ముందుగా ఈ ‘అంతరిక్షం’ చిత్రం చూడడానికి మనం ఎందుకు వెళ్ళాలో ఈ లింక్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది..
‘అంతరిక్షం’ (Antariksham) కథ విషయానికి వస్తే మిహిర అనే శాటిలైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి ISC (ఇండియన్ స్పేస్ సెంటర్)కి అయిదేళ్ళ తరువాత తిరిగివచ్చే ఇంజినీర్‌గా దేవ్ (వరుణ్ తేజ్) కనిపిస్తాడు. అలా వచ్చిన దేవ్, తాను సదరు శాటిలైట్ సమస్యని పరిష్కారించాలంటే తనని “జటాయు” అనే శాటిలైట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించాలని షరతు పెడతాడు. అతను ISC నుండి ఎందుకు వెళ్ళిపోతాడు.. మళ్ళీ తిరిగివచ్చాక ఈ షరతు ఎందుకు పెడతాడు అనేది ఈ చిత్ర కథ.
ఇక దర్శకుడు సంకల్ప్ (Sankalp) తీసిన ఘాజి చిత్రం గనుక మీరు చూసి ఉంటే ఈ చిత్రంలో లీనమవ్వడానికి పెద్ద సమయం పట్టదు. అలా కాదు అంటే సినిమా మొదలైన ఒక 10 నిమిషాల్లో దర్శకుడు తన కథనంతో మిమ్మల్ని ఈ కథలోని తీసుకెళ్ళిపోతాడు. తాను రాసుకున్నది ఒక స్పేస్ కథాంశమే అయినప్పటికీ ఒక కమర్షియల్ చిత్ర కథనంలో ఉండే మలుపులు.. దాని తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లు మనం ఇందులో కూడా చూడచ్చు.
అయితే ఇక్కడ సంకల్ప్ రాసుకున్న కథనానికి కిట్టు విస్సప్రగడ అందించిన మాటలు బాగానే ఇమిడిపోయాయి. ముఖ్యంగా దేవ్ (వరుణ్ తేజ్)-పార్వతి (లావణ్య త్రిపాఠి) మధ్య సాగే సంభాషణల్లో చంద్రుడు, రాకెట్, శాటిలైట్ వంటి పదాల పోలికతో అందంగా ఉన్నాయి. ముఖ్యంగా “కారణంలేని ప్రేమకన్నా అద్భుతం ఇంకేం ఉంటుంది” అనే డైలాగ్ నా పర్సనల్ ఫెవరెట్ అని చెప్పాలి.
ఇక ఇటువంటి ఆసక్తికర కథనానికి నటీనటుల అభినయం చక్కగా కుదరాలి. ఆ రకంగా చూస్తే ఈ సినిమాలో కనిపించే ప్రధాన తారాగణం వరుణ్ తేజ్ (Varun Tej), అదితి రావు హైదరి (Aditi Rao Hydari), లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్ & రెహ్మాన్‌లు తమ పాత్రలకి న్యాయం చేశారు.
తాను నమ్మినదానికోసం ఎంతవరకైనా పోరాడే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు వరుణ్. అదే సమయంలో లావణ్యతో కలిసి ప్రేమికుడిగా కనిపించే సన్నివేశాల్లో సైతం చాలా బాగా చేశాడు. అదితి రావు నటన గురించి మనం చెప్పాల్సిందేముంది. ఇప్పటికే ఆమె నటనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తన ఫ్యాన్స్‌ని ఏ మాత్రం నిరాశపరచకుండా నటించేసింది. కొన్ని కీలక సన్నివేశాల్లో సత్యదేవ్, రాజా , శ్రీనివాస్ అవసరాల & రెహ్మాన్‌లు కథనంకి న్యాయం చేశారు.
ఇక తొలిసారి తెలుగులో వస్తున్న స్పేస్ డ్రామా (Space Drama) సినిమా అవ్వడంతో మనకి ఎటువంటి రిఫరెన్స్ పాయింట్ లేదు. అయినప్పటికీ దర్శకుడు తన సాంకేతివర్గంతో మంచి అవుట్ ఫుట్‌ని రాబట్టుకోగలిగాడు. సాంకేతిక వర్గంలో చెప్పుకోవాల్సింది ముందుగా VFX టీం గురించి. వారు చాలా బాగా పనిచేశారు అని చెప్పాలి. బడ్జెట్ పరంగా చూస్తే ఈ VFX షాట్స్ అద్భుతమనే అనాలి. తరువాత జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది, సినిమాటిక్ మూడ్‌ని కొనసాగించేలా కెమెరా పనితనం ఉంది.
ఇటువంటి ఒక స్పేస్ డ్రామాకి తగట్టుగా.. అలాగే థ్రిల్లింగ్ సన్నివేశాల్లో ప్రశాంత్ విహారి అందించిన బాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమని చెప్పాలి. ఆ నేపధ్యసంగీతం సదరు సన్నివేశాల స్థాయిని పెంచిందనే అనుకోవచ్చు. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కూడా అందరూ తమ పనిని చక్కగా నిర్వర్తించారు. ఇటువంటి చిత్రాలకి సాంకేతిక వర్గం ఎంత బాగా పనిచేస్తే అంత బాగా రిజల్ట్ ఉంటుంది.
చివరగా ఈ సినిమాలో మనకి వినిపించే కొన్ని టెక్నికల్ పదాలు సామాన్య ప్రేక్షకుడికి ఒకింత ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు. అలాగే రొటీన్ కమర్షియల్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ చిత్రం కాసింత బోర్ కొట్టించవచ్చు. అయితే ఇప్పటికే హాలీవుడ్ స్పేస్ డ్రామా సినిమాలు చూసిన వారికి మాత్రం ఈ చిత్రం ఒకింత సులభంగానే అర్ధమవుతుంది.
తాను సినిమాలు తీసే శైలి, కథలు ఎంచుకునే విధానం కూడా కాస్త భిన్నమే అని సంకల్ప్ మరోసారి నిరూపించాడు. తాను ఫిలిం స్కూల్లో నేర్చుకున్న “బీ ది ఫస్ట్ or బీ ది బెస్ట్” (Be The First or Be The Best) సూత్రాన్ని నమ్మి వెళుతున్నాడు. ఒకరకంగా అతనికి ఈ సినిమా తీసేందుకు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన రాజీవ్ రెడ్డిని ఈ చిత్ర సమర్పకుడిగా ఉన్న ప్రముఖ దర్శకుడు క్రిష్ని మెచ్చుకోకుండా ఉండలేము. వీరు మరిన్ని విభిన్న కథలకి ప్రోత్సాహకంగా నిలవాలని కోరుకుందాం.
చివరగా … “అంతరిక్షయానం అందరికి సాధ్యపడదు. అయితే సాధ్యమైనవారికి మాత్రం అదొక మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది“.
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla