ఎన్టీఆర్ "బయోపిక్ "తో విద్యా బాలన్‌కి.. టాలీవుడ్‌లో పాపులారిటీ పెరుగుతుందా?

ఎన్టీఆర్ "బయోపిక్ "తో  విద్యా బాలన్‌కి..  టాలీవుడ్‌లో పాపులారిటీ పెరుగుతుందా?

సాధారణంగా ఒక భాషలో బాగా పేరొచ్చిన తరువాత.. ఇంకొక భాషలో ఎంట్రీ ఇచ్చే సమయంలో నటీనటులు చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. కారణం - అప్పటికే వారికంటూ ఒక గుర్తింపు ఉండడం. అలా గుర్తింపు పొందాక.. వేరే భాషలో సినిమా చేసి అది కాస్త పరాజయం పాలైతే.. తమ కెరీర్‌లో అది ఒక మాయని మచ్చగా మారిపోతుంది అని భావిస్తుంటారు. అలాంటిది ఏకంగా తన నటనకి జాతీయ అవార్డు అందుకున్నాక కూడా.. వేరే భాషా చిత్రంలో నటించాల్సి వచ్చినప్పుడు దానిని ఛాలెంజింగ్‌గా తీసుకొనే కథానాయికలు కూడా ఉన్నారు.  అటువంటి కథానాయికే "విద్యా బాలన్".


vidya-balan-in-ntr-biopic


అవును నిజం! నటి విద్యా బాలన్ (Vidya Balan) తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న విడుదల అవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవ రామతారకం (Basava Rama Tarakam) పాత్రలో విద్యా బాలన్ నటించిడం గమనార్హం. ఈ పాత్ర నిజంగా విద్యకి ఒక సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే తొలుత తెలుగు భాషపై ఆమెకి పెద్దగా పట్టులేకపోవడం ప్రధాన కారణం. అదే సమయంలో ఇక్కడ షూటింగ్ వాతావరణం కూడా తనకు కొత్తదే అని చెప్పాలి. ఆన్నింటికన్నా మించి.. ఒక అచ్చమైన తెలుగు గృహిణి పాత్రలో ఆమె లీనమై నటించాల్సిన ఆవశ్యకత ఉండడం.


vidyabalan-in-ntr-biopic


ఈ మూడు కారణాలు విద్యా బాలన్‌కి బసవ రామ తారకం పాత్ర చేసే సమయంలో.. కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించే అంశాలు. అయితే ఆమె గత సినిమాల్లో ప్రదర్శించిన అభినయం చూసాక.. అలాగే ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ సినిమా టీజర్లు చూసాక ఆమె తనకిచ్చిన పాత్రని సమర్ధవంతంగా పోషించింది అనే మనకి తెలుస్తుంది. ఇక ఆమె ఎంతో మక్కువగా కట్టుకునే చీరలోనే ఈ పాత్రలో కనిపించాల్సి రావడం మరో విశేషం. అదే ఆమెకి ఈ పాత్ర చేయడంలో ఒక తెలియని సౌలభ్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే పూర్తి సినిమా చూసాక కాని.. మనం ఆమె ఈ పాత్రకి ఎంతవరకు న్యాయం చేసేందనే విషయాన్ని తెలపలేం.


ఇటీవలే నిర్వహించిన ఎన్టీఆర్ (NTR Biopic) చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో పాటు.. ఎన్టీఆర్ కుమార్తెలు అందరూ కూడా విద్యా బాలన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ తల్లిగారైన బసవ రామ తారకం పాత్రని ఆమె చాలా బాగా పోషించారని, విద్యా బాలన్‌ని తెర పై చూస్తుంటే తమ తల్లి గారిని చూస్తున్నట్లు ఉందని అందరూ ఆమె అభినయాన్ని మెచ్చుకున్నారు.


vidyabalan-in-the-movie-kathanayakudu


ఇక ఇంతమంది ద్వారా తనకు లభించిన గుర్తింపుని.. సినిమా విడుదల కాకముందే విద్య తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక సినిమా విడుదలయ్యాక ఆడియన్స్ స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి ఈ చిత్రం అందించే గుర్తింపు ద్వారా భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్న వేస్తే అది సమాధానం లేని ప్రశ్న అని మాత్రం చెప్పగలం.


కాకపోతే విద్యా బాలన్‌కి ఈ చిత్రం విడుదలయ్యాక మాత్రం కచ్చితంగా మంచి పాత్రలనే తెలుగు దర్శక -నిర్మాతలు ఆఫర్ చేస్తారు అని చెప్పొచ్చు. అయితే తెలుగు సినిమా ఆఫర్స్‌ని మరి విద్యా బాలన్ అంగీకరిస్తారో లేదో తెలియదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆమె కెరీర్ తొలినాళ్ళలో మోహన్ లాల్ (Mohanlal)తో చేసిన సినిమా ఒకటి విడుదలకి ముందే ఆగిపోయింది. దీనితో ఆమె దక్షిణాది సినిమాల ఆఫర్స్‌ని కాస్త ఆచితూచి ఎంచుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆమె తన తదుపరి చిత్రం మిషన్ మంగళ్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసేశారు.


కాగా.. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఈ నెల 9న విడుదల అవ్వడానికి షెడ్యూల్ ఖరారైంది. అలాగే ఎన్ఠీఆర్ మహానాయకుడు (NTR Mahanayakudu) ఫిబ్రవరి 9న విడుదలవుతుందని నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఈ రెండు చిత్రాలు విద్యా బాలన్‌ కి నటిగా మంచి గుర్తింపు తేవాలని ఆశిద్దాం. అదే సమయంలో ఈమె హిందీ చిత్రసీమలో రాణించినట్టుగానే.. భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఒక మంచి నటిగా పేరు ప్రఖ్యాతులు పొందాలని అని కోరుకుందాం.


ఇవి కూడా చదవండి


ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్


2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే


2018 మెగా హిట్ చిత్రం "రంగస్థలం".. దర్శకుడిదే క్రెడిట్..!