Entertainment

ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

Soujanya Gangam  |  Jan 24, 2019
ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

స్వాతంత్ర్య దినోత్సవం (Independence day) వ‌చ్చేసింది. ఈరోజు రేడియోలో, టీవీలో, కాల‌నీ రోడ్ల‌ వ‌ద్ద.. జెండా ఎగ‌రేసిన ప్ర‌తిచోటా ఎక్క‌డ చూసినా దేశ‌భ‌క్తి పాట‌లే(Patriotic songs) వినిపిస్తుంటాయి. అయితే మామూలు దేశ‌భ‌క్తి పాట‌ల‌తో పాటు మ‌న సినిమాల్లో కూడా  అద్భుత‌మైన దేశ‌భ‌క్తి నిండిన పాటలు క‌నిపిస్తూ ఉంటాయి.

అందులో ఎక్కువ‌గా పాపుల‌రైన పాట‌ల‌తో పాటు.. పాట‌ విన‌గానే మ‌న‌ల్ని మ‌న‌మే మ‌ర‌చిపోయేలా.. మైమ‌ర‌చిపోయేలా.. మ‌న‌సులో దేశంపై మ‌రింత భ‌క్తి పెరిగేలా ఉన్న పాట‌లను ఓసారి గుర్తుచేసుకుందాం. వింటున్న కొద్దీ మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే ఆ పాట‌లను ఓసారి త‌నివితీరా విని మ‌న‌లోని దేశ‌భ‌క్తిని మ‌రింత పెంచుకుందాం..

ప్రముఖ బాలీవుడ్ దేశభక్తి గీతాలు (Best Bollywood Patriotic Songs)

1. యే వ‌త‌న్ మేరే వ‌త‌న్ (రాజీ)

అలియా భ‌ట్ న‌టించిన రాజీ చిత్రం ఎంత మంచి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందులోని “యే వ‌త‌న్ మేరే వ‌త‌న్ ఆబాద్ ర‌హే తూ” అనే పాట కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. తాను ఎక్క‌డ ఉన్నా దేశం సంతోషంగా వ‌ర్థిల్లాల‌ని కోరుకుంటూ పాడే ఈ పాట వింటే క‌న్నీళ్లు ఆగ‌వు. మ‌రి, శ్రేయా ఘోష‌ల్ పాడిన ఈ అద్భుత‌మైన పాట‌ను మీరూ ఓసారి మ‌న‌సారా వినండి.

2. ఐసా దేశ్ హే మేరా (వీర్‌జారా)

భార‌త్కి చెందిన అబ్బాయి, పాకిస్థాన్కి చెందిన అమ్మాయి ప్రేమ‌క‌థగా రూపొందిన వీర్‌జారా చిత్రంలోని ఐసా దేశ్ హే మేరా పాట మ‌న దేశంలోని ప‌ల్లెలు, మనుషులు, ప్ర‌కృతి.. ఇలా దేశానికి సంబంధించిన ప్ర‌తి విష‌యం గొప్ప‌దనాన్ని చెబుతూ సాగుతుంది. ఈ పాట‌ను ల‌తా మంగేష్క‌ర్‌, ఉదిత్ నారాయ‌ణ్‌, గురుదాస్ మ‌న్‌, ప్రీతా మజుందార్‌లు క‌లిసి పాడారు.

3. కుచ్ క‌రియే కుచ్ క‌రియే (చ‌క్ దే ఇండియా)

దేశం కోసం ఏదైనా చేయాలి.. ప‌ట్టుద‌ల‌తో ఏదైనా సాధించాలి అన్న సంక‌ల్పాన్ని మ‌న‌లో నింపుతుందీ పాట‌. జీవితంలో ఏదైనా సాధించాల‌న్న సంక‌ల్పం మ‌న‌లో క‌ల‌గాలంటే ఈ పాట‌ను విన‌డం వ‌ల్ల స్ఫూర్తి ల‌భిస్తుంది. సుఖ్వింద‌ర్‌ సింగ్‌, స‌లీమ్ మ‌ర్చంట్‌, మ‌రియాన్నే డిక్రూజ్ క‌లిసి పాడిన ఈ పాట ఎక్కువ‌గా క్రీడ‌ల్లో ఉప‌యోగించ‌డం మ‌నం చూస్తుంటాం.

4. ఏ జో దేశ్ హే తేరా స్వదేస్ హే (స్వ‌దేశ్)

దేశ‌మంటే ప్రేమ ఉన్న‌వారికి ఎక్క‌డున్నా ఈ దేశ‌మే గుర్తొస్తుంది. ముఖ్యంగా ప్ర‌వాస భార‌తీయుల జీవితానికి ఈ పాట నిద‌ర్శ‌నం అని చెప్పుకోవ‌చ్చు. దేశం నుంచి ఎంత దూరంగా ఉన్నా దేశం మ‌న మ‌న‌సులోనే ఉంటుంది అని చెప్పే పాట ఇది. చ‌క్క‌టి షెహ‌నాయితో ప్రారంభ‌మ‌య్యే ఈ పాట‌లో ఏఆర్ రెహమాన్ గాత్రం అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది.

