Food & Nightlife

రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

Sandeep Thatla  |  May 6, 2019
రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

చూస్తుండగానే రంజాన్ (Ramzan) ఉపవాస దీక్షలు మొదలైపోయాయి. ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాధారణ వంటకాలతో పాటు స్పెషల్ రెసిపీలు కూడా లభిస్తుంటాయన్న విషయం మనందరికీ విదితమే. వాటిలో బాగా ప్రఖ్యాతి గాంచిన హలీమ్ మాత్రమే కాకుండా జనసామాన్యాన్ని సునాయాసంగా ఆకర్షించే మరో వంటకం కూడా ఉందండోయ్.. అదే ఖీమా లుక్మీ (kheema Lukhmi). ఈ వంటకం కూడా హైదరాబాదీ స్పెషల్ వంటకాలలో ఒకటి. ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇది హైదరాబాద్‌లో విరివిగా లభిస్తుంది.

ఈ ఖీమా లుక్మీ చూడడానికే కాదు.. తయారు చేసే పద్ధతిలో కూడా సమోసాకి బాగా దగ్గర పోలికలతో ఉంటుంది. అందుకే దీనిని నాన్ – వెజ్ సమోసా అని కూడా పిలుచుకుంటారు హైదరాబాదీలు. అయితే వీటి ఆకారంలో మాత్రం చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సమోసా త్రిభుజాకారంలో ఉన్నట్లు కనిపిస్తే, లుక్మీ మాత్రం చతురస్రాకారంలో ఉంటుంది. అదీకాకుండా సమోసాలో శాఖాహారానికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తే లుక్మీలో మాత్రం మటన్ ఖీమాని ఉపయోగిస్తాం.

ఇంతకీ దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం తెలుసా. లుక్మీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మైదా పిండి – 1 కిలో

మటన్ – 1/2 కిలో (చిన్నగా తరిగిన మటన్ – ఖీమా)

ఉల్లిగడ్డ – 1

పచ్చి మిర్చి – 5

కొత్తిమీర – 1 కట్ట

నిమ్మకాయ – 1

కారం – 2 స్పూన్స్

అల్లం వెల్లులి పేస్ట్ – 2 స్పూన్స్

పాలు – 1 కప్

ఉప్పు – తగినంత

రిఫైన్డ్ ఆయిల్ – 1 కప్

ఎగ్ వైట్ – 1

గరం మసాలా పౌడర్ – 1 స్పూన్

 

ఖీమా లుక్మీ తయారు చేసే విధానం..

మైదా పిండిలో ఉప్పు, ఎగ్ వైట్, కొద్దిగా నూనె లేదా నెయ్యి, పాలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దగా చేసుకోవాలి. దీనిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇందులో స్టఫింగ్‌కు అవసరమైన ఖీమా కర్రీని సిద్ధం చేసుకోవాలి.

ఇందుకోసం ముందుగా స్టౌ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు చెంచాల నూనె వేసి కాస్త వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. అనంతరం అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనిచ్చిన తర్వాత మటన్ ఖీమాని అందులో వేయాలి.

దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఖీమాలో ఉన్న నీళ్లన్నీ పూర్తిగి ఇంకిపోయే వరకు దానిని వేగనిచ్చిన తర్వాత అందులో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్.. మొదలైనవన్నీ వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి అవి ఇంకిపోయే వరకు దానిని ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి ఖీమాని బాగా కలిపి.. స్టౌ మీద నుంచి కిందకు దించి చల్లారనివ్వాలి. దీంతో స్టఫింగ్‌కి అవసరమైన ఖీమా కర్రీ సిద్ధమైపోయినట్లే.

ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని మరోసారి మెత్తగా మదించుకొని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను చపాతీ ఆకారంలో వత్తుకొని అంచులను కత్తిరించి చతురస్రాకారంలో కనిపించేలా కట్ చేసుకోవాలి.

 

ఈ స్క్వేర్ షేప్‌లో ఉన్న చపాతీని మధ్యలో కట్ చేసుకుంటే రెండు దీర్ఘచతురస్రాకాారాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కో దానిలోనూ ఒక్కో చెంచా చొప్పున ఖీమా కర్రీని ఉంచి చపాతీ చివర్లను నీళ్లతో తడిపి చుట్టూ అతికించేయాలి. ఇందుకు చేతివేళ్లను లేదా ఫోర్క్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీనినే లుక్మీ అంటారు.

ఇలా సిద్ధం చేసుకున్న లుక్మీలను పక్కన పెట్టుకొని స్టౌ పై ఒక పాత్రలో నూనె వేసి బాగా మరగనిచ్చి అందులో వీటిని వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే.. నోరూరించే ఖీమా లుక్మీ తయార్..

మంచి స్టార్టర్‌గా చెప్పుకునే ఈ లుక్మీని చాలామంది హైదరాబాదీలు తమ అల్పాహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఉదయాన్నే ఖీమాకి బదులుగా బంగాళాదుంపతో చేసినవైతే ఆరోగ్యానికి కాస్త మంచిదట.. అయితే ఈ రంజాన్ సమయంలో విరివిగా లభించే రుచికరమైన ఖీమా లుక్మీలను రుచి చూడాలంటే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆల్ఫా హోటల్‌కి (Alpha Hotel) వెళ్లాల్సిందే..

అక్కడ ఇరానీ ఛాయ్‌తో పాటు ఈ లుక్మీ తింటే వచ్చే మజానే వేరు. ఆసక్తి ఉన్నవారు ఇంట్లోనే మరింత రుచిగా, శుచిగా దీనిని తయారుచేసుకోవచ్చు. పైగా ఈ వంటకం తయారీ కూడా చాలా సులభమని మీకూ అర్థమయ్యే ఉంటుందిగా..

Featured Image: Hyderabad Ruchulu

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!

భాగ్యనగరంలో బీజింగ్ కళ చూస్తారా.. అయితే ఈ చైనీస్ రెసార్టెంట్లకు వెళ్లాల్సిందే..!

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

Read More From Food & Nightlife