
సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు. అవే – పతంగులు (గాలి పటాలు) & పిండి వంటలు. ఇంటికి తొలిపంట వచ్చిన వేళ రైతన్నలు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా చేసుకునే పండగే ఈ సంక్రాంతి. సంక్రాంతి పర్వదినాన ప్రతీ యేటా పల్లెల్లో గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వచ్చే ఆచారం. తర్వాత ఆ సంప్రదాయం నగరాలకు కూడా పాకింది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం వివిధ ప్రాంతాల్లో గాలిపటాల పోటీలు (పతంగుల పండగ) నిర్వహిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు మూడేళ్ల నుండి హైదరాబాద్ వేదికగా గాలిపటాల పోటీలను, మిఠాయిల వేడుకను నిర్వహిస్తోంది.
వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ (Telangana International Kite Festival – TIKF 2019) పేరిట సికంద్రాబాద్ ప్రాంతంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 13, 14 & 15 తేదీల్లో వేడుకలు జరగనున్నాయి. ఈ కైట్స్ ఫెస్టివల్ గత మూడు సంవత్సరాల నుండి విజయవంతంగా తెలంగాణ టూరిజం (Telangana Tourism) శాఖ నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో కైట్స్ ఫెస్టివల్ నాల్గవ సంవత్సరాన్ని పూర్తి చేయనుంది. ఇక ఈ ఫెస్టివల్‌కి కైట్స్ ప్రొఫెషనల్స్ అనేకమంది హాజరవుతున్నారు. ఇదే ఫెస్టివల్‌లో గాలిపటాల తయారీతో పాటు.. గాలిపటాలను ఎలా ఎగరవేయాలి లాంటి అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు.
సాధారణంగా ఈ వేడుకలో గాలిపటాలను ఎగరవేయడానికి ఎటువంటి ప్లాస్టిక్ లేదా మాంజా వంటివి ఉపయోగించరు. కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ ఫెస్టివల్‌ని ఎకో-ఫ్రెండ్లీ వేడుకలుగా నిర్వహిస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో ఈ సంవత్సరం “నైట్ కైట్ ఫ్లయింగ్” వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రి పూట కైట్స్‌ని ఎగరేసే పద్దతిని తొలిసారిగా ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు.
ఈ వేడుకలో భాగంగా.. మూడు రోజుల పాటు ఉదయం & మధ్యాహ్నం గాలిపటాలను ఎగరవేస్తారు. అలాగే ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన “నైట్ కైట్స్ ఫ్లై” వేడుకను ప్రతిరోజూ రాత్రి 6.30 నుండి 8.00 వరకు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
ఇదిలావుండగా.. కైట్స్ ఫెస్టివల్‌తో పాటుగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ (International Sweets Festival)ని అనగా మిఠాయిల పండగను కూడా తెలంగాణ టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఈ స్వీట్స్ ఫెస్టివల్ ఆదివారం అనగా.. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలుకానుంది. ఈ ఫెస్టివల్ కూడా మూడు రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరగనుంది.
ఇక ఈ స్వీట్స్ ఫెస్టివల్ కోసం దేశంలోని 25 రాష్ట్రాల నుండి రెండు రకాల స్వీట్స్ చొప్పున మొత్తం 50 స్వీట్ ఐటమ్స్ ప్రదర్శించబోతున్నారు. అలాగే వీటితో పాటు వివిధ దేశాల నుండి కూడా అనేక రకాల స్వీట్స్‌ని కూడా ప్రదర్శనలో స్థానం కల్పించబోతున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు చాలా మంది ఔత్సాహికులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని తమ చేతితో చేసిన పిండి వంటలను జనాలకు రుచి చూపించనున్నారు.
ఇలా జనవరి 13, 14 & 15 తేదీల్లో కైట్స్ & స్వీట్స్ ఫెస్టివల్స్ భాగ్యనగర వాసులని అలరించబోతున్నాయి. ఇక ఈ ఆర్టికల్ చదివాక మీరు కూడా పండగపూట గాలిపటాలను ఎగరవేయడానికి లేదా మిఠాయిలు తినడానికి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కి ఆ మూడు రోజుల్లో మీ కుటుంబంతో సహా వెళ్లి ఎంజాయ్ చేయండి.
Images: Telangana Tourism, Shutterstock
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌కి వెళ్లాల్సిందే..!
ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్