Budget Trips

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

Sandeep Thatla  |  Jun 12, 2019
రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రప్రథమ వరుసలో మనకి కనిపించేది రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City). దాదాపు మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ చిత్రాల షూటింగ్‌లు ఇక్కడేల జరుగుతుంటాయి. అలాగే దాదాపు 1666 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఫిలిం సిటీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్‌గా 2005లో గుర్తించడం జరిగింది.

1996లో ఈ ఫిలింసిటీని ప్రారంభించగా.. ఇందులో దాదాపు 47 సౌండ్ స్టేజెస్‌తో పాటు.. ఒక సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఫిలిం సిటీలో కృత్రిమమైన థీమ్ పార్క్స్, ఫిలిం సెట్స్ వంటివి చాలానే ఉన్నాయి.

అయితే ఈ ఫిలిం సిటీని చేరుకోవడానికి, చూడడానికి ఎంత సమయం పడుతుంది? టికెట్ల ధర ఎంత? అసలు ఈ ఫిలిం సిటీలో ప్రధానంగా మనం ఏం చూడవచ్చు? లాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం ..

Vintage Bus – Ramoji Film City

రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి?

ముందుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి.. హైదరాబాద్ నగరం నుండి సుమారు అరగంట నుండి గంట సమయం పట్టచ్చు. ట్రాఫిక్‌ని బట్టి మనం ఫిలిం సిటీకి చేరుకునే సమయం ఆధారపడి ఉంటుంది. ఇక వివిధ రకాల ప్యాకేజీల విషయానికి వస్తే, ప్రధానంగా రామోజీ డే టూర్ ప్యాకేజీ, రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్ అంటూ రెండు ప్రధానమైనవి ఉన్నాయి.

ఈ కథనం కూడా చదివేయండి: హైదరాబాద్ మెట్రో వేదికగా.. మహిళల కోసం “తరుణి ఫెయిర్”..!

Theme Park – Ramoji Film City

రామోజీ ఫిలిం సిటీ.. టూర్ ప్యాకేజీల వివరాలు

రామోజీ డే టూర్ ప్యాకేజీ –

సమయం – ఉ 9.00 నుండి సా 5.30 వరకు

టికెట్ ధర – 1150 (పెద్దలకు) & 950 (పిల్లలకు)


రామోజీ స్టార్ ప్యాకేజి –

సమయం – ఉ 9.00 నుండి సా 5.30 వరకు

టికెట్ ధర – 2249 (పెద్దలకు) & 2049 (పిల్లలకు)

డే టూర్ ప్యాకేజీలో సాధారణంగా ఫిలిం సిటీని.. మనం చూడడానికి ఒక ఎరుపు రంగు వింటేజ్ బస్‌ను కేటాయిస్తారు. కాకపోతే ఉచిత భోజనం లేదా స్నాక్స్ సదుపాయం ఉండదు. అందుకు వేరేగా ధర చెల్లించాలి. అదే స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో అయితే చాలా సౌలభ్యాలున్నాయి. తొలుత మనం ఫిలింసిటీ తిరగడానికి ఏసీ బస్ సదుపాయం ఉంటుంది.

అలాగే ఆరోజు మనకి ఉదయం వెళ్ళగానే చాక్లెట్లు ఇచ్చి స్వాగతం పలుకుతారు. అలాగే మధ్యాహ్నం బఫెట్ లంచ్ సదుపాయం కల్పిస్తారు. సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు. సాధారణ ప్యాకేజీ ద్వారా మనం చూడని ప్రదేశాలు కూడా.. ఈ ప్యాకేజీ ద్వారా చూసేందుకు వీలుంటుంది.

Fine Dining Restaurant – Ramoji Film City

రామోజీ ఫిలిం సిటీలో ఆకర్షించే ప్రదేశాలు

ఇవే కాకుండా స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో భాగంగా.. రామోజీ మూవీ మ్యాజిక్‌లో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే యురేకా వద్ద జరిగే వినోద కార్యక్రమాలకు కూడా స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎక్కడా కూడా క్యూ లైన్స్ లో వేచి ఉండే పరిస్థితి ఉండదు. ఇవే స్టార్ ఎక్స్పీరియన్స్ & సాధారణ డే ప్యాకేజీకి ఉన్న ప్రధానమైన తేడాలు.

