Lifestyle
ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే.. ఇలా ప్రయత్నించి చూడండి.. ! (Weight Gain Tips In Telugu)
మనలో చాలామంది పెరిగిన బరువు తగ్గడం (weight loss) ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరు తక్కువ బరువున్నవారు మాత్రం బరువు ఎలా పెరగాలా (weight gain) అని ఆలోచిస్తూ ఉంటారు. 2025 లోపు మన దేశంలో 17 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువుతో బాధపడే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.
Table of Contents
- మీ శరీర బరువు సరైన స్తాయిలో ఉందా? లేదా? తెలుసుకోవడానికి చూడాల్సిన ప్రమాణాలు (What Is BMI)
- ఎక్కువగా బరువు తగ్గడానికి కారణాలేంటి? (Reasons To Loose Weight Or Difficulty In Gaining Weight)
- బరువు తక్కువగా ఉండడం వల్ల ప్రభావాలు.. (Effects Of Being Uderweight)
- బరువు సమస్యను ఎదుర్కోవడం ఎలా? (Healthy Weight Gain Tips In Telugu)
- మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషక పధార్థాలు (Nutritional Weight Gain Food To Take)
- ఇంట్లో చేసే ప్రొటీన్ స్మూతీలు (Protein Smoothies To Make At Home)
- కండరాల బరువు ఎలా పెంచాలి? (How To Gain Muscle Weight)
- తరచూ అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
అందుకే మన దేశానికి స్థూలకాయం పెద్ద సమస్యగా పరిణమించింది. ఇదంతా నాణెేనికి ఒకవైపు అయితే.. మరో వైపు దేశంలో తక్కువ బరువుతో సతమతమవుతున్న జనాలు కూడా ఎక్కువవుతున్నారు. వీరిలో పోషకాహార లోపం కూడా ఎక్కువవుతోంది. చాలామంది గుర్తించని విషయం ఏంటంటే.. ఎక్కువ బరువు ఉండడం ఎంత హానికరమో.. తక్కువ బరువు ఉండడం కూడా అంతే హానికరం.
మీరు మరీ తక్కువ బరువు లేకపోయిప్పటికీ.. కాస్త కండలు పెంచాలనే (muscle building) ఆలోచన మీకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో బరువు పెరగడం, కండలు పెంచడం.. ఈ రెండింటికీ ఒకే తరహా టెక్నిక్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనం కూడా బరువు పెరగడానికి ఉపయోగపడే సమాచారం గురించి తెలుసుకుందాం రండి.
మీ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 18.5 కంటే తక్కువగా ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నారని అర్థం. 25 కంటే ఎక్కువ బీఎంఐ ఉంటే అధిక బరువు అని.. 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అని అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తి బీఎంఐ 18.5 నుంచి 25 మధ్యలో ఉండాలి. బీఎంఐ లెక్కగట్టేందుకు బరువును కేజీల్లో.. ఎత్తును మీటర్లలో కొలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బరువును ఎత్తుతో భాగించాలి. వచ్చిన సంఖ్యను మరోసారి మీ ఎత్తుతో భాగిస్తే వచ్చేదే బీఎంఐ. మీరు మీ బీఎంఐని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
మీ శరీర బరువు సరైన స్తాయిలో ఉందా? లేదా? తెలుసుకోవడానికి చూడాల్సిన ప్రమాణాలు
ఎక్కువగా బరువు తగ్గడానికి కారణాలేంటి?
బరువు తక్కువగా ఉండడం వల్ల ప్రభావాలు..
బరువు సమస్యను ఎదుర్కోవడం ఎలా?
మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషక పధార్థాలు
మీ శరీర బరువు సరైన స్తాయిలో ఉందా? లేదా? తెలుసుకోవడానికి చూడాల్సిన ప్రమాణాలు (What Is BMI)
మీ శరీర బరువు తక్కువగా ఉందని మీరు గుర్తించేందుకు మీ శరీరం మీకు కొన్ని లక్షణాలు చూపుతుంది. ఇవి కొన్ని సమస్యలు కావచ్చు లేదా ఇంకేదైనా ఇబ్బంది కావచ్చు. వీటి ఆధారంగా మీరు తక్కువ బరువున్నారని తెలుసుకునే వీలుంటుంది. అవేంటంటే..
