Food & Nightlife

రంజాన్ అంటే హలీం ఒక్కటే కాదు.. ఈ వంటకాలు కూడా ప్రత్యేకమే..!

Sandeep Thatla  |  Jun 2, 2019
రంజాన్ అంటే హలీం ఒక్కటే కాదు.. ఈ వంటకాలు కూడా ప్రత్యేకమే..!

హలీం (Haleem).. ఈ పదం వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ (Hyderabad). సాధారణంగా ఈ హలీం వంటకం మనకు రంజాన్ (Ramzan) సీజన్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో హైదరాబాద్ నగరంలో మనకు లభించే ప్రత్యేక వంటకాల్లో ఇదీ ఒకటి మాత్రమే. అంతేకానీ.. ఇదొక్కటే ప్రత్యేకం అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రంజాన్ సీజన్‌లో లభ్యమయ్యే స్పెషల్ వంటకాలు చాలానే ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో అత్యధికంగా ప్రజల ఆదరణ పొందే స్పెషల్స్ కొన్ని మీ కోసం..

సెహ్రి (Sehri) సమయంలో చార్మినార్ (Charminar) కి సమీపంలో ఉన్న హోటల్ నయాబ్ (Hotel Nayaab) లో దొరికే వంటకాల కోసం భోజన ప్రియులు ‘క్యూ’ కడతారంటే అతిశయోక్తి కాదు.

Image: Wikimedia commons

భేజా ఫ్రై (Bheja Fry)

భేజా ఫ్రై వంటకం హైదరాబాద్‌లో చాలా ఫేమస్ అని చెప్పాలి. మేక లేదా గొర్రె ‘మెదడు’తో తయారు చేసే వంటకమే ఈ భేజా ఫ్రై. ఈ వంటకాన్ని ప్రధానంగా తెల్లవారుజామున 3 నుంచి 4.30 గంటల సమయంలో హోటల్ నయాబ్‌లో వడ్డిస్తారు.

Image: Instagram

పాయా మసాలా (Paya Masala)

పాయా అంటే హిందీ & ఉర్దూలో ఎముకలు అని అర్ధం. ఇక ఈ వంటకం దేనితో తయారుచేస్తారో మీకు ఇప్పటికే అర్ధమైపోయింది కదా! మేక లేదా గొర్రె ఎముకలతో చేసే ఈ వంటకానికి అభిమానులు పెద్ద ఎత్తునే ఉంటారు. ఈ వంటకం కోసం భోజన ప్రియులు ‘క్యూ’ కడతారు. ముఖ్యంగా ఎముకలు విరిగిన సమయంలో.. దీనిని ఆహారంగా తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెబుతారు పెద్దలు.

Image: Youtube

మటన్ ఖలియా (Mutton Qaliya)

ఈ మటన్ ఖలియా వంటకాన్ని బోన్ లెస్ మటన్‌తో తయారుచేస్తారు. బోన్ లెస్ మటన్ తినాలనుకునే వారికి ఈ మటన్ ఖలియా మంచి ఎంపిక అని చెప్పాలి.

 

Image: Trip Advisor

ధమ్కా ఖీమా (Dum Ka Kheema)

మనలో ఖీమా అంటే తెలియని వారుండరు. ఇక ‘ధమ్కా ఖీమా’ అంటే.. సాధారణంగా చేసే ఖీమా‌నే ధమ్ బిర్యానీ మాదిరిగా .. అదే వంట స్టైల్‌లో తయారుచేస్తారు. ఈ వంటకానికి యువత ఎక్కువగా ఫిదా అవుతుంటారు.

Image: Facebook

అచారి చికెన్ (Achari Chicken)

దీన్నే చికెన్ పచ్చడి అని కూడా అంటారు. మనం సాధారణంగా చేసుకునే చికెన్ పచ్చడి‌కి కాస్త హైద్రాబాదీ స్టైల్‌ని జోడించి సిద్ధం చేస్తారు ఈ వంటకాన్ని…

Image: Instagram

మటన్ తలా హువా (Mutton Tala Hua)

మటన్‌ని కుక్కర్‌లో ఉడికించాక… దానిని స్టవ్ పై ఉంచి డ్రై అయ్యే వరకు వేడి చేసుకోవాలి. అలా డ్రై అయిన మటన్‌లో నూనె వేసి సెమీ ఫ్రై చేసుకుంటే మటన్ తలా హువా రెడీ అవుతుంది. దీనిని మటన్ ఫ్రై‌లా ఆరగిస్తారు భోజన ప్రియులు.

