
(Telugu Anchor Anasuya Bharadwaj Love Story)
అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం టీవీ షోలలో మాత్రమే కాకుండా.. సినిమాలలో కూడా అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తూ.. ఆడియన్స్‌ని తన మాయలో పడేస్తోంది ఈ సెలబ్రిటీ యాంకర్. అయితే అనసూయది ప్రేమ వివాహం అని.. ఆమె భర్త భరద్వాజ్ అని.. ఆమె సోషల్ మీడియా పేజీలను అనుసరించే వారందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అనసూయ తన సోషల్ మీడియా పేజీలలో తన ఇల్లు, తన కుటుంబసభ్యులకు సంబంధించిన పోస్టులే ఎక్కువగా పెడుతుంది.
“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!
అయితే అనసూయ ప్రేమ వివాహం గురించి చాలామందికి తెలిసినా.. ఆమె అందమైన ప్రేమకథ గురించి మాత్రం చాలా తక్కువమందికే తెలుసు. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం. అదేవిధంగా ఈ ప్రేమకథ.. ఇప్పటి యువతరానికి ఒక ప్రేరణగా ఉంటుందని కూడా కచ్చితంగా చెప్పేయచ్చు..
ఇక ఈ ప్రేమకథలోకి వెళితే, అనసూయ 12వ తరగతి (ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం) చదువుతున్న సమయంలో ఓసారి NCC క్యాంప్‌కి వెళ్లిందట. పైగా ఆ క్యాంప్‌కి తానే గ్రూప్ కమాండర్ కావడంతో.. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారికి శిక్షలు కూడా వేసేదట. ఈ క్రమంలో అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్.. ఈమెని చూసి తన మనసు పారేసుకున్నాడట.
అంతే.. అనుకున్నదే తడవుగా.. ఇక ఆలస్యం ఏమీ చేయకుండా వెంటనే వచ్చి.. తన మనసులోని మాటని చెప్పేశాడట. అలాగే తననే పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడట. ఆ వయసులో అసలు ప్రేమంటేనే తెలియదంటే.. నేరుగా పెళ్లి అన్నాడేంటని ఆలోచించి ఆశ్చర్యపోయిందట అనసూయ. అందుకే ఏమీ స్పందించకుండా ఉండిపోయిందట. ఆ తర్వాత ఆ క్యాంప్ ముగియడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. కానీ సరిగ్గా ఏడాదిన్నర తరువాత.. మరలా వారిద్దరూ క్యాంప్‌లో కలిసి మాట్లాడుకొనే సమయానికి.. అనసూయకు భరద్వాజ్ పై మంచి అభిప్రాయం కలగడం విశేషం.
అలా తనపై మంచి అభిప్రాయం కలిగిన తరువాత.. నెమ్మదిగా ఆమెకు అతనిపై ఇష్టం, ప్రేమ మొదలయ్యాయట. ఇక ఈ విషయం కేవలం అనసూయ తల్లికి మాత్రమే తెలుసు. కానీ అనసూయకి ఇద్దరు చెల్లెలు ఉండడంతో.. అనసూయకి మంచి సంబంధం చూసి చేస్తే… మిగతావారికి కూడా మంచి సంబంధాలు వస్తాయని అనుకునేవారట అనసూయ తండ్రి.
ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు.. రాహుల్ – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..
అయితే భరద్వాజ్‌తో అనసూయ ప్రేమ మొదలైన మూడేళ్ళ తరువాత.. ఆమెకు ఇంట్లో వాళ్లు ఓ రోజు ఒక సంబంధం తీసుకువచ్చారట. అప్పుడు ఆమె తన ప్రేమ విషయం చెప్పేసరికి.. తన ఇంటిలో చాలా గొడవలు జరిగాయట. ఆ తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసి… కొన్నాళ్లు హాస్టల్‌లో ఉందని.. ఆ తర్వాత మరలా ఆమెను ఇంటిలోకి రానిచ్చినా.. భరద్వాజ్‌తో పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదని అంటారు.
అయితే ఈ క్రమంలో అనసూయ తన నిర్ణయాన్ని కరాకండీగా చెప్పేయడం గమనార్హం. ” మీరు నాకు నచ్చిన భరద్వాజ్‌తో పెళ్లి చేసే వరకు నేను ఎక్కడికీ వెళ్ళను” అంటూ అనసూయ మొండి పట్టుదలతో చెప్పేయడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏమీ అనలేకపోయారట. అయితే తండ్రి, కూతుళ్ళ మధ్య సఖ్యత రావడానికి.. వీరి పెళ్ళికి ఆయన పచ్చ జెండా ఊపడానికి చాలాకాలం పట్టిందట. చిత్రమేంటంటే.. భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చేసిన.. 9 ఏళ్ళ తరువాత వీరి పెళ్లి జరిగిందట. ఈ 9 ఏళ్ల కాలంలో అప్పుడప్పుడు ఓపిక నశించి అనసూయ తన నిర్ణయాన్ని బల్లగుద్ది మరీ చెప్పేదట. “మనం బయటకి వెళ్లి పెళ్లి చేసుకుందాం” అని ఆమె చెప్పినా సరే.. పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని సర్ది చెప్పేవాడట భరద్వాజ్.
2010 ఫిబ్రవరి 10 తేదిన అనసూయ – భరద్వాజ్‌ల ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది. ఆ తర్వాత వీరిరువురికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారే శౌర్య భరద్వాజ్, అయాన్ష్ భరద్వాజ్. ఇంకొన్ని రోజుల్లో.. వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తవబోతోంది. మరి ఈ తరుణంలో.. ఈ జంటకి మనం కూడా బెస్ట్ విషెస్ తెలియచేద్దామా
ఒకరకంగా చెప్పాలంటే.. ప్రేమించుకున్నాక.. పెద్దలను సైతం ఒప్పించాలనే వీరిరువురి నిర్ణయం చాలా గొప్పది. ఇప్పటితరం యువతకి ఇదొక మంచి ప్రేరణ అనే చెప్పాలి.