– తరచూ అనారోగ్యం పాలవ్వడం
– చర్మం, జుట్టు, పళ్ల సమస్యలు
– చాలా నీరసంగా అనిపించడం
– రక్తహీనత
– నెలసరి క్రమంగా రాకపోవడం
– ఎదుగుదల నెమ్మదిగా ఉండడం
Also Read: బరువు నష్టం కోసం చిట్కాలు (Tips For Weight Loss)
ఎక్కువగా బరువు తగ్గడానికి కారణాలేంటి? (Reasons To Loose Weight Or Difficulty In Gaining Weight)
బరువు తగ్గడానికి లేదా మీరు బరువు పెరగకపోవడానికి గల కారణాలేంటి? ముందు మీ జీర్ణక్రియ గురించి తెలుసుకోవాల్సిందే. మీరు తీసుకునే ఆహారం నుంచి వచ్చే క్యాలరీలు మీ శరీరం ఉపయోగించుకునే క్యాలరీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. అవి మీ శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. మనం ఆహారం తక్కువగా తీసుకోవడం లేదా ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉండే వీలుంటుంది. మన రోగనిరోధక వ్యవస్థలో 70 శాతం మన కడుపులోనే ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటే మనం ఆరోగ్యకరమైన బరువుతో ఉండే వీలుంటుంది. మన డైట్‌ని చెక్ చేసుకొని కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వీలుంటుంది.
బరువు తక్కువగా ఉండడం వల్ల ప్రభావాలు.. (Effects Of Being Uderweight)
ఏ వ్యక్తికైనా బరువు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదమే. ఈ రెండు కేటగిరీల వారికి ఆరోగ్య సమస్యలతో పాటు రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవి మీ రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. అలాగే ఆస్టియోపొరోసిస్ లాంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. తక్కువ లేదా ఎక్కువ బరువు ఉండడం వల్ల సంతానలేమితో పాటు ఎముకలు బలహీనమై విరిగిపోయే సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
Also Read: బరువు నష్టం ఆహారం ప్రణాళిక (Weight Loss Diet Plan)
బరువు సమస్యను ఎదుర్కోవడం ఎలా? (Healthy Weight Gain Tips In Telugu)
సన్నగా ఉండడం ఆరోగ్యం అనుకుంటారు చాలామంది. కానీ బరువు తక్కువగా ఉండడం కూడా అనారోగ్యంతో సమానమే. అందుకే ఆరోగ్యకరమైన పద్దతులను ఉపయోగించి.. బరువు పెరిగేందుకు (weight gain) ప్రయత్నించాలి. ఇందుకోసం
ఎక్కువ సార్లు తినాలి.. (Eat More)
రోజుకు కేవలం మూడు పూటల తిండితోనే సరిపెట్టుకోకుండా.. ఆరు సార్లు తక్కువ మోతాదుల్లో తినడం అలవాటు చేసుకోవాలి.
పోషకాలున్న ఆహారం (Have Nutiritious Diet)
మీరు రోజూ తినే ఆహారంలో మీ శరీరానికి సరిపోయే పోషకాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ముడిధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలు, కూరగాయలు, పండ్లు, డైరీ ఉత్పత్తులు.. ఇలా అన్నింటినీ తీసుకుంటున్నామా? లేదా సరిచూసుకొని ఏదైనా మిస్సయితే.. దాన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
స్మూతీలు ప్రయత్నించండి (Drink Smoothies)
కోలాలు, సోడాలు ఎన్ని తాగినా అప్పటికి కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కానీ దానివల్ల మన శరీరానికి ఎలాంటి మేలు జరగదు. అందుకే వీటి బదులు పోషకాలుండే పండ్లతో స్మూతీలు, షేక్స్ చేసుకోవడం.. వాటిని తీసుకోవడం మంచిది.
