తెలుగు ప్రజలంతా ప్రధానంగా భావించే పండగల్లో మకర సంక్రాంతి (Pongal) కూడా ఒకటి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. సాధారణంగా ఏ పండగకైనా ఆ రోజే సంబరాలు మొదలవుతుంటాయి. కానీ ఈ పండగ మాత్రం ఇందుకు భిన్నం. సంక్రాంతికి 15 రోజుల ముందు నుంచే ఇంట్లో పండగ కళ ఉట్టిపడుతుంటుంది. ఘుమఘుమలాడే పిండి వంటకాల తయారీ మొదలుకొని చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఉత్సాహంగా ఎగరేసే గాలిపటాల వరకు ఈ సందడిలో భాగమే!
ముఖ్యంగా భోగభాగ్యాలకు నెలవుగా భావించే భోగి, సిరిసంపదలనిచ్చే సంక్రాంతి, కనువిందుగా జరుపుకునే కనుమ, ఈ పండగ వేడుకలకు ఘనంగా ముగింపు పలికే ముక్కనుమ.. ఇలా వరుసగా నాలుగు రోజులు నాలుగు ప్రధాన పండగలు జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. అలాగే పంట చేతికి అందిన సందర్భంగా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొంటారు. అందుకే దీనిని రైతుల పండగ అని కూడా అంటారు.
సంక్రాంతి అనగానే ఒకప్పుడు గంగిరెద్దుల మేళాలు, హరిదాసుల కీర్తనలు, ఎడ్లబండ్ల పందాలు, కోడి పందాలు.. అబ్బో..! ఒక్కటనేముంది.. ఎంతో సందడిగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ వేడుకలు జరుపుకోవడంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తే; ప‌్రస్తుతం ఒక పోటీగా దానిని నిర్వహిస్తున్నారు.
ఆసక్తి ఉన్నవారు వాటిలో పాలుపంచుకుంటుంటే; చాలామంది ఆకాశంలో ఎగిరే ఆ రంగురంగుల గాలిపటాలను చూస్తూ ఎంజాయ్ చేయడానికే పరిమితం అయిపోతున్నారు. ఇక గంగిరెద్దుల మేళాలు వంటివైతే శిల్పారామం వంటి సందర్శన ప్రాంతాల్లో తప్ప బయట పెద్దగా కనిపించడం లేదు. హరిదాసుల సంగతి సరే సరి..! ఇవే కాదు.. మన సంప్రదాయాలకు అద్దంపట్టే ఎన్నో ఆచారవ్యవహారాలు సైతం కాలక్రమేణా చాలావరకు కనుమరుగవుతూ ఉంటే; ఇంకొన్ని మార్పులకు లోనవుతూ వస్తున్నాయి.
మకర సంక్రాంతికి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఇంటి ముందు వేసే ముగ్గులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటినే నెలగంట ముగ్గులు అని కూడా అంటారు. ముఖ్యంగా చిన్న చిన్న గీతలు గీసి వేసే ఈ ముగ్గులు చూడడానికి చాలా బాగుంటాయి కూడా!
ఇక ప్రధాన పండగలైన భోగి, సంక్రాంతి, కనుమల నాడు ఇంటి ముంగిళ్లలో పలు రంగులతో వేసే వర్ణరంజితమైన రంగవల్లులైతే మరింత రమ్యంగా కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా అన్ని పండగలకు ఘనంగా ముగింపు పలుకుతూ వేసే రథం ముగ్గు అయితే మరీనూ!! కానీ ఈరోజుల్లో ఇవన్నీ కనిపించడం బాగా తగ్గిపోయాయి. కొందరైతే ఈ రంగవల్లులను స్టిక్కర్లుగా అతికించుంటున్నారు కూడా!
