ప్రెగ్నెన్సీ(Pregnancy) అనేది దేవుడు ప్రతి మహిళకూ అందించే వరంలాంటిది. దాదాపు ప్రతి మహిళా తల్లి కావాలనుకుంటుంది. కానీ ఇలా తల్లవడంలో చాలామందికి నచ్చని విషయం ఒకటుంటుంది. అదే గర్భం దాల్చిన తర్వాత పెరిగే బరువు.. ఈ బరువు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకపోగా కొందరిలో మరింత పెరుగుతుంది. ఇదే ప్రతి మహిళనూ ఇబ్బందిపెట్టే విషయం. చాలామంది బిడ్డ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీకి ముందున్న బట్టల్లోకి మారిపోవాలనుకుంటారు. కానీ ఆ దుస్తులు తమకు ఎందుకు సరిపోవట్లేదో ఎవరికీ అర్థం కాదు.
బిడ్డ కడుపు నుంచి బయటపడ్డాక తన శరీరం ముందున్నట్లుగా మారిపోవాలని కోరుకోని తల్లి ఉండదేమో..! కాస్త కష్టపడితే చాలు.. ఇది సాధ్యమేనని నిరూపిస్తున్నారు చాలామంది సెలబ్రిటీ మామ్స్.. ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్, ఈషా డియోల్ లాంటి వాళ్లంతా గర్భం తర్వాత బరువును ఇట్టే తగ్గించుకున్నారు. ఇప్పుడు వారి క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది మన హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా (Sania mirza).. తన కొడుకు ఇజాన్‌కి జన్మనిచ్చి నాలుగు నెలలే అయినా ఈ నాలుగు నెలల్లోనే 22 కేజీల బరువు తగ్గిందట ఈ యమ్మీ మమ్మీ.. అదెలాగో తెలుసుకొని మనమూ తనను ఫాలో అయిపోదాం రండి..
కాలం మారిపోయింది. గతంలో గర్భం దాల్చగానే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలనుకునేవారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో ఉన్నా.. తల్లులు తమ పిల్లలు పుట్టేవరకూ తన జీవనశైలిని అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు లేదా నెలల సమయం మాత్రమే తీసుకొని తిరిగి వ్యాయామం, రోజువారీ పనులు ప్రారంభించి తాము పెరిగిన బరువును తగ్గించుకుంటున్నారు.
తాజాగా సానియా కూడా నాలుగు నెలల్లోనే 22 కేజీల బరువు తగ్గింది. దీని గురించి ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ 89 కేజీల నుంచి ప్రస్తుతం 67 కిలోలకు చేరుకున్నా. నేను అనుకున్న బరువుకి చేరుకోవడానికి కనీసం ఇంకో ఐదారు వారాల సమయం పడుతుంది. ఇక్కడి దాకా చేరుకునేందుకు నేను చాలా కష్టపడ్డాను. డెలివరీకి ముందు కూడా నాకు మూడు సర్జరీలు అయ్యాయి.
అయితే డెలివరీ తర్వాత వెంటనే బరువులు ఎత్తకూడదు కాబట్టి కేవలం కార్డియోతోనే నా బరువును తగ్గించుకున్నా. వీటన్నింటిలో నా ప్రాధాన్యం బరువు తగ్గడం మాత్రమే కాదు.. టెన్నిస్ కెరీర్ తిరిగి ప్రారంభించేందుకు ఫిట్‌గా కూడా మారాల్సి ఉంటుంది. అందుకే దీని కోసం నేను కష్టపడి వ్యాయామాలు చేస్తున్నా.. అని చెప్పింది.
ఈ బరువుకి చేరుకునేందుకు సానియా ఎక్కువగానే కష్టపడింది. రోజూ వంద నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేయడంతో పాటు గంట పాటు పిలాటిస్ మరో గంట పాటు కిక్ బాక్సింగ్ చేస్తోందట. ఇంత కష్టపడుతున్నా కాబట్టే.. ఇంత త్వరగా అంత బరువు తగ్గేందుకు నాకు వీలైంది.
అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బరువు తగ్గేందుకు అందరూ ఎంచుకునే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి సెలబ్రిటీ బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకుంటుందని మీరు భావిస్తే అది తప్పవుతుంది. ప్రస్తుతానికి నా ట్రైనింగ్‌తో బరువు తగ్గడం పెద్ద కష్టంగా ఏమీ అనిపించట్లేదు. కానీ ట్రైనింగ్ కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకే అన్నీ ఒక్కసారిగా ప్రారంభించడం కాకుండా ఒక్కొక్కటీ ప్రారంభించి ముందుకెళ్తున్నా..
నేను నా శరీరాన్ని తిరిగి ఇంతకు ముందున్నట్లుగా తయారుచేసుకోవాలనుకుంటున్నా.. కాబట్టి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాను. రోజూ జిమ్‌లో కనీసం నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువే గడుపుతుంటాను. తక్కువ ట్రైనింగ్ వల్ల సమస్యలు ఎదుర్కొని నేను ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని నా భావన. అందుకే ఎలాంటి కఠినమైన శారీరక పరిస్థితులకైనా తట్టుకోవడానికి నాకు నేను సిద్ధంగా ఉంటాను అని చెబుతుంది సానియా.
ఇజాన్ పుట్టినప్పుడు నా కండరాలను కట్‌చేసి తనని బయటకు తీయాలని డాక్టర్ చెప్పినప్పుడు నాకు ఎంతో భయంగా అనిపించింది. తను పుట్టినప్పుడు ఎనిమిది కండరాలను కట్ చేసి తనని బయటకు తీశారు. వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నా. కొన్ని వారాల కిందే నా పొట్ట దగ్గర కండరాలు తిరిగి వాటి షేప్‌లోకి రావడం ప్రారంభమైంది.
ఈ ప్రక్రియను పూర్తిగా షేప్‌లోకి వచ్చేంత వరకూ కొనసాగించాలనుకుంటున్నా. ఆ రోజు నా పొట్ట దగ్గర ముట్టుకుంటే ఇంతకుముందులా మెత్తగా కాకుండా గట్టిగా అనిపించింది. ఆ రోజు నాకు అందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇలాగే కష్టపడి తిరిగి మామూలుగా మారి కోర్ట్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నా. ఆగస్టులో యూఎస్ ఓపెన్‌లో ఆడాలన్నది నా ఆలోచన. అప్పటివరకూ తిరిగి ఫిట్‌గా మారితే అప్పటి నుంచే నా కెరీర్‌ని తిరిగి ప్రారంభిస్తాను.
తల్లిగా మారడం ఎంత ఆనందాన్ని అందిస్తుందో అన్నే ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తల్లి కాకముందు నాకు ఎంతో శక్తి ఉండేది.. కానీ ఇప్పుడు కాస్త పనిచేయగానే అలసిపోతున్నా. ఇంతకుముందున్నట్లుగా శరీరాన్ని మార్చుకోవడంతో పాటు.. ఇంతకుముందున్నంత శక్తి, అలసిపోని తత్వాన్ని కూడా సంపాదించాల్సి ఉంది. నాలా ఎంతో మంది కొత్తగా తల్లైనవాళ్లుంటారు.
వారిని కూడా ఫిట్‌నెస్ దిశగా.. తన బిడ్డని వదిలి పని చేసుకోవడానికి ధైర్యాన్ని నింపేలా నా డైలీ రొటీన్‌ని పోస్ట్ చేస్తున్నా. #mamahustles పేరుతో వీటిని అందరితో పంచుకుంటున్నా. ఇవి చూసి కొంతమంది స్ఫూర్తి పొందినా చాలు.. అంటూ తన ఫిట్‌నెస్ జర్నీ గురించి పంచుకుంది సానియా..
ఇవి కూడా చదవండి.
ప్రపంచ సుందరి ఫిట్‌నెస్ రహస్యాలేమిటో మీకు తెలుసా?
హార్మోన్లు మీ బరువును పెంచేస్తున్నాయా? ఇలా చేసి చూడండి..
యోగా గురించి ఈ అపోహలు మీకూ ఉన్నాయా?
Images : Sania mirza Instagram