ఎక్కువగా తాగకండి. (Don’t Drink Too Much)
చాలామంది నీళ్లు, టీ, కాఫీల్లాంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీటివల్ల కడుపు నిండినట్లుగా అనిపించి ఆహారం ఎక్కువగా తినలేరు. అందుకే వీటి బదులు క్యాలరీలు ఎక్కువగా ఉన్నా.. ఆరోగ్యానికి మంచివైన డ్రింక్స్ తీసుకోవడం మంచిది.
స్నాక్స్ ఇలాంటివే.. (Choose The Right Snacks)
చాలామంది బరువు పెరగాలంటే ఫాస్ట్ ఫుడ్ తినాలని భావిస్తారు. కానీ అది సరికాదు. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే పీనట్ బటర్, నట్స్, చీజ్, అవకాడో, ఇతర పండ్లు మీ స్నాక్స్‌లో భాగంగా తీసుకోవాలి.
క్యాలరీలు పెంచండి. (Increase Calories Intake)
ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తినాలంటే.. మీరు రోజూ తీసుకునే ఆహారానికే క్యాలరీలను జోడించవచ్చు. దీనికోసం మీరు తినే ఆమ్లెట్‌పై చీజ్ వేసుకోవడం, మీ కూరల్లో సాధారణ పాలకు బదులు ఫుల్‌క్రీమ్ పాలు, మీరు తాగే కాఫీలో క్రీం చేర్చుకోవడం వంటివి చేస్తే బెటర్.
అప్పుడప్పుడూ మాత్రమే (Eat Fatty Diet Only Occasionally)
చాలామంది బరువు పెరిగేందుకు (weight gain) కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ ఇలాంటివి తీసుకోవడం మంచిదే. కానీ రెగ్యులర్‌గా తీసుకుంటే మీ కాళ్లు, చేతులు సన్నగా ఉండి.. నడుము లాంటి భాగాల్లో కొవ్వు బాగా పెరిగిపోతుంది.
వ్యాయామం (Exercise)
సన్నగా ఉంటే వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సన్నగా ఉన్నా.. వ్యాయామం తప్పనిసరి. ఇలాంటివారు కార్డియో కంటే స్ట్రెంత్ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బరువు పెరిగేందుకు తీసుకునే పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో అవసరం.
మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషక పధార్థాలు (Nutritional Weight Gain Food To Take)
పాలు (Milk)
పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది మన కండరాల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వెయిట్‌లిఫ్టింగ్ చేసే అలవాటు ఉన్నవారు.. రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చాలా పరిశోధనలు తేల్చాయి.
అన్నం (Rice)
బరువు తగ్గడానికి అనేకమంది తన ఆహారంలో భాగంగా.. అన్నం బదులు చపాతీ తీసుకోవడం మనకు తెలిసిందే. అన్నంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కార్బొహైడ్రేట్ల నుండే లభిస్తాయి. కనుక దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగే వీలుంటుంది.
నట్స్, నట్ బటర్ (Nuts And Butter)
బాదం, పిస్తా, వాల్‌నట్, జీడిపప్పు.. ఇలా మీకు నచ్చిన నట్స్ తింటూ కూడా బరువు పెరగవచ్చు. వీటితో పాటు పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ లాంటివి కూడా ప్రయత్నించవచ్చు. వీటిలో ఎక్కువగా ప్రొటీన్, ఫ్యాట్స్ ఉండడం వల్ల బరువుతో పాటు కండలు పెంచేందుకు ఇవి తోడ్పడతాయి.
మాంసాహారం (Fish ANd Meat)
కండరాలు బలోపేతం కావడానికి రెడ్‌మీట్, చేపల వంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. తరచూ వ్యాయామం చేస్తూ వీటిని తీసుకునేవారిలో కండరాల పెరుగుదల ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. సాల్మన్ వంటి ఆయిల్ ఫిష్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా.. ఎన్నో పోషకాలు మనకు అందుతాయి.