5. దేస్ రంగీలా (ఫ‌నా)

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ విస్త‌రించిన అంద‌మైన దేశం మ‌న‌ది. ఆ దేశం అందాల‌ను వివ‌రిస్తూ సాగే అద్భుత‌మైన పాట ఇది. ఫ‌నా చిత్రంలోని ఈ పాట‌కు కాజోల్ న‌ర్తించిన విధానం కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాటను మ‌హాల‌క్ష్మి అయ్య‌ర్ ఎంతో శ్రావ్యంగా పాడారు.

6. భార‌త్ యే రెహ‌నా చాహియే (మ‌ణిక‌ర్ణిక‌)

దేశ్ సే హే ప్యార్ హో తో.. అంటూ దేశంపై ప్రేమ ఉంటే మ‌నం ఉన్నా లేక‌పోయినా దేశం వ‌ర్థిల్లాల‌ని కోరుకోవ‌డ‌మే అస‌లైన దేశ‌భ‌క్తి అంటూ ఈ పాట సాగుతుంది. తాజాగా విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక చిత్రంలోని ఈ పాట‌ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడ‌డం విశేషం. ఈ చ‌క్క‌టి పాట‌ను మీరూ ఓసారి వినేయండి మ‌రి.

 

7. సందేశే ఆతే హై (బోర్డర్)

బోర్డర్ చిత్రంలోని ఈ పాట.. కుటుంబాలకు దూరంగా ఉండే సైనికులు ఏ విధంగా ఇబ్బందులు పడతారో ఒక వైపు తెలియజేస్తూ.. మరో వైపు తమ ఇళ్ల నుండి లేఖలు వస్తే ఎంత ఆనందపడతారో.. సంతోషిస్తారో చక్కగా చూపిస్తుంది. ఎన్నో భావోద్వేగాలతో నిండిన గీతం ఇది. అనుమాలిక్ స్వరాలు సమకూర్చగా.. సోను నిగమ్ ఈ పాటను పాడారు. 

 

8. సర్ఫరోశీ కా తమన్నా (ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్)

సర్ఫరోశీ కా తమన్నా గీతం.. పేరెన్నిక గలిగిన దేశ భక్తి గీతాల్లో ఒకటి.  మహనీయుల త్యాగఫలాలను, విప్లవకారుల అభిమతాలను వెల్లడించే ఈ క్రమంలో ఈ పాట వస్తుంది. సోను నిగమ్, హరిహరన్ సినిమాలో ఈ పాటను పాడారు. 

 

9. మై లడ్ జానా (ఉరి)

సర్జికల్ స్ట్రైక్‌కి సమాయత్తమవుతున్న వేళ.. భారత సైన్యంలో ప్రేరణ నింపే క్రమంలో ఈ గీతం సినిమాలో వస్తుంది. శాశ్వత్ సచ్ దేవ్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. రోమీ, వివేక్ హరిహరన్ ఈ గీతాన్ని పాడారు.

 

10. సలామ్ ఇండియా (మేరీ కోమ్)

సలామ్ ఇండియా అంటూ.. సాగే ఈ గీతం “మేరీ కోమ్” చిత్రంలోనిది. ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ప్రేరణను ఈ గీతం మనకు కలిగిస్తుంది. విశాల్ దద్లానీ, సలీం మర్చంట్ ఈ గీతాన్ని పాడడం జరిగింది. 

ప్రముఖ టాలీవుడ్ దేశభక్తి గీతాలు (Best Tollywood Patriotic Songs)

 

1. విన‌రా వినరా (రోజా)
దేశ‌భ‌క్తి చిత్రాల పేరు చెబితే అందులో రోజా పేరు త‌ప్ప‌కుండా వినిపిస్తుంది. అందులోని “విన‌రా విన‌రా దేశం మ‌న‌దేరా”.. పాట మ‌న దేశం ఘ‌న‌త‌ను చాటి చెబుతూ సాగుతుంది. ఈ పాట‌కు తెలుగులో మ‌నో త‌న గాత్రాన్ని అందించారు. ఈ పాట‌ను వింటే చాలు.. మ‌న‌ల్ని మ‌న‌మే మ‌ర్చిపోతాం అనిపిస్తుంది.

 

2. దేశం మ‌న‌దే తేజం మ‌న‌దే (జై)
దేశం మ‌న‌దే.. తేజం మ‌న‌దే.. ఎగురుతున్న జెండా మ‌న‌దే.. అంటూ సాగే ఈ పాట జై సినిమాలోనిది. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎన్ని విభేధాలున్నా దేశం కోసం ఒక్క‌ట‌వ్వ‌డ‌మే భార‌తీయుల ప్ర‌త్యేక‌త అంటూ సాగే ఈ దేశ‌భ‌క్తి పాట ప్ర‌తి జెండా పండ‌క్కి ఎక్కువ‌గా వినిపించే పాట‌ల్లో ఒక‌టి.

