Bollywood

క్రికెట్ అంటే పడి చచ్చే.. మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

Sandeep Thatla  |  Jun 10, 2019
క్రికెట్ అంటే పడి చచ్చే.. మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

మన దేశంలో ఎక్కువమంది ప్రజానీకం ఆరాధించే వ్యక్తులలో.. అధికశాతం సినిమా హీరోలు లేదా క్రికెటర్లు ఉంటారు. పేదోడి నుండి ధనికుడి వరకూ ప్రతీ ఒక్కరూ ఆస్వాదించే ఆట క్రికెట్ అనడంలో అతిశయోక్తి లేదు.  సినిమా.. క్రికెట్.. ఈ రెండు రంగాల్లో సుపరిచితులైన వ్యక్తులు.. ఒకరంటే ఒకరు గౌరవాభిమానాలు కలిగుండడం కూడా మనం చూస్తుంటాం. సినిమాలంటే పడిచచ్చే క్రికెటర్లు.. అలాగే క్రికెట్ అంటే పడిచచ్చే సినిమా స్టార్లు చాలామందే ఉన్నారు.

ఈ క్రమంలో మనం కూడా.. క్రికెట్ అంటే వీరాభిమానం ప్రదర్శించే కొందరు తెలుగు హీరోల గురించి తెలుసుకుందాం. వీరు పలు సందర్భాల్లో క్రికెట్ (Cricket) పట్ల తమకున్న ప్రేమను బహిరంగంగానే చెప్పడం జరిగింది.  వారెవరంటే –

 

వెంకటేష్ (Venkatesh)

విక్టరీ వెంకటేష్ – తన పేరు చివరనున్న ఈ ‘విక్టరీ’ టైటిల్ సినిమా కెరీర్‌లో తాను సాధించిన అసాధారణ విజయాలకి ప్రతీక. ఆయన సినిమాలని ఎంతగా ప్రేమిస్తాడో.. దాదాపు అదే స్థాయిలో ఆటలనూ ఇష్టపడుతుంటాడు. అందులోనూ క్రికెట్ పై తనకున్న ప్రేమ మరీ ఎక్కువ.  చిన్నతనం నుండే క్రికెట్ పై మక్కువ ఉన్నవాడు కావడంతో.. ఆయన షూటింగ్ బ్రేక్ సమయాల్లో కూడా క్రికెట్ ఆడడం చేసేవారట. అలాగే స్టేడియంకు వచ్చి మరీ అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడడం ఆయన ప్రధానమైన హాబీల్లో ఒకటి. వెంకటేష్ హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్.. స్వయంగా స్టేడియంలో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వెంకటేష్ అన్న, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకి కూడా క్రికెట్ అంటే మహా ఇష్టం.  దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరూ క్రీడలను ప్రేమించే విషయంలో తమకు తామే సాటి.

 

తరుణ్ (Tarun)

బాల నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా కూడా రాణించిన వ్యక్తి  తరుణ్. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి హిట్ సినిమాలతో ఒకప్పుడు మంచి యూత్ ఫాలోయింగ్ దక్కించుకున్న నటుడు కూడా. క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే తరుణ్.. ఆ ఆటలో సైతం తన మార్కుని చూపించాడు . పైగా ఇండస్ట్రీ పాల్గొనే వార్మప్ మ్యాచ్‌లు, ఛారిటీ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ ఆటగాడిగా తనకు మంచి పేరే వచ్చింది. సీసీఎల్‌లో కూడా కొన్నాళ్లు చురుగ్గా పాల్గొన్నాడు తరుణ్. ఓసారి భారత క్రికెట్ జట్టుతో సినీ పరిశ్రమ తలపడిన మ్యాచ్‌లో.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికి తరుణ్‌కి, మనకి గుర్తుండిపోయే సంఘటన. 

 

శ్రీకాంత్ (Srikanth)

శ్రీకాంత్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా  సక్సెస్ అందుకున్నా…  తరువాత కాలంలో కూడా మంచి పాత్రలే పోషించాడు. ఇక ఈ మధ్యకాలంలో సీరియస్ పాత్రలు చేస్తున్నప్పటికి కూడా.. ఎక్కడా కూడా క్రికెట్ ఆట పై తనకున్న మక్కువని పోగొట్టుకోలేదు. వెంకటేష్, శ్రీకాంత్‌లు కలిసి చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ పాల్గొనే క్రికెట్ పోటీలలో  చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు.  

 

అఖిల్ (Akhil)

సిసింద్రీగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికి… పూర్తి స్థాయి హీరో కాకముందే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తన సత్తాను చాటాడు అఖిల్.  తన అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఒక పెద్ద సెలబ్రిటీగా కూడా మారిపోయాడు. సోషల్ మీడియాలో… మరి ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా అఖిల్‌కు ఉండాల్సిన ఫాలోయింగే ఉంది. తాను నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా.. CCL ద్వారా ఒక సూపర్ స్టార్‌కి ఉన్నంత ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు అఖిల్.  

 

మహేష్ బాబు (Mahesh Babu)

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో.. తన కుటుంబాన్ని కూడా అదే స్థాయిలో ప్రేమిస్తాడు. అందుకు కారణం కూడా ఉంది. ఏదైనా సినిమా షూటింగ్ పూర్తవగానే.. మహేష్ తన కుటుంబంతో సహా టూర్‌కి వెళుతుంటాడు. తాజాగా విడుదలైన మహర్షి చిత్రం సక్సెస్‌ని ఎంజాయ్ చేయడానికి కూడా తాను లండన్ వెళ్ళాడు. అక్కడ  భారత క్రికెట్ జట్టు.. వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్‌ని మహేష్ బాబు సతీసమేతంగా చూడడమే కాదు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. అవి  ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే మహేష్ బాబు స్టేడియంకి వెళ్ళడం ఇదే మొదటిసారి కాదు. భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయం అందుకున్న 2011 సంవత్సరంలో కూడా.. ఆయన ముంబైలోని వాంఖేడే మైదానంలో మన జట్టుకు తన వంతు మద్దతు తెలిపారు. 

వీరే కాదు.. రామ్ చరణ్, నితిన్, ఆదర్శ్ మొదలైన టాలీవుడ్ నటులు కూడా క్రికెట్ అంటే ఎంతో మక్కువ కలిగిన వ్యక్తులే.

 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటీనటులు.. క్రికెట్ ఆట అంటే చెవి కోసుకుంటారు. పైన పేర్కొన్న అయిదుగురే కాకుండా.. అనేకమంది సినీ నటులు క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా అటు సినిమా.. ఇటు క్రికెట్ మన దేశంలోని ప్రజల వినోదానికి రెండు కళ్ళు అని చెప్పకనే చెప్పేయవచ్చు. 

ఇవి కూడా చదివేయండి

శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

క్రికెట్ లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!

మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’

 

Read More From Bollywood