బంగాళాదుంప (Potato)
ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలతో పాటు.. మంచి పిండిపదార్థాలను ఆహారంలో భాగం చేసుకునేందుకు బంగాళాదుంపలు, ఇతర దుంపలు చక్కటి ఎంపిక. అలాగే బీన్స్, పప్పుధాన్యాలతో పాటు ఓట్స్, మొక్కజొన్న, క్వినోవా, చిలగడదుంపలు వంటి వాటిలో కూడా పిండిపదార్థాల మోతాదు ఎక్కువే.
ఇంట్లో చేసే ప్రొటీన్ స్మూతీలు (Protein Smoothies To Make At Home)
బరువు పెరగడానికి ఇంట్లోనే ప్రొటీన్ స్మూతీలు తయారుచేసుకొని భుజించడం మంచి పద్ధతి. మనకు నచ్చిన ఫ్లేవర్‌తోనే ఎన్నో పోషకాలు పొందేందుకు ఇది చక్కటి మార్గం. ఇందులో కొన్ని రకాల స్మూతీలను గమనిద్దాం..
చాక్లెట్, బనానా నట్ షేక్స్ (Chocolate and Banana Nut Shakes)
బ్లెండర్‌లో ఒక అరటి పండు, చాక్లెట్ వే ప్రొటీన్, పీనట్ బటర్ వేసి కొన్ని ఐస్ ముక్కలు వేసి మిక్సీ పడితే సరి.
వెనీలా బెర్రీ షేక్ (Vanilla Berry Shake)
కప్పు మిక్స్‌డ్ బెర్రీలు తీసుకొని.. అందులో కప్పు పెరుగు, కప్పు వెనిలా వే ప్రొటీన్ కలిపి మిక్సీ పట్టుకోవాలి.
చాక్లెట్ హేజల్‌నట్ షేక్ (Chocolate Hazelnut Shake)
అర లీటర్ చాక్లెట్ మిల్క్ షేక్, చాక్లెట్ వే ప్రొటీన్, హేజల్‌నట్ బటర్, అవకాడో కలిపి మిక్సీ పట్టుకోవాలి.
క్యారమిల్ యాపిల్ షేక్ (Caramel Apple Shake)
రెండు యాపిల్ ముక్కలు, కప్పు పెరుగు, క్యారమెల్, వెనిలా వే ప్రొటీన్, క్యారమెల్ సాస్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
వెనిలా బ్లూబెర్రీ షేక్ (Vanilla Blueberry Shake)
కప్పు బ్లూబెర్రీలు, వెనిలా వే ప్రొటీన్, కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
గ్రీన్ షేక్ (Green Shake)
పాలకూర, అవకాడో, అరటిపండు, వే ప్రొటీన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
ఈ స్మూతీలన్నింటిలోనూ దాదాపు 400-600 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి.. వీటిద్వారా సులువుగా, ఆరోగ్యంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
కండరాల బరువు ఎలా పెంచాలి? (How To Gain Muscle Weight)
బరువు పెరగాలంటే కొవ్వు పదార్థాలను తినడం బదులు.. వ్యాయామంతో కండరాల బరువు పెంచుకోవడం మంచిది. దీనికోసం ఏం చేయాలంటే
కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ( Special Exercises)
మన శరీరంలో కండరాల బలం పెరగలాంటే.. ముందు కండరాల్లో చిన్న చిన్న గాయాలు (టేర్స్) అయ్యేలా వ్యాయామం చేయాలి. ఆ తర్వాత శరీరానికి తగినంత ప్రొటీన్‌ని అందించి.. కాస్త సమయం వేచి చూడాలి. ఇలా చేయడం వల్ల కండరాల బరువు పెరుగుతుంది. అలాగే మీరు జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్తుంటే ట్రైనర్‌ని.. కండల పెరుగుదల కోసం వ్యాయామాలు చేయించమని చెప్పాలి. లేదా ఇంట్లోనే రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయాలి.
