స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), ఫుడ్ పాండా (Food Panda).. ఇలా చెప్పుకుంటూ పోతే కోరుకున్న సమయంలో, కావాల్సిన ఆహారాన్ని మనం ఉన్న ప్రదేశానికే తెచ్చి అందించే ఫుడ్ యాప్స్ జాబితా చాలానే ఉంటుంది. అయితే వీటిలో చాలా యాప్స్‌కు విశేషమైన సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. అందుకు వారికి సదరు ఫుడ్ డెలివరీ సంస్థపై ఉన్న నమ్మకమే కారణం అని చెప్పచ్చు.
అయితే గతేడాది జొమాటో సంస్థకు చెందిన ఒక డెలివరీ బాయ్ వినియోగదారులకు అందించాల్సిన ఫుడ్ ప్యాకెట్ తెరిచి ఆహారం తినడం మాత్రమే కాకుండా తిరిగి దాన్ని సీల్ చేసి డెలివరీ చేశాడు. అయితే ఈ తతంగం అంతటినీ ఒక వ్యక్తి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. చాలామంది సదరు డెలివరీ బాయ్ చేసిన పనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా; కొందరు మాత్రం అతనితో ఆకలి ఆ పని చేయించిందంటూ వత్తాసు పలికారు. ఏదైతేనేం.. ఈ చర్యతో కంగుతిన్న జొమాటో సంస్థ ఇకపై తమ వినియోగదారులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా ప్రత్యేకమైన సీల్ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది.
సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిర్వాహకుల తప్పిదాన్ని నెటిజన్లు తప్పకుండా ఎత్తిచూపిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే- పట్టపగలే చుక్కలు చూపిస్తారు. ఇందుకు ఇదొక్కటే ఉదాహరణ కాదు.. ఇటీవలే మరో ఫుడ్ డెలివరీ సంస్థకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అదేంటంటే-
ఫిబ్రవరి 19న చెన్నైకి చెందిన భార్గవ్ రాజన్ అనే వ్యక్తి తన మొబైల్ నుంచి స్విగ్గీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ ఎక్కడికి వెళ్లిందో ఎవరైనా ఊహించగలరా?? రాజస్థాన్‌లోని ఒక హోటల్‌కి ఆ ఆర్డర్ వెళ్లింది. అంతేకాదు.. సదరు హోటల్ యాజమాన్యం ఈ ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేసి 12 నిమిషాల వ్యవధిలో మీకు బెంగళూరులో ఫుడ్ డెలివరీ చేస్తాం అంటూ మెసేజ్ కూడా పంపించింది. దీంతో షాక్ అయిన వినియోగదారుడు ఏం చేయాలో పాలుపోక.. మొత్తం మొబైల్ స్క్రీన్ షాట్స్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ స్విగ్గీ సంస్థ యాజమాన్యానికి జరిగిన ఘటన అంతటినీ వివరించారు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ కావడంతో స్విగ్గీ యాప్ నిర్వాహకులు కూడా స్పందించారు. యాక్ట్ ఆఫ్ గాడ్ లా ఇది యాక్ట్ ఆఫ్ మిశ్చీఫ్ (Act Of Mischief) అయి ఉండచ్చు అని సరదాగా సమాధానమిచ్చిన వారు ఈ ఘటనను నిశితంగా పరిశీలించి, తగిన చర్య తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిన తప్పిదం అని తేల్చారు.
కానీ ఒక్కసారి వార్త వైరల్ అయ్యాక నెటిజన్లు ఊరికే వదిలిపెడతారా చెప్పండి? అందుకే ఎవరికివారు.. వారికి నచ్చిన రీతిలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. వారిలో కొందరు.. దాదాపు 2వేలకు పైగా ఉన్న దూరాన్ని మీరు కేవలం 12 నిమిషాల్లో చేరుకోగలరంటే మీరు ఏమైనా చేయగలరంటూ కొంటెగా వ్యాఖ్యానించగా.. మా వినియోగదారుల కోసం మేం చంద్రుడిపైకి వెళ్లి రావడానికైనా సిద్ధమే అంటూ సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చారు స్విగ్గీ నిర్వాహకులు. దీంతో ఈ ఘటనకు మరింత పాపులారిటీ వచ్చినట్లైంది.
అయితే ఈ ఫన్ గురించి కాసేపు పక్కన పెడితే.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద సంస్థలు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఈ- కామర్స్ విశ్లేషకులు. గతంలో జరిగిన ఘటన ప్రభావం జొమాటో వినియోగదారుల సంఖ్యపై ప్రభావం చూపిందని, చాలా సర్వేల్లో ఆ సంస్థ వినియోగదారుల సంఖ్య తగ్గిందని తేలినట్లు వెల్లడించారు.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, చిన్న చిన్న తప్పిదాలే కదా అని తేలికగా తీసుకుంటే దాని ప్రభావం తప్పకుండా సదరు మార్కెట్ పై కనిపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది నిజమే.. ఎందుకంటే ఏ వ్యాపారానికైనా ముఖ్యంగా కావాల్సింది.. వినియోగదారుని నమ్మకాన్ని గెలుచుకోవడమే.. మరి, దానికే ఎసరు వస్తున్నప్పుడు ఇక వ్యాపారానికి అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి??
Featured Image: Pixabay
ఇవి కూడా చదవండి
శ్రద్ధాకపూర్.. పుట్టిన రోజు సందర్భంగా సాహో టీజర్..!