 

3. పుణ్య‌భూమి నా దేశం (మేజ‌ర్ చంద్ర‌కాంత్‌)
మ‌న దేశం గొప్ప‌దనాన్ని చాటిచెప్పే పాట‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఎంతోమంది మ‌హ‌నీయుల‌ను క‌న్న ఈ దేశం కోసం మ‌నం కూడా ముందుకు న‌డ‌వాల‌ని చెబుతుందీ పాట‌. గాంధీజీ క‌ల‌లు క‌న్న స్వ‌రాజ్యం కోసం మ‌న‌మూ అంకిత‌భావంతో ముంద‌డుగు వేయాల‌ని చెప్పే ఈ పాట వింటుంటే రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ఖాయం. ఈ పాట‌ను ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అద్భుత‌మైన గాత్రంతో ఎంతో చ‌క్క‌గా పాడారు.

 

4. జ‌న‌నీ జ‌న్మ‌భూమిశ్చ స్వ‌ర్గాద‌పీ గ‌రీయ‌సీ (బొబ్బిలి పులి)
ఎన్టీఆర్ సినిమాల్లోని పాట‌ల్లో బాగా చెప్పుకోద‌గిన వాటిలో ఇదీ ఒక‌టి. పుట్టిన భూమి కోసం ఏదైనా చేయాలంటూ సాగే ఈ పాట మ‌నల్ని క‌న్న త‌ల్లి కంటే దేశ‌మే గొప్ప అని చెబుతుంది. ఎంఎం కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చ‌క్క‌టి పాట‌ను మీరూ ఓసారి వినేయండి.

 

5. ఓ సైనిక (నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా)
ఓ సైనిక.. అని సాగే ఈ గీతం.. “నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా” చిత్రంలోనిది. సైనికుడి విలువను.. సైనికుల కష్టాలను ఒకవైపు చెబుతూనే.. దేశభక్తిని పెంపొందించే విధంగా పౌరులందరూ భావితరానికి దిశానిర్దేశం చేయాలని చెబుతుంది ఈ పాట. 

 

6. పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)
ఆత్రేయ, శ్రీశ్రీ కలిసి ఈ పాటకి లిరిక్స్ రాయగా.. ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న గీతం ఇది. సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం..సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం అని ఒకవైపు చెబుతూనే..  ప్రతీ మనిషి మరియొకని దోచుకొనె వాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే.. స్వార్ధమీ అనర్ధకారణం అనే సత్యాన్ని కూడా తెలిపిన గీతమిది. 

 

7. ఈ జెండా (బాబీ)
ఈ జెండ పసిబోసి చిరునవ్వురా.. దాస్య సంకెళ్లు తెంచిందిరా.. అంటూ సాగే ఈ గీతాన్ని శక్తి రాయగా.. శంకర్ మహదేవన్ గాత్రాన్ని అందించారు.  యువత కార్యోన్ముఖులై.. దేశానికి సేవ చేయాలని.. తోటివారిని ప్రేమించాలనే సందేశాన్నిస్తుంది ఈ గీతం.

 

8. మేమే ఇండియన్స్ (ఖడ్గం)
మేమే ఇండియన్స్.. అంటూ సాగే ఈ గీతం సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన పాట. భారతీయుల తత్వాలను.. వారి ఆలోచన విధానాన్ని ఒకవైపు సైటెరికల్‌గా చెబుతూనే.. దేశాన్ని ప్రేమించాలని.. అందరిలో సోదరభావం పెంపొందాలనే చెప్పే గీతం ఇది.

 

9. దేశపతాకకు.. జాతిపతాకకు చెప్పర జైహింద్ (జైహింద్)
దేశపతాకకు.. జాతిపతాకకు చెప్పర జైహింద్.. ఈ పాట బాగా ప్రాచుర్యం పొందిన సినీ దేశభక్తి గీతం. విద్యాసాగర్ స్వరాలు సమకూర్చిన ఈ పాట.. మనలోని దేశభక్తిని మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

 

10. ఐ యామ్ యాన్ ఇండియన్ (బద్రి)
దేశభక్తికి కుల, మతాలు ఏవీ ఉండవని.. భారతీయులందరూ ఏకతాటి పై నడిస్తేనే అనుకున్నది సాధించగలవని చాటిన ఆంగ్ల గీతం “ఐ యామ్ యాన్ ఇండియన్”. రమణ గోగుల ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించారు. 

దేశ‌భ‌క్తి పాట‌ల‌న‌గానే ఒక‌టీ, రెండూ కాదు.. వంద‌లాదిగా ఉంటాయి. మ‌రి, అందులో మీకు న‌చ్చే పాటేది? కామెంట్ ద్వారా పంచుకోండి.

Featured Image: Youtube/Love Your Country

ఇవి కూడా చ‌ద‌వండి.

ఆర్మీ ప‌టాలానికి తొలి మ‌హిళా నాయ‌కురాలు భావ‌నా క‌స్తూరి ..!

2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

మీ డ‌ల్‌నెస్ దూరం చేసే పాట‌ల గురించి ఆంగ్లంలో చ‌ద‌వండి.

Read More From Entertainment