Lifestyle

నిహారిక కొణిదెల “సూర్యకాంతం” చిత్రంలోని.. టాప్ 10 ఆసక్తికరమైన అంశాలివే

Babu Koilada  |  Mar 29, 2019
నిహారిక కొణిదెల “సూర్యకాంతం” చిత్రంలోని.. టాప్ 10 ఆసక్తికరమైన అంశాలివే

“ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) .. ఆ తర్వాత “హ్యాపీ వెడ్డింగ్” చిత్రంలోనూ నటించింది. కానీ ఈ సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ని ఆమెకు అందివ్వలేకపోయాయి.

తాజాగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో విడుదలైన సూర్యకాంతంతో (Suryakantham) తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమైంది నిహారిక. ఈ రోజే ఈ చిత్రం విడుదలైంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన సంగతులను మనమూ తెలుసుకుందాం.

సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరిగిన సగటు మధ్య తరగతి అమ్మాయిల కథలు గతంలో తెలుగులో వచ్చాయి. అలాగే బాలీవుడ్‌లో కూడా వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి సబ్జెక్టులను టాలీవుడ్‌లో ఎవరూ డీల్ చేయలేదు.

కనుక డైరెక్టర్ చేసింది ఒకింత సాహసం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రాణం నిహారిక నటన అనే చెప్పుకోవాలి. కానీ కథ చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడని అనిపించక మానదు. అదే ఈ చిత్రానికి కాస్త మైనస్.

సూర్యకాంతం పేరు తెలుగు వారికి ఎంత సుపరిచితమైన పేరో మనకు తెలియంది కాదు. ఆ పేరు వింటే మనకు టక్కున గుర్తుకువచ్చేవి అలనాటి నటి సూర్యకాంతం పోషించిన గయ్యాళి అత్త పాత్రలు.

కానీ తెలుగమ్మాయిలకు పెట్టాల్సిన అందమైన పేరు “సూర్యకాంతం” అని అనేవారు కూడా ఉంటారు. కనుక ఈ పేరును సినిమా టైటిల్‌గా పెట్టి.. అందులోనూ నిహారిక లాంటి అమ్మాయి చేత.. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్రను పోషింపజేయడం కూడా మంచి ఆలోచనే.

 

సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద హైలెట్. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథానాయిక తల్లి పాత్ర. ఈ పాత్రలో సుహాసిని చాలా చక్కగా నటించారు. అలాగే హీరో రాహుల్ విజయ్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. ఒకమ్మాయిని ప్రేమించి.. బ్రేకప్ అయ్యాక మళ్లీ మరో అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకొని.. పెళ్లి వరకూ వెళ్లడం అనేది రొటీన్ కథ.

కానీ ఈ కథలో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఒక క్రేజీ మనస్తత్వం ఉన్న అమ్మాయిని పెడితే.. ఎలా ఉంటుందన్న కోణంలో దర్శకుడు ఆలోచించి కథను రాసుకోవడం జరిగింది.

ఈ సినిమా తీసిన దర్శకుడు గతంలో నిహారిక కథానాయికగా .. ముద్దపప్పు – ఆవకాయ, నాన్నకూచి అనే రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. కానీ తాను దర్శకత్వం వహించిన “సూర్యకాంతం” విషయానికి వస్తే .. అందులో కూడా మనకు షార్ట్ ఫిల్మ్ ఛాయలు కనిపించడం గమనార్హం.

 

ఈ సినిమాలో కథనం ఎలా ఉన్నా.. ప్రొడక్షన్ విలువల ప్రకారంగా చాలా హై క్వాలిటీతో సినిమాను తీశారు నిర్మాతలు.

ఇక ఈ చిత్రంలో రెండవ కథానాయికగా నటించిన పెర్లీన్ తనదైన పరిధిలో బాగానే నటించింది. అయితే ఒక ముక్కోణపు ప్రేమకథగా సాగిన ఈ చిత్రంలో.. ఈమెను టైటిల్ రోల్ పోషించిన కథానాయిక బీట్ చేసిందనే చెప్పవచ్చు.

ఇక డైలాగ్స్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను హైలెట్ చేయడానికే రాశారని అనిపిస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ నిహారిక నటించిన సినిమాలన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే కావడం గమనార్హం. కనుక, ప్రేక్షకులు రొటీన్ మరియు బోర్ ఫీలయ్యే అవకాశాలున్నాయి.

ఒక మంచి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని తీయాలనే సంకల్పంతో “సూర్యకాంతం” చిత్రాన్ని తెరకెక్కించినా.. హాస్యాన్ని, భావోద్వేగాన్ని పంచడంలో ఈ చిత్రం కాస్త తడబడిందనే చెప్పుకోవాలి. ఫైనల్‌గా చెప్పాలంటే.. నిహారిక క్రేజీ నటనను ఆస్వాదించాలనుకుంటే.. ఈ సినిమాను ఒకసారి చూసేయచ్చు.

ఇవి కూడా చదివేయండి

చ‌క్క‌టి చెలిమి సంత‌కం..ఈ మ‌హ‌ర్షి మొద‌టి పాట‌..ఛోటీ ఛోటీ బాతే..!

తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

 

 

Read More From Lifestyle