
స్నేహం.. (Friendship) ఆ మాట వినగానే ఏదో మధురానుభూతి మన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏదో తెలియని ఆనందం మనల్ని చుట్టుముట్టేస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలన్నా.. మనసులో భావాలను పంచుకోవాలన్నా.. మన ఆలోచనలపై సమీక్షలు చేయాలన్నా.. ఓ నేస్తం అవసరమే. మన తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని కొన్ని విషయాలను స్నేహితులతోనే పంచుకోగలం. అది సత్యం. స్నేహం విలువను తెలియజేసే ఎన్నో సంఘటనలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. స్నేహ ప్రాధాన్యతను తెలిపే సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం (Friendship Day) సందర్భంగా.. మీకోసం అటువంటి చిత్రాల వివరాలు ప్రత్యేకం.
ప్రేమదేశం – కదిర్ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అనుకోకుండా కాలేజీలో స్నేహితులుగా మారిన ఇద్దరు కుర్రాళ్లు.. ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం .. అప్పట్లో కుర్రకారుకు తెగ నచ్చేసింది. స్నేహం గొప్పదా.. ప్రేమ గొప్పదా..? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. అబ్బాస్, వినీత్, టబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
నీ స్నేహం – పరుచూరి మురళి దర్శకత్వంలో 2000లో విడుదలైన ఈ చిత్రం.. ఫుట్‌బాల్ క్రీడను అమితంగా ప్రేమించే ఇద్దరు స్నేహితుల కథ. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన మిత్రుడి కోరికను తీర్చడం కోసం.. ఫుట్‌బాల్ ఛాంపియన్ కావాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు ఓ స్నేహితుడు. అదే సమయంలో వారిరువురి జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి ఆ మిత్రుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందనేది చిత్ర కథ. “కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట… రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం. రూపు రేఖలు వేరట.. ఊపిరొకటే చాలట. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం” అంటూ స్నేహం విలువను తెలిపే గీతం ఈ చిత్రంలోనిదే.
స్నేహం కోసం – 1999లో కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్ కుమార్ స్నేహితులుగా నటించారు. స్నేహానికి ధనిక, బీద అనే తేడాలు ఉండవని చాటి చెప్పే ఈ చిత్రం.. ప్రాణ స్నేహితులు, శత్రువులుగా మారడానికి కారణాలేమిటో కూడా విశ్లేషిస్తుంది.
ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్
హ్యాపీ డేస్ – ఈ సినిమా కాలేజ్ లైఫ్ బ్యాక్ డ్రాప్‌లో సాగిన చిత్రమైనా.. స్నేహం విలువను తెలియజేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా టైసన్ అనే పాత్ర స్నేహం కోసం తనకు ఇష్టమైన ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను వదులుకోవడం.. తన స్నేహితుడు చెడు సావాసాలకు బానిసైతే.. తనను మంచి మార్గంలోకి తీసుకురావడానికి.. తాను ప్రత్యర్థులతో గొడవ పడడం లాంటి అంశాలు.. ఈ చిత్రంలో చూడచ్చు. “ఎందుకురా వాడికోసం అంతలా ఆలోచిస్తున్నావ్” అని తనను మిగతా స్నేహితులు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే.. “వాడు కూడా మన ఫ్రెండే కదరా” అని ఆ పాత్ర చేత దర్శకుడు చెప్పించడంలో ఎంతో చాకచక్యం దాగుంది. ఒక విధంగా, స్నేహంలోని కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన చిత్రం “హ్యాపీ డేస్”
ఎవడే సుబ్రహ్మణ్యం – చనిపోయిన స్నేహితుడి కోరికను తీర్చడం కోసం “దూద్ కాశీ” అనే ప్రాంతాన్ని సందర్శించడానికి పూనుకున్న.. ఓ మిత్రుడి కథ “ఎవడే సుబ్రహ్మణ్యం”. అలా సాగిన ఈ మిత్రుడి ప్రయాణం.. తనకు ఎలాంటి జీవిత సత్యాలను నేర్పింది.. ఎలాంటి అనుభవాలను పరిచయం చేసిందో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహించారు.
‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!
2010లో సముద్రఖని దర్శకత్వంలో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “శంభో శివ శంభో”. తమ స్నేహితుడి ప్రేమకు అండగా నిలబడి.. తన పెళ్లి చేసిన స్నేహితులు.. అదే ప్రేమలో నిజాయతీ లేదని తెలుసుకున్నాక.. అదే ప్రేమ కోసం తమ జీవితాన్ని కోల్పోయాక.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఈ చిత్ర కథ. తమిళ చిత్రం “నాడోడిగల్”కు రీమేకైన ఈ చిత్రం.. హిందీలో “రంగ్రేజ్” పేరుతో కూడా రీమేక్ అయ్యింది.
వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ 160 కొటేషన్లు..
ఓ మై ఫ్రెండ్ – చిన్నప్పటి నుండీ స్నేహితులుగా కలిసి పెరిగిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాంతం అదే బంధాన్ని కొనసాగించడం సాధ్యవుతుందా..? పెళ్లయ్యాక కూడా ఇలాంటి స్నేహాలు నిలబడతాయా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ఈ సినిమాలో శ్రుతిహాసన్, సిద్ధార్థ్ స్నేహితులుగా నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2011 లో విడుదలైంది.
స్నేహితుడు – హిందీలో “త్రీ ఇడియట్స్”కు రీమేక్ అయిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఇంజనీరింగ్ విద్యలోని ప్రాక్టికాలిటీ గురించి ఒక వైపు చెబుతూనే.. మరోవైపు ఎవరైనా తమకు నచ్చిన రంగం వైపే వెళ్లాలని చెబుతూ.. స్నేహితులలో స్ఫూర్తిని నింపే పాణి పాత్రలో విజయ్ నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి.
ఉన్నది ఒకటే జిందగీ – కిశోర్ తిరుమల దర్శకత్వంలో 2017లో వచ్చిన చిత్రం “ఉన్నది ఒకటే జిందగీ”. ప్రాణ స్నేహితులుగా.. ఒకరి కోసం ఒకరిగా బతికిన ఇద్దరు మిత్రులు.. ఓ అమ్మాయి కారణంగా ఎందుకు విడిపోతారు.. తర్వాత మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తారన్నది చిత్ర కథ. రామ్, శ్రీ విష్ణు ఈ చిత్రంలో స్నేహితులుగా నటించారు.
మహర్షి – వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, అల్లరి నరేష్ స్నేహితులుగా నటించారు. ఓ పెద్ద అంతర్జాతీయ సంస్థకి సీఈఓగా పనిచేస్తున్న వ్యక్తి.. తన వల్ల గతంలో తన స్నేహితుడు జీవితాన్ని కోల్పోయాడని తెలుసుకుంటాడు. ఆ స్నేహితుడి ఊరి సమస్యను పరిష్కరించడానికి.. తానే స్వయంగా తన మిత్రుడు నివసిస్తున్న కుగ్రామానికి వస్తాడు. మరి తను ఏ విధంగా తన స్నేహితుడికి బాసటగా నిలిచాడన్నది చిత్ర కథ.