మన దేశం వివిధ రకాల రుచులకు పెట్టింది పేరు.. దక్షిణాదిన ఇడ్లీ, దోశ, వడ వంటి వంటకాలు (recipes) ఫేమస్ అయితే ఉత్తరాదిన ఢోక్లా, గట్టే, దాల్బాటీ వంటి వంటకాలు నోరూరిస్తాయి. ఇవే కాకుండా ప్రతీ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన రుచులు మన నోరూరించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆయా రాష్ట్రాల పేర్లు చెబితే ఆ వంటకాలు గుర్తు రావడం సర్వసాధారణం.
ఉదాహరణకు బెంగాల్ పేరు చెబితే రసగుల్లా పేరు, మహారాష్ట్ర పేరు చెబితే అక్కడి వడాపావ్ రుచి గుర్తుకు వస్తుంటాయి. కానీ కొన్ని వంటకాల పేర్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. పేరులోనే వూరిపేరు(place name)తో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. ఎంత పాపులర్‌గా మారినా ఆ వూరికి చెందిన వంటకాలే అని అందరూ గుర్తుంచుకునేలా చేస్తాయి. అలాంటి కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం రండి..
1. బందరు లడ్డూ
బందరు లడ్డూ అంటే అమలాపురం నుంచి అమెరికా వరకూ ఫేమస్సే.. బందరు పేరును మచిలీ పట్నంగా మార్చినా ఈ లడ్డూ పేరుతో ఆ ఊరిని అందరూ గుర్తుంచుకోవడం విశేషం. అసలు ఈ లడ్డూ ఎలా తయారైందో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.స్వాతంత్రానికి ముందు రాజస్థాన్ నుంచి బందరుకి వచ్చి స్థిరపడిన కొందరు సిక్కులు ఈ లడ్డూ తయారుచేసేవారు. వారి నుంచి ఈ వంటకం ఎలా తయారుచేయాలో నేర్చుకున్న స్థానికులు కొన్ని మార్పులు చేసి ఈ వంటకాన్ని చేసి పేరు సంపాదించారు. ఈ వంటకం పాపులర్‌గా మారడంతో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ని కూడా తీసుకున్నారు.
2. మైసూర్ పాక్
ఈ వంటకం మైసూర్‌లోని కృష్ణ రాజ వడయార్ – 4 వంట గదిలో తయారైంది. వారి వంటవాడైన మడప్ప ఓసారి శనగపిండితో స్వీట్ చేయడానికి ప్రయత్నిస్తూ శనగపిండి, నెయ్యి, చక్కెర కలిపి పాకం చేసి ప్లేట్లో వేసి ముక్కలుగా కోసి రాజావారికి అందించాడు. దీని పేరేంటని అడగ్గా ఏం చెప్పాలో అర్థం కాక మైసూరు పాక్ అని చెప్పాడట. (పాక్ అంటే కన్నడంలో స్వీట్ అని అర్థమట) అప్పటినుంచి ఇది మైసూర్ పాక్‌గా స్థిరపడిపోయింది. ఇది శుభకార్యాల్లో ముఖ్యంగా ఉపయోగించే స్వీట్లలో ఒకటి.
3. చెట్టినాడు చికెన్
ఇది తమిళనాడులోని చెట్టినాడు ప్రాంతానికి చెందిన చికెన్ వంటకం. నాట్టుకొట్టై చెట్టినాడు అనే తెగకి చెందిన వ్యక్తులు వివిధ దేశాలు సందర్శిస్తూ తమిళనాడులో స్థిరపడ్డారట. 20వ శతాబ్దం ప్రారంభంలో వారు వచ్చి స్థిరపడిన ప్రాంతాన్ని చెట్టినాడు ప్రాంతంగా పిలుస్తారు. వీరి వంటతీరు మామూలు భారతీయ వంటకాలకు కాస్త విభిన్నంగా ఉండేది. భారతీయ వంట తీరు వీరితో కలిసిపోయినా ఇప్పటికీ వీరు ఉపయోగించే మసాలాలు వేరుగా ఉంటాయి.
అందుకే ఈ ప్రాంతపు వంటకాలకు చెట్టినాడు వంటకాలని పేరు ఉండిపోయింది. ఈ తరహా మసాలాలు చేసి అందరూ వంటకాలు వండుతున్నా అక్కడి సంప్రదాయ వంటకాలకు ఉన్న రుచి ఎక్కడా ఉండదట. ఈ వంటకాల్లో పాపులర్ చెట్టినాడు చికెన్. ఈ చికెన్ అనగానే లొట్టలేసుకుంటూ తినేవారు మనలో చాలామందే ఉంటారు.
4. వెజ్ కొల్హాపురీ
సాధారణంగా మనం వంటకాల్లో కారం వేస్తాం. కూరకారం కోసం కొన్ని మసాలాలు జోడిస్తాం. కానీ కొల్హాపురీ ప్రాంతంలో ఉపయోగించే మసాలా తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే కేవలం కూరగాయలు కలిపి వండినా అక్కడి కూరలకు ఎంతో రుచి వస్తుంది. ఈ వంటకాలు కూడా కొల్హాపురీ పేరుతోనే ప్రసిద్ధమయ్యాయి. మహారాష్ట్రలోని ఈ ప్రాంతం కేవలం శాకాహార రుచులకే కాదు.. మాంసాహార రుచులకు కూడా ప్రసిద్ది.
5. మథురా పేడా
మధుర శ్రీకృష్ణుని జన్మస్థలం.. ఇక్కడి దేవాలయాల్లో పెట్టే పేడా ప్రసాదం ఎంతో ప్రసిద్ధి గాంచింది. అక్కడి గోవుల పాల నుంచి చేసిన కోవాతో ప్రత్యేకంగా ఈ పేడాను తయారుచేస్తారు. అందుకేనేమో.. అక్కడి రుచి ఇంకెక్కడా రాదని చెబుతుంటారు చాలామంది. ఈ స్వీట్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే ఆండ్రాయిడ్ వర్షన్‌ని ఎం.. ఆంగ్ల అక్షరంతో ప్రారంభించేందుకు ఈ పేడా పేరునే ఎంచుకోవాలనుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని వద్దనుకొని మాష్మెల్లో పేరును నిర్ణయించారు. ఈ స్వీట్ కూడా జీఐ ట్యాగ్ సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి.
గణతంత్ర దినోత్సవానికి మువ్వన్నెల రుచులతో రంగులద్దండి..!
మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జరుగుతుంటాయి..
కమ్మని చాక్లెట్.. మీకు కళ్లు చెదిరే అందాన్ని కూడా అందిస్తుంది..!
Images : Facebook.