South Indian Actress Taapsee Pannu to play Women Cricketer Mithali Raj in her Biopic
గత రెండేళ్ళుగా భారతీయ చిత్రసీమలో ఎక్కడ చూసినా బయోపిక్స్ హంగామానే కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలలో కొన్ని మాత్రమే ప్రజాదారణ పొందగా.. మిగతావి నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. అయినప్పటికి కూడా బయోపిక్ ట్రెండ్ ఏమాత్రం కూడా తగ్గకుండా దూసుకుపోతోంది.
హిందీలోనే మాట్లాడమంటే ఎలా? నాకు తెలుగు, తమిళం కూడా వచ్చు : తాప్సీ
భాగ్ మిల్కా భాగ్, దంగల్, మేరీ కోమ్ చిత్రాలు విజయం సాధించాక.. ప్రస్తుతం మరో క్రీడా దిగ్గజం మిథాలీ రాజ్ పై సినిమా తీయడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. మన దేశంలో మహిళా క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే ..తప్పకుండా చెప్పుకునే పేరు మిథాలీ రాజ్. మన క్రికెట్ జట్టుని రెండు సార్లు వన్డే ఇంటెర్నేష్నల్ కప్ ఫైనల్స్‌కి తీసుకెళ్లిన సారధిగా.. ఇప్పటికే ఆమె చరిత్ర సృష్టించింది. అలాగే ఆమె పేరిట అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు కూడా భద్రంగా ఉంది. ప్రస్తుతం ‘టీ 20’లకి గుడ్ బై చెప్పేసి.. వన్డే క్రికెట్ పైనే దృష్టి కేంద్రీకరించి ఆడుతుందామె.
ఈరోజు మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించబోయే బయోపిక్ చిత్రం గురించిన ప్రకటన విడుదలైంది. ‘శభాష్ మిథు’ (Shabaash Mithu) అనే టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో మిథాలీ రాజ్ పాత్రలో తాప్సి పన్ను నటిస్తుండడం విశేషం.
ఇక ఈ బయోపిక్ ప్రకటనని తాప్సి పన్ను తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా మిథాలీ రాజ్‌తో కలిసి ఆమె పుట్టినరోజు కేక్‌ని కట్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా – ‘నీ పుట్టినరోజు సందర్భంగా ఏమి ఇవ్వాలో నాకు తెలియట్లేదు. అయితే నీ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ద్వారా.. తెరపై నిన్ను నువ్వు చూసుకున్పప్పుడు తప్పకుండ గర్వపడేలా మాత్రం చేస్తాను. అలా అని మాట ఇస్తున్నాను’ అని చెప్పింది.
అమెరికాలో అద్భుత యాత్ర : మన హైదరాబాదీ లేడీ బైకర్ ‘జయభారతి’ సాధించిన వినూత్న రికార్డ్
దీనికి ప్రతిగా.. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ కూడా ఒక్క క్రికెట్‌లోనే కాకుండా.. అన్ని రంగాల్లోనూ మహిళలకు సరైన ప్రోత్సాహం, పాత్ర ఉండానే కోరుకుంటాను. ఇప్పుడు ఈ బయోపిక్ ద్వారా నా గొంతుకని మరింతమందికి చేర్చేలా చేస్తున్నందుకు నిర్మాత అజిత్, వయాకామ్ 18 వారికి నా కృతజ్ఞతలు’ అంటూ పేర్కొంది.
ఇక ఈ ‘శభాష్ మిథు’ చిత్రాన్ని హిందీతో పాటుగా తెలుగులో కూడా తెరకెక్కిస్తారని టాక్. ఎందుకంటే మిథాలీ రాజ్ స్వస్థలం హైదరాబాద్ కావడం.. అలాగే ఆమె క్రికెట్ కెరీర్ మొదలుపెట్టింది కూడా ఇక్కడ నుండేనన్న విషయం తెలిసిందే. ఇక తాప్సి విషయానికి వస్తే.. ఆమె హీరోయిన్‌గా తొలి సక్సెస్ అందుకుంది కూడా తెలుగులోనే. ఇన్ని కారణాలు ఉన్న నేపథ్యంలో.. ఈ బయోపిక్ తెలుగులో కూడా తెరకెక్కే అవకాశం కచ్చితంగా ఉందనుకోవచ్చు. రాహుల్ డోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంగా.. వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది.
ఇటీవలే వృద్ధ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల కథను “శాండ్ కీ ఆంఖ్” పేరుతో బయోపిక్‌గా తెరకెక్కించగా.. అందులో భూమి పడ్నేకర్‌తో కలిసి తాప్సీ నటించి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరల తాప్సీ మరో క్రీడాకారిణి మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటించడానికి పచ్చ జెండా ఊపడం విశేషం. ఈ చిత్రంతో పాటు మరో క్రీడాకారిణి బయోపిక్‌లో కూడా తాప్సీ నటించనుంది. గుజరాత్‌కి చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రను ఆమె పోషించనుంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకి ‘రష్మీ రాకెట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
దీనిని బట్టి.. భారతీయ చిత్రసీమలో ప్రముఖ మహిళా క్రీడాకారుల బయోపిక్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా.. ‘తాప్సి పన్ను’ నిలిచింది అంటే అతిశయోక్తి కాదేమో!
ఆ చిత్రం.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని మలుపు తిప్పింది.. ఎలాగో తెలుసా..?