మాంసం తినండి (Eat Meat)
మీరు ఎంత బరువున్నారో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీ శరీరంలోని ప్రతి కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున ప్రొటీన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అందుకోసం మాంసం, చేపలు, గుడ్లు, డైరీ ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. అలాగే ప్రొటీన్‌తో పాటు బరువు పెరగడానికి.. మీకు ఎక్కువ క్యాలరీలు కూడా అవసరం. మీ శరీరం ఖర్చుచేసే క్యాలరీల కంటే ఎక్కువ తీసుకోగలిగితేనే మీరు బరువు పెరిగే వీలుంటుంది.
కండరాల వ్యాయామం ముఖ్యం (Muscle Exercise)
కాళ్లు, చేతులు, పొట్ట, భుజాలు.. ఇలా రోజుకో భాగాన్ని టార్గెట్ చేసి.. అక్కడ కండరాలు ఒత్తిడికి గురయ్యేలా వ్యాయామం చేయాలి. దీనికోసం స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్, బెంచ్ ప్రెసెస్, డిప్స్ వంటి వ్యాయామలను 8 నుంచి 12 సెట్స్ వరకు చేయాలి. ఈ వ్యాయామాన్ని నిమిషం వ్యవధి తీసుకుంటూ చేయడం మంచిది. అయితే ఈ వ్యాయామాలు చేసేముందు ప్రొటీన్ తీసుకోవడం వల్ల మీ కండరాల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పరిశోధనల్లో తేలిన విషయం.
తరచూ అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
ఫాస్ట్‌ఫుడ్ తింటే బరువు పెరుగుతారా?
చాలామంది క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల బరువు పెరగొచ్చు అనుకుంటారు. ఇలా పెరిగిన బరువు అనారోగ్యకరమైనది. అంతే కాదు.. ఈ తరహా బరువును తిరిగి తగ్గించుకోవడం కష్టం. దీనివల్ల మీ శరీరంలోని కాళ్లు, చేతులు సన్నగా, పొట్ట లావుగా తయారవుతుంది. అందుకే ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి. అంతేకాదు.. మామూలు ఆహారాన్ని వేగంగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవారు ఆహారం నెమ్మదిగా నమిలి తినడం మనకు తెలిసిందే. అయితే ఇలా పెరిగే బరువు అనారోగ్యకరమైనదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
తొందరగా పెరగడం సాధ్యమేనా?
చాలామంది చాలా వేగంగా బరువు తగ్గడం లేదా పెరగడం జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ వేగంగా జరిగేది ఏదైనా సరే.. మన ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసుకోవాలి. నిపుణుల సూచనల ప్రకారం సరైన బరువు పెరగడానికి మంచి ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పు వంటివి తప్పనిసరి. ఇవేవీ లేకుండా కొద్దిరోజుల్లోనే బరువు పెరగడం, తగ్గడం వంటివి చేస్తే అది మన ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తుంది.
కోలాలు బరువు పెంచుతాయా?
చాలామంది కోలాలు తాగితే బరువు పెరిగిపోతాం అనుకుంటూ ఉంటారు. నిజమే.. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు కాబట్టి.. వాటిలో మిగిలినవాటి కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. కానీ ఇలా పెరిగే బరువు చాలా అనారోగ్యకరమైనది. ఇలా కోలాలు తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవడం, శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో కూడా పలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
పిల్స్ వేసుకుంటే బరువు పెరుగుతారా?
వెయిట్ గెయిన్ పిల్స్ వేసుకోవడం వల్ల ముందు కాస్త బరువు పెరిగినట్లుగా అనిపించినా.. ఆ తర్వాత మాత్రం వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిల్స్ గుండె, కిడ్నీలు, లివర్ వంటి అవయవాలపైన ప్రభావం చూపుతాయి.
తేనె తీసుకుంటే బరువు పెరుగుతారా?
