Entertainment

2018 మెగా హిట్ చిత్రం “రంగస్థలం”.. దర్శకుడిదే క్రెడిట్..!

Sandeep Thatla  |  Dec 27, 2018
2018 మెగా హిట్ చిత్రం “రంగస్థలం”.. దర్శకుడిదే క్రెడిట్..!

దర్శకుడు అంటే కెప్టెన్ అఫ్ ది షిప్ అంటారంటేనే ఆయన స్థానమేంటో మనకి అర్ధమవుతుంది. ఒక సినిమాని అందరికన్నా ముందే జడ్జ్ చేయగలిగే సత్తా ఉన్న క్రాఫ్టే దర్శకత్వం. ఎందుకంటే ఆయా దర్శకుడు/దర్శకురాలు చేతిలోనే సదరు సినిమా తాలూకా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఇటువంటి కీలక స్థానంలో ఉండి ఈ సంవత్సరం (2018) విడుదలైన చిత్రాలలో.. ఒక మేటి చిత్రాన్ని మలిచిన దర్శకుడి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. ఆయన మరెవరో కాదు సుకుమార్ (Sukumar). ఆయన తీసిన చిత్రమే “రంగస్థలం” (Rangasthalam).

ముందుగా మనం ఈ చిత్ర కథ గురించి మాట్లాడుకుంటే, 1980 నాటి కాలాన్ని కథకు నేపథ్యంగా తీసుకోవడం జరిగింది. రంగస్థలం అనే ఊరిలో జరిగే ఒక కల్పిత కథ ఇది. కమర్షియల్ ఫార్ములాకి తగ్గట్టుగానే దిగువ తరగతి హీరోకి.. అగ్రవర్ణానికి చెందిన ఆ ఊరి ప్రెసిడెంట్‌కి మధ్య జరిగే పోరాటమే ఈ కథ.

అయితే ఇలాంటి కమర్షియల్ చిత్రంలో కథానాయకుడి పాత్రకి చెవిటితనాన్ని ఆపాదించడమే కాకుండా.. ఆ పాత్రకి అసలు పల్లెటూళ్ళతో పరిచయమే లేని రామ్ చరణ్‌తో (Ram Charan) ఆ పాత్ర పోషింపచేయడమే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అసలు ఈ రెండు అంశాలతోనే సుకుమార్ తన వైవిధ్యాన్ని చాటుకోగలిగాడు.

ఇక మిగతా ప్రధాన పాత్రల విషయానికి వస్తే, చిట్టిబాబుకి (రామ్ చరణ్) అన్న కుమార్ బాబుగా ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకోవడం.. అదే సమయంలో చిట్టిబాబు సరసన నటించేందుకు రామలక్ష్మి పాత్రకి సమంతని (Samantha) తీసుకోవడం విశేషం. అదేవిధంగా ఊళ్ళల్లో మనకి ఎక్కువగా కనిపించే పక్కింటి అత్తల పాత్రలకి ఏ సినిమాలోనైనా ఎలాంటి ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి ఓ పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయని (Anasuya) నటింపచేసి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు లెక్కల మాస్టర్ సుకుమార్.

సుకుమార్ ఈ చిత్రంలో పాత్రలని ఎంత సహజంగా చూపే ప్రయత్నం చేసాడో.. వాటి చిత్రీకరణ కూడా అంతే నిజాయితీగా చేసాడు. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా ఒక్క కృత్రిమ సన్నివేశం లేదా అనవసరపు అభినయాలు గానీ మనకి కనిపించవు. మనం ఏదైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు గమనించే అమాయకపు మనస్తత్వాలను ఈ చిత్రంలో మనకి చూపించే ప్రయత్నం చేసి నూటికినూరు శాతం విజయవంతమయ్యాడు సుకుమార్.

ఇక ఈ కథలో కులాల మధ్య అంతరాలు, జాతి వైరుధ్యాలని తనదైన శైలిలో కథ పరంగా స్పృశించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకరకంగా పెద్ద కమర్షియల్ తెలుగు దర్శకుడుగా.. రెగ్యులర్ ఫార్మాట్‌లో కథని ముగించేయకుండా ఇటువంటి సున్నితమైన పాయింట్‌ని ప్రధానంగా తీసుకుని కథ చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం.

ఇవ్వన్ని ఒకెత్తయితే ఈ సినిమా కోసం ఒక ఊరినే సెట్‌గా వేయించడం.. అందులోనే సింహభాగం చిత్రీకరణ చేయడం గమనార్హం. దీనితో ఈ చిత్రానికి విడుదలకి ముందే మంచి క్రేజ్ వచ్చింది. సినిమాలు తీయడం హిట్ కొట్టడం అనేది ఒక సహజ పరిణామం. అయితే ఒక కమర్షియల్ కథని.. చాలా సాహసోపేతమైన శైలిలో కథానాయకుడికి ఒక లోపం సైతం పెట్టి తీయడం సాహసమే. పైగా కథని 1980లో జరిగేదిగా తీసుకుని అందులో కూడా సామాజిక అంశాలని స్పృశించి.. అదే సమయంలో స్టార్ హీరో అభిమానులకు అన్నిరకాలుగా నచ్చే చిత్రాన్ని అందివ్వడంతో కమర్షియల్ చిత్రాలకు సంబంధించి.. సుకుమార్ ఈ యేటి మేటి దర్శకుడిగా టైటిల్ సొంతం చేసుకున్నాడు అని చెప్పవచ్చు.

ఈ టైటిల్‌కి ఆయన కచ్చితంగా అర్హుడు అని చెప్పితీరాల్సిందే. ఎందుకంటే ఒక చిత్రంలో అన్ని రకాల కోణాలని ఆవిష్కరించే అవకాశం కాని.. ఆస్కారం కాని లభించదు. ఒకవేళ లభించినా కూడా.. అది అందరూ సద్వినియోగపరుచుకోలేరు. 

కాని సుకుమార్ మాత్రం తన సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా అందరికి చూపించి తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి, యూనిట్‌కి ఒక మంచి చిత్రాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

2018‌ టాలీవుడ్ సినిమాల్లో.. హాస్యపు జల్లులు కురిపించిన వారెవరంటే..?

2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

Read More From Entertainment