Lifestyle

ప్రతీ మగువకూ.. శృంగారానికి ముందు వచ్చే సందేహాలివే..!

POPxo Team  |  May 14, 2019
ప్రతీ మగువకూ..  శృంగారానికి ముందు వచ్చే సందేహాలివే..!

ఒక వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు లేదా భాగస్వామిగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నప్పడు.. అమ్మాయి మనసులో ఎన్నో సందేహాలుంటాయి. అసలు తను ఎలాంటి వాడు? అతని ప్రవర్తన ఎలా ఉంటుందనే అనుమానాలుంటాయి. ఆ సందేహాల్లో సెక్స్‌‌ అంశాలకు (sex)  సంబంధించినవి కూడా ఉంటాయి.

అయితే వాటి గురించి అడిగితే ఎక్కడ తన గురించి తప్పుగా అనుకొంటారేమోననే భావనతో ఆ ప్రశ్నలను (questions) తమ మనసులోనే దాచేసుకొంటూ ఉంటారు. అసలు అమ్మాయి మనసులో శృంగారానికి ముందు మెదిలే అలాంటి కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకొందాం..

అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇంతకుముందు ఆ అమ్మాయితో శారీరక సంబంధాలున్నాయా ?

ఈ సందేహం దాదాపు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నను తనలోనే దాచుకొంటుంది. కానీ దానికి సమాధానం అడిగే ప్రయత్నం చేయదు. ఎందుకంటే అలా అడగడం వల్ల తననే తప్పుగా అనుకొంటారేమో అనే ఆలోచన తనలో ఉంటుంది.

లైంగిక వ్యాధుల నిర్థారణ పరీక్ష (ఎస్టీడీ), హెచ్ ఐవీ పరీక్షలు చేయించుకొన్నారా? ఎప్పుడు చేయించుకొన్నారు?

ఈ ప్రశ్న అడగాలని చాలామందికి  అమ్మాయిలకు ఉన్నప్పటికీ అడగడానికి ధైర్యం చేయరు. కానీ సెక్స్‌లో పాల్గొనడానికి ముందే అమ్మాయిలంతా.. ఈ ప్రశ్నను తమ భాగస్వామిని కచ్చితంగా అడగాల్సిందే. దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అతనికి లైంగికపరమైన వ్యాధులు, సమస్యలు ఏమైనా ఉన్నాయా?

ఈ ప్రశ్న అడగడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఈ సుఖవ్యాధులకు సరైన రక్షణ తీసుకోకుండా సంభోగంలో పాల్గొంటే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. ఈ విషయం అతను మీ దగ్గర దాచిపెట్టి.. మీతో కలయికలో పాల్గొంటే అవి మీకు కూడా సోకే అవకాశం ఉంటుంది. గనేరియా, హెర్పిస్ వంటి వ్యాధులు సోకితే అవి దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. అందుకే ముందుగానే అతనికి.. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అడగాల్సిందే.

కండోమ్స్ వాడటంలో నీకేమీ అభ్యంతరం లేదు కదా? వాటిని ఉపయోగించడం నీకు ఇష్టమే కదా?

ఎందుకంటే కండోమ్స్ వాడే విషయంలో చాలామంది అబ్బాయిలకు ఫోబియా ఉంటుంది. వాటిని వాడటం వల్ల వారికి కావాల్సిన సంతృప్తి దొరకదేమోననే అపోహే దీనికి కారణం. అందుకే ఈ విషయంలో కూడా ముందే క్లారిటీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా. కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా ఉండటంతో పాటు.. లైంగికపరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

నా నుంచి నువ్వేమి కోరుకొంటున్నావు? సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన రిలేషన్ ఎలా మారబోతోంది?

ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో చెబుతుంది. ఇద్దరూ సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉన్నారా? లేదా? అనే క్లారిటీ సైతం ఈ ప్రశ్నకు అతను ఇచ్చే సమాధానంతో మీకు తెలిసిపోతుంది. ముఖ్యంగా మీతో అతను బంధంలో కొనసాగాలని భావిస్తున్నాడా? లేదా? అనే విషయానికి అతను ఇచ్చే సమాధానం.. ఈ ప్రశ్న తర్వాత అతని ప్రవర్తనే మీకు తెలియజేస్తాయి.

నిన్ను కలయికలో పాల్గొనేలా ప్రేరేపించేది ఏది?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొన్నప్పుడే కదా.. అతనికి నచ్చేలా మీరు.. మీకు నచ్చేలా అతను ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న కూడా కచ్చితంగా అడగాల్సిందే.

ప్రస్తుతం  నాతో కాకుండా.. మరెవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?

ఇలా అడగడంలో ఏ మాత్రం తప్పు లేదు. పైగా ఇటీవలి కాలంలో ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందితో బంధాన్ని కొనసాగించే మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిందే. దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే. అయితే ఈ ప్రశ్నకు అతడి దగ్గరి నుంచి కచ్చితమైన సమాధానం వస్తుందని భావించవద్దు. ఎందుకంటే.. ఈ విషయంలో నిజాయతీగా వ్యవహరించేవారు చాలా తక్కువ. అందుకే ఈ ప్రశ్న అడిగిన తర్వాత అతడి బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్పును గమనించండి. అది మీకు మామూలుగా అనిపిస్తే సరి. లేదా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా, నెర్వస్‌గా కనిపిస్తే ఆలోచించాల్సిన విషయమే.

మీ సెక్స్ అనుభవాల గురించి.. మీ ఫ్రెండ్స్‌తో గొప్పగా చెప్పుకుంటారా?

దీనికి సమాధానం అవునని వస్తే వెంటనే అతనికి ఓ నమస్కారం పెట్టి వచ్చేయడం మంచిది. ఎందుకంటే అతడి వీరగాథల్లో మీరు ఓ పాత్రధారి కావడం అంత మంచిది కాదు కదా. పైగా మీ ఇద్దరి మధ్యే ఉండాల్సిన విషయాలను నలుగురితో పంచుకొనేవాడితో జీవితం పంచుకోవడం అంత మంచిది కూడా కాదు కదా.

సాధారణంగా ఈ ప్రశ్నలు తమ భాగస్వామిని అడగడానికి అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. తమ గురించి తప్పుగా అనుకొంటారేమో? అలా అడిగితే వారి మనసు బాధపడుతుందేమో? దీని ప్రభావం తమ బంధం మీద పడుతుందేమో.. అనే భయంతో ఈ ప్రశ్నలను తమ మనసులోనే దాచేసుకొంటారు. కానీ ప్రతి అమ్మాయి తన జీవితంలోకి ఆహ్వానించబోయే వ్యక్తిని ఈ ప్రశ్నలు అడగడం చాలా మంచిది. ఎందుకంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా. ఏమంటారు?

GIFs: Giphy

ఇవి కూడా చదవండి:

ఫిమేల్ కండోమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ధైర్యం చేసి కండోమ్ కొనే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..!

అవాంఛిత గర్భం రాకుండా చేసే.. ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు

Read More From Lifestyle