తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!

తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వాటిని సినీ ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో వచ్చిన బాగ్ మిల్కా బాగ్, మేరీ కోమ్, ధోనీ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. సైనా నెహ్వాల్, గోపీ చంద్ వంటి దిగ్గజాలకు సంబంధించిన బయోపిక్స్ సైతం నిర్మాణ దశలో ఉన్నాయి.


తాజాగా మరో చిత్రం ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే 1983లో భారత్ గెలుచుకొన్న వరల్డ్ కప్ టీంకు కెప్టెన్‌‌గా వ్యవహరించిన కపిల్ దేవ్ కథ. ఇది పూర్తి స్థాయి బయోపిక్ కాకపోయినా.. భారత క్రికెట్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్క‌నుంది.


చెప్పాలంటే అప్పటి భారత క్రికెట్ టీం కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కోణం నుండి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘83’. ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటిస్తున్నారు.


ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సినిమాకు కపిల్ దేవ్ కూతురు అమియా దేవ్(Amiya Dev) మెగాఫోన్ పట్టుకోనున్నారు. అయితే దర్శకురాలిగా కాదులెండి. సహాయ దర్శకురాలిగానే. ‘83’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కబీర్ ఖాన్ దగ్గర ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు. 


1-amiya-83-movie


Image: Facebook.com/AmiyaDev


ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అమియా. థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసిన అనుభవం సైతం ఆమెకు ఉంది. 83 సినిమాకు సహాయ దర్శకురాలిగా ఆమె పనిచేయడానికీ ఓ కారణం ఉంది. ఇది తన తండ్రికి సంబంధించిన సినిమా కావడంతో పాటు.. చిన్నప్పటి నుంచి క్రికెట్ వాతావరణంలో పెరగడమూ కారణమే. ఈ సినిమా కోసం అమియా చాలా కష్టపడుతోందట.


సినిమా కోసం నటులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడంతో పాటు వారికి తనకు తెలిసిన టిప్స్ కూడా చెబుతోందట అమియా. ఈ సినిమా కోసం అమియా మాత్రమే కాదు.. కపిల్ దేవ్ సైతం పని చేస్తున్నారు. అప్పటి క్రికెట్ పరిస్థితుల గురించి నటులకు వివరించడంతో పాటు వారికి శిక్షణ సైతం ఇస్తున్నారు.


కపిల్ సైతం తన కూతురి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కబీర్ ఖాన్ వద్ద చాలా విలువైన పాఠాలు అమియా నేర్చకోగలుగుతుందని చెబుతున్నారాయన.


kapil-dev-83


ఈ సినిమా సినీ ప్రేక్షకులకు, క్రికెట్ ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ ఆటకు ఆదరణ వస్తున్న తొలినాటి రోజుల్లో.. అప్పుడప్పుడే కొత్తగా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొన్నారు కపిల్ దేవ్. ఆ సమయంలో భారత జట్టు ప్రపంచకప్ తెస్తుందనే అంచనాలు సైతం లేవు.


అలాంటి సందర్భంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రపంచకప్ తీసుకొచ్చారు కపిల్. అందుకే 1983 ప్రపంచకప్ మనకు చాలా ప్రత్యేకం. అందుకేనేమో సినిమా టైటిల్ సైతం ‘83’గా ఖరారు చేశారు.


ఈ సినిమాలో మరో విశేషమేంటంటే.. మన ‘రంగం’ స్టార్ జీవా కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఆ ఏడాది క్రికెట్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన సందీప్ పాటిల్ పాత్రను ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో తెలుసా?


మన తెలుగు వ్యక్తి విష్ణు ఇందూరి. ఎన్టీయార్ బయోపిక్‌కు సైతం ఈయనే నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.                                            


ఆ సినిమా కోసం కంగన రనౌత్‌కి ఇచ్చే.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?


కీర్తి సురేష్ "మహానటి" చిత్రం.. నిత్యా మీనన్ "ఐరన్ లేడీ"కి ఆదర్శమా?