Lifestyle

#HappyBirthday Sania Mirza : టెన్నిస్ ప్రపంచంలో ఎగిసిన.. హైదరాబాదీ కెరటం సానియా మీర్జా ..!

Babu Koilada  |  Nov 15, 2019
#HappyBirthday Sania Mirza : టెన్నిస్ ప్రపంచంలో ఎగిసిన.. హైదరాబాదీ కెరటం సానియా మీర్జా ..!

(Hyderabad Sports Icon and Tennis Star Sania Mirza Birthday Special)

సానియా మీర్జా.. ఈ పేరు వింటేనే హైదరాబాద్ గుర్తుకొస్తుంది. అంతకు మించి టెన్నిస్ ప్రపంచంలో ఆమె నమోదు చేసిన రికార్డులు గుర్తుకొస్తాయి. భారతదేశ టెన్నిస్ చరిత్రను తిరగరాసిన ఓ అత్యుత్తమ క్రీడాకారిణి గుర్తుకొస్తుంది. సింగిల్స్‌‌తో కెరీర్ ప్రారంభించినా.. ఆ తర్వాత డబుల్స్‌లో కూడా రాణించి ప్రపంచ ‘నెంబర్ 1’గా ఎదిగిన ఓ అతివ పోరాట పటిమ గుర్తుకొస్తుంది. అంతే కాదు.. 2005లో టైమ్ పత్రిక  “50 హీరోస్ ఆఫ్ ఆసియా” అనే ఒక జాబితాను ప్రకటిస్తే.. అందులో స్థానం సంపాదించుకున్న అమ్మాయిగా అందరినీ ఆశ్చర్యపరిచిన.. ఓ రియల్ స్పోర్ట్స్ ఉమన్ గుర్తుకొస్తుంది.

చరిత్ర సృష్టించిన మన ‘సింధు’ విజయం గురించి.. ఈ విషయాలు తెలుసా ?

ఇంకా ఆమె గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఆమె ప్రతిభా పాటవాల గురించి పేజీలకు పేజీలే రాయచ్చు. ఏదేమైనా సానియా మీర్జాను “ప్రైడ్ ఆఫ్ ఇండియా” అనడంలో ఎలాంటి సందేహం లేదు. ది ఎకనమిక్ టైమ్స్  “33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్” జాబితాలో సానియాకు చోటు కల్పించి..  ఆ కితాబును ఎప్పుడో ఇచ్చేసింది. అంతేకాకుండా ఐక్యరాజసమితి తరఫున ప్రపంచ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. గౌరవ అంబాసిడర్‌గా సానియా ఓ విభిన్న పాత్రనే పోషించింది. ఈ రోజు ఈ మేటి టెన్నిస్ తార తన 33 పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా..  POPxo పాఠకుల కోసం ఈ కథనం ప్రత్యేకం.

సానియా మీర్జా 4 నెల‌ల్లో 22 కేజీల బ‌రువు త‌గ్గింది.. ఎలాగో తెలుసా..?

1986 నవంబరు 15 తేదిన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతంలో పుట్టిన సానియా మీర్జా.. చాలా చిన్నతనంలోనే హైదరాబాద్ ప్రాంతానికి తన కుటుంబం మకాం మార్చడంతో.. తెలంగాణకు వచ్చేసింది. ఈ ప్రాంతంలోనే ఆమె తొలిసారిగా టెన్నిస్ ఆడడానికి అంకురార్పణ జరిగింది. ఆరవ ఏటనే టెన్నిస్ ఆడడం ప్రారంభించిన సానియాకి తొలి గురువు ఆమె తండ్రే. సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఓ బిల్డర్. తల్లి నసీమా ప్రింటింగ్ బిజినెస్ చేసేవారు. తన మీద తన తండ్రి ప్రభావం ఎంతగానో ఉండేది. హైదరాబాద్‌లోని నసర్ స్కూలులోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది సానియా మీర్జా.

 

 

తాను చిన్నప్పుడు క్రీడల్లో రాణించడానికి అన్ని విధాలుగా సహాయపడిన తండ్రికి.. అలాగే తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన స్కూలు యాజమాన్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతూ ఉంటుంది సానియా. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సానియా.. ఒకవైపు చదువుకుంటూనే.. క్రీడలలో తన సత్తాను చాటడం విశేషం. సానియా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారే సమయానికి.. తన వయసు కేవలం 16 సంవత్సరాలే. టెన్నిస్‌తో పాటు తన కాలేజీ రోజుల్లో క్రికెట్ కూడా ఆడేది సానియా. అలాగే స్విమ్మింగ్ అంటే కూడా ఆమెకు ఎడతెగని మక్కువ.

హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

తన టెన్నిస్ కెరీర్‌ను సింగిల్స్‌తో ప్రారంభించిన సానియా.. ఆ తర్వాత నెమ్మదిగా డబుల్స్ వైపు మొగ్గు చూపింది. అదే డబుల్స్ కెరీర్‌లో ఒకానొక సందర్బంలో.. నెంబర్ 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. డబుల్స్‌లో మూడు సార్లు గ్రాండ్ శ్లామ్ విజేతగా నిలిచిన సానియాకి.. ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలవడం కేవలం ఆశగానే మిగిలిపోయింది. కానీ మిక్స్‌డ్ డబుల్స్‌లో భాగంగా ఆమెకు ఆ ఆశ నెరవేరింది. 2010లో పాకిస్తాన్ క్రికెటర్.. అప్పటి పాక్ క్రికెట్ జట్టు సారథి షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియా.. 2018లో ఓ మగబిడ్డకు జన్మినిచ్చింది. ఆ బిడ్డకు ఇజాన్ మీర్జా మాలిక్ అని నామకరణం చేశారు సానియా దంపతులు. 

ప్రస్తుతం సానియా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌లో ఓ టెన్నిస్ అకాడమీని సైతం ఆమె ప్రారంభించింది. 2016లో తన ఆత్మకథను వెలువరించింది. “Ace Against Odds” పేరుతో విడుదలైన ఈ ఆత్మకథలో ఆమె తన క్రీడా జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను గురించి.. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. 2004లో క్రీడారంగంలో చేసిన సేవలకు గాను అర్జున అవార్డు అందుకున్న సానియా మీర్జా.. 2006లో పద్మశ్రీ పురస్కారం.. 2015లో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం.. అలాగే 2016లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని పొందడం విశేషం.

Image: Instagram.com/Sania Mirza

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.
 

 

 

Read More From Lifestyle