ఎప్పుడైనా మిమ్మల్ని అవతలివారు అనవసర కామెంట్లతో విసిగిస్తుంటే పోనీ.. అని అక్కడినుంచి వెళ్లిపోయారా? మీ మనసుకు నచ్చిన విధంగా మాట్లాడి అవతలి వ్యక్తి నోరు మూయించాలనుకున్నా ఎందుకులే అని ఆగిపోయారా? ఇలా చేసినవారిలో మీరొక్కరే కాదు.. మనలో ఎంతోమంది అమ్మాయిలున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు గతేడాది నిర్వహించిన సర్వేలో ఇదే అంశం గురించి చెబుతూ నలుగురిలో ఉన్నప్పుడు అమ్మాయిలు మగవారితో పోల్చితే చాలా తక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపుతున్నారని తెలియజేయడం జరిగింది.
దీనికి ఎదుటివారు తమ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనన్న భయమే ముఖ్య కారణమని ఆ సర్వే తేల్చింది. ఇళ్లలో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో.. అంతెందుకు స్నేహితులతో సరదాగా కలిసి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనకు నచ్చని విషయాల గురించి గొంతెత్తి మాట్లాడేందుకు మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఎవరైనా మనపై కామెంట్లు చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ ఇకపై అలా కాదు..
2018 సంవత్సరంలో మీటూ ఉద్యమంతో మన దేశంలో మార్పు మొదలైంది. ఈ మార్పు మన దగ్గరే కాదు.. ప్రపంచమంతా కనిపిస్తోంది. అయితే ఈ మార్పు కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రముఖ పాత్రికేయురాలు, ఎడిటర్ హామ్నా జుబైర్ 2019లో మహిళలు తప్పక మాట్లాడాల్సిన కొన్ని మాటల గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ని ఇక్కడ చదవండి.
మరో ట్వీట్‌తో దీనికి కొనసాగింపునిచ్చారు.
హామ్నా స్పూర్తితో అమ్మాయిలు ఎక్కువగా చెప్పాల్సిన కొన్ని మాటలను మేం కూడా జోడించాం. జీవితంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన సందర్భాలు ఎదురైప్పుడు ఈ మాటలు మిమ్మల్ని కాపాడి, మీకు సాయం చేస్తాయి. మరి, ఆ మాటలేంటంటే..
1. అది అభ్యంతరకరంగా ఉంది.
2. నాకు మీరు గుర్తించిన దానికంటే ఎక్కువ తెలివితేటలున్నాయి.
3. మీరెంత సంపాదిస్తున్నారో.. అంతే వేతనం పొందేందుకు నేను అర్హురాలిని.
4. మీ సలహా అవసరమైతే నేనే అడుగుతాను.
5. నన్ను నేను కాపాడుకోగలను.
6. నేను మీ అమ్మను కాదు.
7. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. దీన్ని ఇక్కడితో ఆపేద్దాం.
8. నేను చెప్పింది కూడా అదే.
9. నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.
10. నేను వెతుకుతున్న వ్యక్తి నువ్వు కాదు. నాకేం కావాలో నాకు తెలుసు.
11. నో అంటే నో అనే అర్థం.
తాజాగా మనమంతా గొప్పగా భావించే క్రికెటర్లు, నటీనటులు స్త్రీల పట్ల అగౌరవంగా మాట్లాడిన సంఘటనలు మనకు తెలిసినవే.. దీనిపై దేశవ్యాప్తంగా కేవలం స్త్రీలే కాదు.. పురుషులు కూడా తమ గళాన్ని వినిపించారు. అయినా వారి చెవులకు అవి వినిపించలేదు.
అయితేనేం.. మహిళలను కించపరుస్తూ మాట్లాడినందుకు హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై నిషేధం విధించగా.. తాను మాట్లాడిన మాటలకు గాను రాణి ముఖర్జీ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి మాటలు వినిపించినా.. వాటిపై పెద్దగా ప్రతిస్పందన కనిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇది మన మాటను నిర్భయంగా ప్రకటించగలగడం వల్ల వచ్చే ప్రయోజనం.. అందుకే దీన్ని ఇకపైనా కొనసాగించాలి.
ఇవి కూడా చదవండి
సెల్ఫ్ లవ్ గురించి వ్యాసాన్నిఇక్కడ చదవండి
#MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..
లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..