బరువు పెరగాలనుకున్నప్పుడు మీ శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే.. ఎక్కువ క్యాలరీలు అందించాలన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాలరీలతో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తేనెలో క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి. కానీ పోషకాలు మాత్రం తక్కువగా ఉంటాయి. అందుకే తీపిదనాన్ని అందించడం కోసం తప్ప.. దీన్ని మరే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించలేం.
కనుక తేనె ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టీస్పూన్ తేనెలో 64 క్యాలరీలుంటాయి. అదే టేబుల్ స్పూన్ చక్కెరలో కేవలం 49 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే తేనె వల్ల బరువు పెరుగుతామన్నది నిజమే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకోవడం సరికాదు. దీనిబదులు నట్ బటర్స్, ఎండుఫలాలు వంటివి తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలతో పాటు పోషకాలు కూడా ఉంటాయి.
కార్బొహైడ్రేట్లు మంచివా? చెడ్డవా?
మన శరీర నిర్మాణం కోసం మనకు స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అవసరం. సూక్ష్మపోషకాలల్లో విటమిన్లు, మినరల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి. వీటి నుంచే మనకు శక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్ల వల్ల వివిధ వ్యాధులు వస్తున్నాయని.. వాటిని దూరంగా ఉంచుతోన్నవారిని మనం చూస్తూనే ఉన్నాం.
అయితే మనం ఎలాంటి కార్బొహైడ్రేట్లు తీసుకోవాలన్నది మన లైఫ్‌స్టైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులోనూ మంచి కార్బొహైడ్రేట్లు, చెడు కార్బొహైడ్రేట్లు ఉంటాయి. సాధారణంగా కార్బొహైడ్రేట్లు మూడు రకాలుగా ఉంటాయి.
చక్కెరలు
గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు ఇందులోకి వస్తాయి.
పీచు పదార్థాలు
మనం ఆకుకూరల నుంచి, కూరగాయల నుంచి పొందే కార్బొహైడ్రేట్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం తొందరగా కదిలి బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
స్టార్చ్
మన జీర్ణాశయంలో గ్లూకోజ్‌గా మారి ఇది శక్తిని అందిస్తుంది.
కార్బొహైడ్రేట్ల పని మనకు శక్తిని అందించడం. ఇవి మన జీర్ణవ్యవస్థలో వేరుపడి గ్లూకోజ్‌గా మారి మనకు శక్తిని అందిస్తాయి. ఫైబర్ నేరుగా మనకు శక్తిని అందించకపోయినా.. మన జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంచిపోషిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది.
మంచి కార్బొహైడ్రేట్లను ముడిధాన్యాల రూపంలో తీసుకోవాలి. ఇక చెడు కార్బొహైడ్రేట్లను అప్పుడప్పుడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. తరచూ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. బరువు పెరగాలనుకున్నా.. తగ్గాలనుకున్నా.. మనకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు పెరగడం సులువే.. కానీ కండలు పెంచడం కష్టం. కొవ్వు పెరిగితే తిరిగి తగ్గించుకోవడం ఇంకా కష్టం. ఈ క్రమంలో ఎక్కువకాలం మీ బరువు అలాగే కొనసాగాలంటే.. దానిని ఆరోగ్యకరమైన రీతిలో పెంచుకోవడం అనేదే మంచి పద్ధతి.
మీరు కూడా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలని మేము కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. అంతకు ముందు ఓసారి మంచి డాక్టర్ లేదా డైటీషియన్‌ని సంప్రదించమని మా సలహా. దీనివల్ల మీ గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహనతో మీ జర్నీని ప్రారంభించే వీలుంటుంది.
ఇవి కూడా చదవండి.
ఇలా చేస్తే జిమ్ అవసరం లేకుండానే.. బరువు తగ్గొచ్చు..
హార్మోన్లు మీ బరువును పెంచేస్తున్నాయా? ఇలా చేసి చూడండి..
యోగా గురించి ఈ అపోహలు మీకూ ఉన్నాయా?
స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి ఇంటి చిట్కాలు