Health

పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే

Soujanya Gangam  |  Apr 16, 2019
పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే

పిరియడ్స్(periods).. ఈ పదం వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే అవసరం లేని నొప్పి.. అసౌకర్యం, ఇబ్బంది వంటివన్నీ గుర్తొస్తాయి. దేవుడు ఆడవాళ్లకి ఇచ్చిన శక్తి అంటూ ఎంత చెప్పుకున్నా.. పిరియడ్స్ వచ్చిన సమయంలో మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కొన్నాళ్లు పోతే నొప్పి(Pain) తగ్గుతుంది అనుకుంటారు కానీ నొప్పి ఏమీ తగ్గదు.

అలవాటవుతుంది అంతే.. అయితే ప్రపంచంలో కొందరు అమ్మాయిలు మాత్రం ఈ విషయంలో మనకంటే కాస్త స్ట్రాంగ్‌గా ఉండి ఈ అసౌకర్యాన్ని, నొప్పిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు  (hacks) వాడుతున్నారు. మరింకేం.. ఎంతో చిరాకు పెట్టే పిరియడ్స్ సమయంలో మీ జీవితంలో కాస్త సౌకర్యాన్ని నింపి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా సౌకర్యవంతంగా ఉండేలా చేసేందుకు వీటిని ఉపయోగించండి.

1. పిరియడ్ సమయంలో చల్లని ఆహారం వద్దు..

ఇది వినగానే మన బామ్మలు, అమ్మమ్మలు చెప్పిన సలహా గుర్తొస్తుంది కదూ. కానీ ఇది నిజం. పిరియడ్స్ సమయంలో చల్లగా ఉండేవి కాకుండా కాస్త వేడిగా ఉండే సూప్స్, వేడి ఆహారం తీసుకోవడం వల్ల నొప్పులు కాస్త తగ్గుతాయి. చైనా, పాకిస్థాన్ వంటి దేశాల్లో అమ్మాయిలు ఐస్ క్రీం, కూల్ డ్రింక్.. వంటివాటికి దూరంగా ఉండి సూప్ లాంటివి ఎక్కువగా తీసుకుంటారట.

2. వేడి వేడి ఛాయ్..

వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం అంటే చాలా దేశాల్లో (మన దేశం కూడా కలిపి) వేడి వేడి టీ, చక్కటి పసుపు టీ వంటివి తీసుకుంటారు. ఇవి పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని బాగా తగ్గిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావడం వల్ల రక్త ప్రసరణ వేగంపై ప్రభావం పడి నొప్పి తగ్గే అవకాశం ఉంటుందట. అందుకే జమైకా లాంటి దేశాల్లో అమ్మాయిలు పిరియడ్స్ సమయంలో వేడివేడి టీ తీసుకుంటారు.

3. వేడినీటి కాపడం..

దీని గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిందే. పిరియడ్స్ సమయంలో మనలో చాలామందిని ఎంతో కాలంగా రక్షిస్తూ వస్తున్నది ఈ చిట్కానే.. పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు అనుకునేవారు వేడి నీటి బాటిల్స్‌తో కాపడం పెట్టుకుంటే నొప్పి కాస్త తగ్గుతుంది.

4. నువ్వుల నూనెతో..

నువ్వుల నూనెకు నొప్పిని తగ్గించే గుణం ఉంటుందట. అందుకే ప్రపంచమంతా దీన్ని పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గించే మందుగా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె ఉపయోగించిన తర్వాత ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. అందుకే దీన్ని చాలామంది ఉపయోగిస్తుంటారు.

5. టబ్ బాత్..

టబ్ బాత్ చాలా సమస్యలను తగ్గిస్తుంది. అందులో పిరియడ్స్ కూడా ఒకటి. కరేబియన్ దీవుల్లో అయితే.. ఈ టబ్‌లో కాస్త రబ్బింగ్ ఆల్కహాల్ వేసి అందులో స్నానం చేస్తారు. ఇది వెంటనే ప్రభావం చూపుతుందట. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

6. పాలకూర తినండి.

పిరియడ్స్ సమయంలో మన శరీరంలోంచి రక్తం పోవడం వల్ల ఐరన్ స్థాయులు తగ్గుతాయి. ఇలాంటప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విటమిన్ కె, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తమకు శక్తి అంది నొప్పిని తట్టుకోగలుగుతామన్నది యూకే అమ్మాయిల భావన.

7. పీఎంఎస్‌కి అల్లం..

అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో.. వీటిలో చాలా ప్రయోజనాలను పరిశోధనలు కూడా నిరూపించాయి. ఇది రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు పీఎంఎస్ లక్షణాలను కూడా కనిపించకుండా చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, నడుము నొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గడంతో పాటు అతి రక్తస్రావం ఉంటే ఆ సమస్య కూడా తగ్గుతుంది.

8. జీలకర్రతో..

ఓ పరిశోధన ప్రకారం ప్రపంచంలో ఎనభై శాతం మంది పిరియడ్స్ సమయంలో నొప్పిని అనుభవిస్తారట. మన దేశంలో అమ్మాయిలు ఈ నొప్పిని తగ్గించేందుకు జీలకర్రను ఉపయోగిస్తారు. మంచి ఫలితం కోసం స్పూన్ జీలకర్రను గ్లాస్ వేడి నీటిలో వేసి తాగండి.

9. చాక్లెట్

పిరియడ్స్ సమయంలో డల్‌గా అనిపిస్తోందా? అయితే డార్క్ చాక్లెట్ తిని చూడండి. ఇది మీ మూడ్‌ని మారుస్తుంది. ఇది పరిశోధనల్లో కూడా తేలింది. ఇందులోని మెగ్నీషియం, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పిరియడ్స్ సమయంలో మీ మూడ్‌ని బాగుచేస్తాయి.

10. విక్స్

సెంట్రల్ అమెరికాలోని దేశం బీజ్.. అక్కడ విక్స్ పాపులర్ పెయిన్ కిల్లర్. పిరియడ్స్ సమయంలోనూ నొప్పిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందట. దీంతో మీ కడుపు భాగంలో నెమ్మదిగా మసాజ్ చేయండి. నొప్పి తగ్గుతుంది.

11. ఆక్యుప్రెషర్, ఆక్యు పంక్ఛర్

చైనాలో పుట్టిన ఈ వైద్యం కొన్ని దశాబ్దాలుగా అలాగే కొనసాగుతోంది. మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. ఆక్యుపంక్ఛర్ స్పెషలిస్ట్ సాయంతోనే చేయగలిగితే ఆక్యుప్రెషర్ మీరు ప్రయత్నించవచ్చు. కేవలం పిరియడ్స్ సమయంలో నొప్పి మాత్రమే కాదు.. రకరకాల నొప్పులను తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి.

క‌మ్మ‌ని చాక్లెట్.. మీకు క‌ళ్లు చెదిరే అందాన్ని కూడా అందిస్తుంది..!

రెండు గ‌ర్భాశ‌యాల‌తో.. నెల వ్య‌వ‌ధిలో ముగ్గురికి జ‌న్మ‌నిచ్చిందీ త‌ల్లి..!

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

Images : Pixabay

Featured Image : Shutturstock

Read More From Health