ఇంకొక రెండు విభాగాలు కూడా ఈ మల్లేశం చిత్రాన్ని క్వాలిటీ పరంగా ముందు వరుసలో నిలిపాయి. అవే – సింక్ సౌండ్ & ప్రొడక్షన్ డిజైన్. ఈ రెండు విభాగాల్లో మల్లేశం చిత్రం అద్భుతమైన పనితీరుని కనబరిచింది. 

ఇక పెద్దింటి అశోక్ కుమార్ అందించిన మాటలు చిత్రానికి హైలెట్. ఆయన నటీనటుల దగ్గరుండి మరీ.. వారితో అచ్చమైన తెలంగాణ యాసలో మాటలు పలికించిన విధానం ఈ చిత్రానికి సహజత్వాన్ని అద్దింది. నిర్మాణ విలువల విషయానికి వస్తే, శ్రీ అధికారితో కలిసి దర్శకుడు రాజ్.ఆర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా పూర్తయ్యాక దానిని విడుదల చేయడానికి ముందుకి వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ వారిని కూడా మనం అభినందించి తీరాల్సిందే. మంచి సినిమాలకి ఇటువంటి పెద్ద సంస్థలు వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Mallesham Movie

ఆఖరుగా – మల్లేశం గారి జీవితం తెరకెక్కడం ద్వారా అది చూసిన ప్రేక్షకులకి – ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకి వెళ్ళాలనే స్ఫూర్తిదాయక సందేశం మనకి ఈ చిత్రంలో అంతర్లీనంగా కనిపిస్తుంది. అలాగే ఇంతటి మంచి చిత్రం చూడకపోతే.. ఒక మంచి జీవితాన్ని చూసే అవకాశం కోల్పోయినట్టే…  

Read More From Bollywood