‘If you don’t build your dream, someone else will hire you to build theirs.’
ఈ మాట ఎవరు అన్నారో తెలియదు కానీ.. చాలా కరెక్టుగా చెప్పారు. అందుకే అమ్మాయిలూ.. మీరు కన్న కలల్ని నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. మీరు చేరాలనుకొంటున్న గమ్యం ఇతరులు నిర్దేశించేలా చేసుకోవద్దు. ఈ విషయంలో పూర్తిగా మీ మనసు మాట వినండి. మీ కలల్ని సాకారం చేసుకోండి. ఈ ప్రయత్నంలో విజయం సాధించడంతో పాటు మనిషిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.
1. కష్టపడే తత్వం అలవడుతుంది.
కలను సాకారం చేసుకోవాలంటే.. దానికి చెమటోడ్చాల్సిందే. అందులోనూ అది మనం కోరుకొనే లక్ష్యం అయితే దాన్ని సాధించేందుకు ఎంత కష్టమైనా భరిస్తాం. ఈ క్రమంలో మన ప్రతిభను నూటికి నూరు శాతం ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. మన మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకొనే మార్గాల కోసం నిరంతరం అన్వేషిస్తుంది. మరో మంచి విషయం ఏంటంటే.. మన మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు బద్ధకం మన దరికి రాదు. ఇలా అలవాటైన కష్టపడే తత్వం ఎప్పటికీ మీతోనే ఉంటుంది.
2. సాధించలేదనే బాధ ఉండదు.
‘నేను సాధించిన వాటి కంటే.. నేను సాధించాలనుకొని పక్కన పెట్టినవే ఎక్కువ ఉన్నాయి.’ ఈ మాట మన పెద్దవాళ్ల దగ్గర చాలా సార్లు వింటూనే ఉంటాం. బహుశా వారికున్న బాధ్యతల కారణంగా తాము చేయాలనుకొన్నవి చేయలేకపోవచ్చు. ఇష్టం లేకపోయినా మరో పని చేయాల్సి రావచ్చు. ఈ విషయంలో వారు తరచూ బాధపడటం మనం చూస్తూనే ఉంటాం. మనం కూడా అలాగే చేశామంటే మన కల నెరవేరలేదనే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఆరు నూరైనా మీ లక్ష్యం నెరవేర్చుకోవడానికే ప్రయత్నించండి. అప్పుడే మనం కోరుకొన్నది సాధించామనే తృప్తి ఉంటుంది. మన జీవితం చాలా చిన్నది. జీవించినంత కాలం సంతోషంగా ఉండాలే కానీ.. నా కల నెరవేర్చుకోలేకపోయాననే బాధతో గడవకూడదు.
3. మీ కథ సాహస గాథ అవుతుంది.
రేపు మీరు బామ్మయ్యాక మీ మనవలకు, మనవరాళ్లకు కథలు చెప్పాలి కదా..! అప్పుడు ఏ కథ చెప్పాలా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. మీ కలను సాకారం చేసుకోవడానికి మీరు ధైర్యంగా వ్యవహరించిన తీరు.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాటికి ఎదురు నిలబడి మీరు మీ లక్ష్యాన్ని చేరుకొన్న క్రమం గురించి రోజుకో కథలా చెప్పవచ్చు. ఏమంటారు?
4. మీ శక్తి మీకు తెలుస్తుంది
నిర్దేశించుకొన్న లక్ష్యం చేరుకోవడం కోసం మీరు మీ సర్వశక్తులూ ఒడ్డుతారు. అంతేకాదు మీ గమ్యం చేరుకొనేందుకు రాత్రనక పగలనక కష్టపడుతారు. మీరు కోరుకొన్న ఫలితం సాధించిన తర్వాత మీ శక్తిసామర్థ్యాల గురించి మీకు పూర్తిగా తెలస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని వంద రెట్లు పెరిగేలా చేస్తుంది.
