Entertainment

మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!

Sandeep Thatla  |  Jan 21, 2019
మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!

నెపోటిజం (Nepotism).. గ‌త కొంత కాలంగా బాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న ప‌దం ఇది. నెపోటిజం అంటే బంధుప్రీతి అని అర్థం. సినీప‌రిశ్ర‌మ (Movie Industry)లో కొన‌సాగుతున్న న‌టీన‌టుల వార‌సులు, బంధువుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం, వారినే ఎక్కువ‌గా ప్రోత్స‌హించ‌డం.. వంటివి చేయ‌డాన్నే బంధుప్రీతి అంటారు.

ఇది కేవ‌లం బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా క‌నిపిస్తోంది. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ కుటుంబాల నుంచి సినీవార‌సులుగా ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కులు, క‌థానాయిక‌ల‌కు టాలీవుడ్‌లో కూడా కొద‌వేమీ లేదు. అయితే నెపోటిజం కార‌ణంగా కొత్త‌వారికి త‌గిన అవ‌కాశాలు ద‌క్క‌డంలేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డితే; ఇది కేవ‌లం సినీరంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉందంటున్నారు ఇంకొంద‌రు.

వెండితెర‌ను ఏలిన ప్ర‌ముఖుల వార‌సులుగా బిగ్ స్క్రీన్‌కు ప‌రిచయ‌మైనప్ప‌టికీ ప్ర‌తిభ ఆధారంగానే వారికి అవ‌కాశాలు ఉంటాయ‌న్న మాట కాద‌న‌లేని వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే కొంద‌రు త‌న న‌ట‌ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌ను చక్క‌గా ఆక‌ట్టుకుంటూ త‌మ స‌త్తా చాటుతుంటే; ఇంకొంద‌రు ఒక‌టి లేదా రెండు చిత్రాల‌తోనే త‌మ సినీ కెరీర్‌ను ముగించిన వారూ ఉన్నారు. అయితే సినీవార‌సత్వం అనే ప‌దం విన‌గానే టాలీవుడ్ (Tollywood)లో ముందుగా వినిపించేది మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోల గురించే!

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి యువ‌క‌థానాయ‌కులు ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీని దున్నేస్తున్న ఈ త‌రుణంలో ఇప్పుడు అదే కుటుంబం నుంచి మ‌రో యువ క‌థానాయ‌కుడు వెండితెర‌పై తెరంగేట్రం చేసేందుకు సిద్ధ‌మయ్యాడు. చిరంజీవి చిన్న మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు అయిన వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) తెలుగు తెర‌కు త్వ‌ర‌లో హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు కూడా ఇటీవ‌లే జ‌రిగాయి.

ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, నాగ‌బాబు.. త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేసింది ఆ చిత్ర‌బృందం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers)తో క‌లిసి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్‌కి చెందిన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుకుమార్‌తో క‌లిసి ప‌ని చేసిన బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

ఇలా తన తొలిచిత్రానికే భారీ నిర్మాణ సంస్థతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావ‌డంతో.. ఒకరకంగా వైష్ణవ్ తేజ్ అదృష్టం పండిందని కొంద‌రు అభిప్రాయప‌డుతుంటే; మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉండడంతోపాటు, మెగా కుటుంబం నుంచి వ‌స్తున్న కార‌ణంగా ఆదిలోనే ఇలాంటి ఒక మంచి ప్లాట్ ఫామ్ దొరికింది అని ఇంకొంద‌రు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల్సిన బాధ్య‌త వైష్ణ‌వ్ పై ఉంద‌నేది అక్ష‌ర స‌త్యం.

వైష్ణవ్ తేజ్ తెరంగేట్రంతో మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగా హీరోల సంఖ్య 9కి చేరుకుంది. (నాగబాబు గతంలో హీరోగా చేసినా.. ప్రస్తుతం సహాయ నటుడిగా చేస్తున్నారు కాబట్టి… ఆయనను ఈ జాబితాలో చేర్చలేం). ఒకసారి ఆ జాబితా మీరూ చూడండి-

* చిరంజీవి

* పవన్ కళ్యాణ్

* అల్లు అర్జున్

* రామ్ చరణ్

* సాయి ధరమ్ తేజ్

* వరుణ్ తేజ్

* అల్లు శిరీష్

* కళ్యాణ్ దేవ్

* వైష్ణవ్ తేజ్

పైన జాబితా చూస్తే వీరే దాదాపు ఒక మినీ టాలీవుడ్‌గా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా; మరోవైపు ఒక్క‌ మెగా ఫ్యామిలీ నుంచే ఏటా దాదాపు 10 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కాబ‌ట్టి చిత్రపరిశ్రమకి కూడా బిజినెస్ పరంగా ఇది మంచిదే అనేవారు కూడా లేక‌పోలేరు.

కొసమెరుపు ఏంటంటే ఇప్పటికే వీరి కుటుంబం నుంచి నిహారిక కొణిదెల (Niharika Konidela) హీరోయిన్‌గా కొనసాగుతుండగా.. త్వరలోనే అంటే రాబోయే అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) తన తండ్రి బాటలో సినిమాల్లోకి అడుగుపెట్టాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అదే గనుక జరిగితే ఈ హీరోల సంఖ్య 10కి చేరుకుంటుంది. మొత్తానికి తెలుగు చిత్రపరిశ్రమ పై మెగా కుటుంబం తనదైన ముద్ర వేసింద‌నే చెప్పాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

ద‌టీజ్ మ‌హాల‌క్ష్మితో.. టాలీవుడ్ క్వీన్‌గా మార‌నున్న‌ త‌మ‌న్నా!

“లక్ష్మీస్ ఎన్టీఆర్‌” హీరోయిన్ యజ్ఞ శెట్టి గురించి.. ఎవరికీ తెలియని విషయాలివే..!

క్యాన్సర్ మహమ్మారిని గెలిచారు.. విజేతలై అందరికీ ఆదర్శంగా నిలిచారు..!

Read More From Entertainment