ఇక రామోజీ ఫిలిం సిటీలో సినిమా స్టూడియోస్ మాత్రమే కాకుండా.. పర్యాటకులని ఆకర్షించేవి చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి బర్డ్స్ పార్క్ & బటర్ ఫ్లై పార్క్. ఈ రెండు పార్కులలో విదేశాలకు చెందిని ఎన్నో అరుదైన జాతి పక్షులని చూడచ్చు. అదే సమయంలో ఆ ప్రదేశంలోని ప్రకృతి అందాలను కూడా వీక్షించవచ్చు. వీటితో పాటుగా బోన్సాయ్ గార్డెన్, వింగ్స్ వంటి ప్రత్యేక పార్కులని కూడా మనం చూడవచ్చు. ఈ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఏకో జోన్‌గా పిలుస్తుంటారు.

అయితే ఈ ఫిలిం సిటీలో పిల్లలని ఆకర్షించేవి కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేవి – ఫందుస్థాన్, రెయిన్ డ్యాన్స్, బోరాసుర.. అలాగే ఫన్ రైడ్స్ అయిన – బ్రేక్ డ్యాన్స్, ట్విస్టర్, సూపర్ జెట్ వంటివి చాలానే ఉన్నాయి. వీటన్నిటిని ఫన్ జోన్‌గా పిలుస్తుంటారు.

ఈ కథనం కూడా చదివేయండి: హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!

Cartoon City – Ramoji Film City

వసతి, భోజన సదుపాయం & షాపింగ్ వివరాలు

రామోజీ ఫిలిం సిటీలో పర్యటకులు.. రెండు మూడు రోజులు బస చేసేందుకు వీలుగా హోటల్స్ కూడా ఉన్నాయి. ఫిలిం స్టార్స్ ఎక్కువ శాతం డాల్ఫిన్, సితార, తార హోటల్స్‌లో షూటింగ్ సమయంలో బస చేస్తుంటారు. ఇవే కాకుండా శాంతినికేతన్, సహారా, వసుంధర విల్లాలు కూడా పర్యటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మహిళలు షాపింగ్
చేసుకోవడానికి అనువైన మాల్స్ ఎన్నో లోపల ఉన్నాయి.

ఈ కథనం కూడా చదివేయండి: హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!

Sitara Hotel, Ramoji Film City

అందరిని ఆకర్షిస్తున్న బాహుబలి సెట్

ఇవ్వన్నీ పక్కన పెడితే, ప్రస్తుత కాలంలో రామోజీ ఫిలిం సిటీలో పర్యాటకులని ఎక్కువగా ఆకర్షిస్తోంది బాహుబలి సెట్. ఈ రోజుల్లో పర్యాటకుల్లో ఎక్కువ భాగం మంది.. బాహుబలి సెట్ చూడడానికే ఇక్కడకు వస్తున్నాయి. ఆ సెట్‌లో మహిష్మతి రాజ్యానికి సంబందించి ప్రధాన కట్టడాల నమూనాలతో పాటుగా.. షూటింగ్ చేసిన సమయంలో వేసిన సెట్స్ కూడా ఉన్నాయి. బాహుబలి సెట్‌ని సందర్శిస్తున్న అనేకమంది.. ఆ నమూనాలతో సెల్ఫీలు కూడా దిగి సోషల్ మీడియాల్లో పోస్టు చేయడం గమనార్హం.

Bahubali Set – Ramoji Film City

చివరగా.. హైదరాబాద్‌ని సందర్శించాలనుకునే పర్యాటకులు, ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీ కోసం వచ్చే వాళ్ళకి.. అది ఒక మరపురాని ప్రదేశంగా గుండెల్లో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

Read More From Budget Trips