5. ఎల్లలు లేని ఆనందం
మనస్ఫూర్తిగా ఏదైనా పని పూర్తిచేసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటిది చిన్నతనం నుంచి మీరు కలలు కన్న ఉద్యోగం సాధించినప్పుడు లేదా మీరు కోరుకొన్న స్థానానికి చేరుకొన్నప్పుడు మీకు కలిగే ఆనందాన్ని నిర్వచించలేం. ఆ క్షణంలో మీకు కలిగిన ఆ భావన జీవితాంతం మీకు తోడుగా ఉంటుంంది.
6. ఎవరి కోసమూ త్యాగం చేయాల్సిన అవసరం లేదు..
ఇతరుల మెప్పు కోసమే పనిచేసేవారు.. చివరికి ఎవరి మెప్పునూ పొందలేరు. అందుకే ఇతరులు ఈ పని చేస్తే ఏమనుకొంటారో అనే భావనను వదిలేసి.. మీ గమ్యాన్ని చేరుకొనే ప్రయాణం ప్రారంభించండి.
7. విజయం వెంట వస్తుంది
విజయం సాధించడం కోసం దాని వెనుక మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అదే మన వెంట పడేలా చేసుకోవాలి. అదెలా సాధ్యమనుకొంటున్నారా? కృషి, పట్టుదల ఉంటే అది సాధ్యమవుతుంది.
8. మీకు మీరే స్ఫూర్తి
మీరు కోరుకొనే లక్ష్యం చేరుకొనే క్రమంలో ఎలాంటి కష్టం ఎదురైనా వెనుకాడరు. మీరు ప్రయాణిస్తున్న మార్గం మరింత కఠినంగా మారుతున్నా.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారే తప్ప వెనకడుగు వేయరు. మీ గమ్యాన్ని చేరుకొనే క్రమంలో మీకెన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటికి తట్టుకొని నిలబడతారే కానీ.. ఇక నేను దీన్ని చేయలేనని మధ్యలోనే వదిలిపెట్టరు. ఈ ప్రయాణంలో మీలో మీరే స్ఫూర్తి నింపుకొంటారు. అంతేకాదు పడి లేచిన కెరటమల్లే ధైర్యంగా ముందడుగేస్తారు.
9. ఆత్మ సంతృప్తి కలుగుతుంది
మీరు కోరుకొన్న గమ్యాన్ని చేరుకొన్నప్పుడు కలిగే మానసిక సంతృప్తికి అవధులుండవు. అంతేకాదు ‘నా కలను నిజం చేసుకోలేకపోయానే’ అనే బాధ మీకు ఎప్పటికీ కలగదు. మీరు అనుకొన్నది సాధించాననే ఆత్మ సంతృప్తి మీలో నిండిపోతుంది.
10. స్పష్టతతో ఉంటారు.
జీవితంలో ఏది చేయాలి? ఏది చేయకూడదంటూ సలహాలిచ్చేవారు అప్పుడప్పుడూ మనకు ఎదురుపడుతుంటారు. అవి మన మేలు కోరే చెబుతారు. కానీ జీవితంలో ఏం సాధించాలి? దానికోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే విషయంలో మనకు స్పష్టత ఉండాలి. నిజంగా మీ కలను నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటే.. వీటి గురించి మీకు ఇతరులు చెప్పాల్సిన అవసరం రాదు.
11. ధనమా? లక్ష్యమా?
ఈ సందిగ్ధం అందరిలోనూ ఏదో ఒక సందర్భంలో కలిగే ఉంటుంది. ఎందుకంటే.. కొన్ని సార్లు మనం చేయాలనుకొంటున్న పని వల్ల మనకు అంత ఆదాయం రాకపోవచ్చు. మరికొన్ని ఉద్యోగాలకు జీతాలెక్కువ. ఈ రెండు ఆప్షన్లలోనూ దేన్ని ఎంచుకోవాలో తెలియక సతమయ్యేవారు చాలామందే ఉంటారు. కానీ ధనార్జన కంటే ఆత్మసంతృప్తి ముఖ్యం కదా..! తమ కలల్ని నెరవేర్చుకొనే ప్రయత్నంలో ఉన్నవారు తమ మనసుకి నచ్చిన పనే చేస్తారు కానీ.. డబ్బుకి ప్రాధాన్యమివ్వరు. career ఎంపిక విషయంలో చాలా స్పష్టతతో వ్యవహరిస్తారు.
GIFs: Giphy, Tumblr