Entertainment

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?

Sandeep Thatla  |  Jan 10, 2019
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?

సంక్రాంతికి ఇంకొక నాలుగు రోజులు సమయమున్నప్పటికీ సినిమాల పరంగా మాత్రం సంక్రాంతి సీజన్ మొదలైపోయింది అనే చెప్పాలి. ఈ ఏడాది తొలి చిత్రంగా ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) జనవరి 9న విడుదలవ్వగా.. జనవరి 10న రజినీకాంత్ పేట (Petta) విడుదలయ్యింది. ఇక ఈ రోజు అనగా.. జనవరి 11న రామ చరణ్ “వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)” విడుదలైంది. జనవరి 12న F2 చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. ఇలా ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి నాలుగు చిత్రాలు పండగ సందడిని తీసుకొస్తున్నాయి. 

ఇక ఈ నాలుగు చిత్రాలలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన “వినయ విధేయ రామ” పై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం కోసం తొలిసారిగా బోయపాటి శ్రీను-రామ్ చరణ్‌లు కలిసి పని చేయడం విశేషం. ఈ సీజన్‌లో విడులవుతున్న సినిమాల్లో.. భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా “వినయ విధేయ రామ”  రికార్డులకెక్కింది.

 

అసలే బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రమంటేనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అని టాక్. అలాగే ఆయన సినిమాలు మంచి సెంటిమెంట్ సన్నివేశాలకి కేర్ అఫ్ అడ్రస్‌గా కూడా ఉంటాయి. అలాంటి సన్నివేశాల్లో రామ్ చరణ్‌ని చూసుకోవడానికి ఆయన అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.

విడుదలకు ముందే “వినయ విధేయ రామ” ట్రైలర్‌కి సంబంధించి టాక్ కూడా చాలా పాజిటివ్‌గానే వచ్చింది. అలాగే ఇందులో “రామ్ కో ణి దే ల”.. అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులకి పిచ్చిగా నచ్చేసింది. పైగా ఈ డైలాగ్‌ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏకంగా వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ వేడుకలో స్టేజ్ పైన చెప్పడంతో ఈ డైలాగ్‌కి మరింత ప్రాచుర్యం లభించింది.

ఇక ముందుగా ఈ చిత్రంలో ఒక ఫైట్ సీక్వెన్స్ గురించి చెప్పుకోవాలి. అజర్ బైజాన్ (Azerbaijan) లో తీసిన ఈ ఫైట్ కోసం రామ్ చరణ్ రాంబో లుక్‌ని చూపించాడు. దీనికోసం చాలా స్ట్రిక్ట్ డైట్ పాటించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) తన సోషల్ మీడియా ద్వారా ఆ డైట్‌కి సంబంధించిన వీడియోస్ & డైట్ చార్ట్‌ని అందరితో పంచుకుంది.

ఆ షూటింగ్ చేసే సమయంలో అక్కడ చలి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ చొక్కా లేకుండా ఫైట్ చేసాడట. అయితే ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ సీక్వెన్స్ చాలా బాగా వచ్చినట్టుగా తెలిసింది. ఈ ఫైట్ సీక్వెన్స్‌ని కనల్ కన్నన్ (Kanal Kannan) డిజైన్ చేయడం జరిగింది

అదే సమయంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. పాటల్లో వీరిరువురు చేసిన నృత్యాలు ఇప్పటికే టీజర్ల రూపంలో బయటకి రావడంతో పాటు.. వాటికి మంచి స్పందన రావడం కూడా జరిగిపోయాయి. అలాగే ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నుండి ఈషా గుప్తాని తీసుకున్నారు. ఆ పాట మాస్ ఆడియెన్స్‌ని అలరిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇవన్నీ పక్కకి పెడితే, రంగస్థలం వంటి ఒక వైవిధ్యమైన చిత్రం తరువాత ఎటువంటి చిత్రం చేస్తే బాగుంటుంది అన్న మీమాంసలో ఉన్న రామ్ చరణ్‌కి బోయపాటి శ్రీను చెప్పిన కథ నచ్చడం.. దానికి చిరంజీవి కూడా అంగీకారం తెలపడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ చిత్రానికి మంచి మాస్ బీట్స్‌తో స్వరాలని దేవిశ్రీప్రసాద్ (DeviSriPrasad) అందివ్వగా… DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించారు.

చివరగా బోయపాటి శ్రీను అందించిన కథలో లేదా రామ్ చరణ్‌ని చూపించడంలో ఏ కాస్త లోపం కనిపించినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బందిపడాల్సి ఉంటుందని విడుదలకు ముందే కొంత పబ్లిసిటీ జరిగింది. కారణం – ఈ సీజన్‌లో మరో మూడు సినిమాలు విడుదలవుతుండడమే.

అయితే వినయ విధేయ రామ టీం పై సినిమా విడుదలకు ముందే.. చిరంజీవి గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. కచ్చితంగా ఈ చిత్రం అభిమానుల మనసు గెలుచుకుంటుందని.. అలాగే పండగ పూట ప్రేక్షకుల మనసును దోచుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

ఎన్ఠీఆర్ “బయోపిక్ “తో విద్యా బాలన్‌కి.. టాలీవుడ్‌లో పాపులారిటీ పెరుగుతుందా?

Read More From Entertainment