గుర్దా ఫ్రై (Gurda Fry)

ఈ వంటకాన్ని మేక కిడ్నీలతో తయారుచేస్తారు. దీనికి గుర్దా ఫ్రై అని పేరు. సాధారణంగా మనం మటన్ ఫ్రై ఎలాగైతే చేస్తామో సరిగ్గా అలాగే ఈ గుర్దా ఫ్రై కూడా తయారు చేస్తారు.

ఇక ఓల్డ్ సిటీ అంటేనే మనకి ఎక్కడ చూసినా కనిపించేది స్ట్రీట్ ఫుడ్. సాధారణ సమయాల్లో కూడా చార్మినార్ పరిసరాల్లో సరదాగా కలియ తిరుగుతూ; షాపింగ్ చేస్తూ రకరకాల వంటకాలను మనం రుచి చూస్తుంటాము.

ఇక చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్‌లో (Nimrah Cafe)  ఉస్మానియా బిస్కెట్ (Osmania Biscuit) & ఇరానీ ఛాయ్ (Irani Chai) తాగితే వచ్చే ఆ కిక్కే వేరు. మీకు తెలుసా?? సమయంతో సంబంధం లేకుండా రంజాన్ ఉపవాస దీక్షలు జరిగే నెల రోజుల పాటు 24 గంటలు ఇక్కడ దుకాణాలు తెరిచే ఉంటాయి.

అలాగే చార్మినార్ ప్రాంతంలో ఉన్న మరొక ప్రముఖ హోటల్ – హోటల్ షాదాబ్ (Hotel Shadab). ఈ హోటల్‌కి ఏటా ఎందరో సెలబ్రిటీలు.. బిర్యానీ రుచి చూసేందుకు వస్తుంటారు. వారిలో సినీ నటుడు రానా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మొదలైనవారు ఉండడం విశేషం. ఇక ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత.. ఆ పక్క గల్లీలో ఉన్న కబాబ్ సెంటర్‌కు ఓ సారి వెళ్లి రండి… అక్కడ దాదాపు 10 రకాల కబాబ్స్ మనకి లభ్యమవుతాయి. వాటి రుచి దేనికదే ప్రత్యేకం అంటే మీరు నమ్ముతారా? అంత బాగుంటాయి మరి..

అయితే రంజాన్ సీజన్‌లో లభించే మరో ప్రత్యేక వంటకమైన పథర్ కా ఘోష్ కూడా.. ఈ కబాబ్ సెంటర్‌లోనే మనకు లభ్యమవుతుంది. చికెన్, మటన్- రెండు రకాల్లోనూ ఇది ఇక్కడ లభిస్తుంది.

ఏంటీ?? అన్నీ స్పైసీ ఫుడ్స్ గురించి చెప్తున్నారే తప్ప.. స్వీట్స్ గురించి మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నామండీ.. హైదరాబాదీ స్పెషల్స్‌గా చెప్పుకునే ఖద్దూ కీ ఖీర్, ఖుబానీ కా ఖీర్, రబ్రీ, లస్సి, ఫలుదా.. వంటివి కూడా ఇక్కడ విరివిగా లభిస్తాయి. అలాగే ఇక్కడ మనకు రకరకాల పండ్ల రసాలు కూడా అందుబాటులో ఉంటాయి.

మొత్తానికి మనం రంజాన్ సీజన్‌లో చార్మినార్‌కి వెళితే.. అక్కడ ఆడవారు షాపింగ్ చేయడానికి ఎన్ని రకాల వస్తువులైతే ఉంటాయో; అదేవిధంగా భోజనప్రియులకు కూడా దాదాపు అదే సంఖ్యలో రుచికరమైన ఆహార పదార్ధాలు లభిస్తుంటాయి. నెల రోజుల పాటు జరిగే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో.. ఈ ప్రాంతమంతా రకరకాలైన వంటకాల ఘుమఘుమలతో నిండిపోతుంది.

ఏంటి? ఇది చదివాక మీకు కూడా చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించాలని ఉందా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రోజు రాత్రి వెళ్లండి. ఒకవేళ కుదరకపోతే రేపు అయినా.. ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బుధవారం (జూన్ 5) రంజాన్ పర్వదినం. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లడం కాస్త ఇబ్బందికావచ్చు. అదీకాకుండా ప్రత్యేక ప్రార్థనల కారణంగా కొన్ని అదనపు నిబంధనాలు కూడా విధిస్తారు కాబట్టి.. మామూలు రోజుల్లో ఉన్నంత స్వేచ్ఛ ఆ రోజు ఉండకపోవచ్చు.

Featured Image: Wikipedia

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..

రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!

Read More From Food & Nightlife