ఇక భోగి పండగ రోజు తెల్లవారుఝామునే నిద్ర లేని భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే! మరి, ఈ రోజుల్లో ఇలా ఎన్ని చోట్ల మంటలు వేస్తున్నారు. వాటి ప్రాశస్త్యం గురించి ఎంతమందికి తెలుసు?? అలాగే చిన్న పిల్లలకు భోగి సందర్భంగా పోసే భోగి పళ్ల సందడి ఇప్పుడు కనిపిస్తోందా?? చెరకుగడలు, పువ్వులు, చిల్లర నాణాలు, రేగుపళ్లు, శెనగలు కలిపి వాటిని తయారుచేస్తారని ఎందరికి తెలుసు? అలాగే భోగి రోజు సాయంత్రం వేళల్లో పెట్టే బొమ్మల కొలువు సంప్రదాయాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు??
సంక్రాంతి పండగ సందర్భంగా ఘుమఘుమలాడే పిండివంటకాలు తయారు చేసుకునేవారు. సున్నుండలు, జంతికలు, అరిసెలు, పాలతాలికలు, సకినాలు.. ఇవన్నీ ఇందులో భాగమే. అయితే ఈ రోజుల్లో చాలామంది ఈ పిండి వంటకాలను తయారు చేసుకునేందుకు సమయం వెచ్చించలేక లేదా శ్రమ ఎందుకు అనుకునో.. స్వీట్ షాపులనే ఆశ్రయిస్తున్నారు.
కావాల్సిన వంటకాలను నచ్చినన్ని తెచ్చుకొని పండగ సంతోషాలను కూడా రడీమేడ్‌కి పరిమితం చేసేస్తున్నారు. ఇక సంక్రాంతికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఎడ్లబండి పందాలు, కోడి పందాలు వంటివి ఆయా ప్రాంతాలకే పరిమితం అయిపోయాయి. అలాగే అంతా కలిసి ఎంతో సందడిగా ఎగరేసే గాలిపటాలను కూడా ప్రస్తుతం పతంగుల పండగ (కైట్ ఫెస్టివల్) పేరుతో ప్రత్యేకంగా జరుపుకోవాల్సి వస్తోంది.
ఏడాదంతా వ్యవసాయంలో తమకు ఎంతో సహాయం అందించిన పశుపక్ష్యాదులకు ధన్యవాదాలు తెలిపే క్రమంలో రైతులంతా కనుమ పండుగ జరుపుకుంటారు. ఈరోజుల్లో ఇది పల్లెలకే పరిమితం అయిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పండగల్లో నాలుగో రోజుని ముక్కనుమగా జరుపుకుంటారన్న విషయం తెలిసినవారు తక్కువగానే ఉంటారు. ఇక సంక్రాంతి పండగ అనగానే కొత్త అల్లుళ్ల సందడి, కొంటె మరదళ్ల గిల్లుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?? కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఈ పండగ సందళ్లను చూస్తున్నారు? ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు??
ఇప్పుడు పండగ అంటే చాలామందికి ఒక సెలవు రోజు అంతే! ఇంకొందరైతే సంక్రాంతి నేపథ్యంలో వూరెళ్లి పండగ జరుపుకునేందుకు ప్రయత్నిస్తే; మరికొందరు శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా మొబైల్ ఫోన్లనే వేదికలుగా మలుచుకుంటున్నారు.
ఇది ఎంత వరకు సమంజసం?? అందరి మధ్య ఐకమత్యం పెంచాలనే పండగ ఉద్దేశానికే బీటలు వారుతోన్న ఈ తరుణంలో పండగలకు ఉన్న గొప్పదనం, ప్రాశస్త్యం వంటి వాటి గురించి వారు తెలుసుకోకపోగా; అసలు పట్టించుకోవడం కూడా కష్టంగానే మారిపోతోంది. ఈ నేపథ్యంలో మన తర్వాతి తరాల వారికి మనం అందించే ఈ సంప్రదాయాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కాబట్టి ఇకనైనా ఈ పండగల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. మన తదుపరి తరాల వారికి ఆ సంప్రదాయాలను సజీవంగా అందజేద్దాం..! ఏమంటారు??
Images: Shutterstock
ఇవి కూడా చదవండి
కొత్త అల్లుళ్లు, కోడి పందేలు.. సరదాల సంక్రాంతి తెచ్చే ఆనందాలెన్నో..!
సంక్రాంతి ముంగిట్లో విరిసే ముత్యాల ముగ్గుల హరివిల్లు… !
సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..