Lifestyle

రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

Lakshmi Sudha  |  Jan 24, 2019
రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 69 ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్లవుతున్నా మహిళలుగా మనం స్వేచ్ఛగా బతుకుతున్నామా? రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవించగలుగుతున్నామా? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి.. మనసులోని మాటను కూడా నిర్భయంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ కాదు.. అసలు స్వాతంత్య్రం అంటే ఏంటి? మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛను కల్పించింది. స్వేచ్ఛగా బతికే హక్కునిచ్చింది. స్వేచ్ఛగా మాట్లాడే వీలు కల్పించింది. అయినా వాటన్నింటినీ అనుభవించే స్వాతంత్య్రం మనకుందా? లేదు కదా..!

స్త్రీ, పురుషులకు రాజ్యాంగం అన్నింటా సమాన అవకాశాలు కల్పించింది. మీతో సహా మీ చుట్టూ ఉన్న ఆడవారిని ఓసారి గమనించండి. ఎవరైనా పురుషులతో సమానంగా అవకాశాలందుకొంటున్నారా? లేదు కదా..! చదువుకొంటున్న అమ్మాయిలు వారి సోదరుల కోసం ఏదో ఒక సంద‌ర్భంలో కాంప్రమైజ్ అయ్యే ఉంటారు కదా..! ఉద్యోగం చేస్తున్న మహిళలు.. పురుషులతో సమానంగా జీతం తీసుకొంటున్నారా? పదోన్నతులు అందుకొంటున్నారా? ఇక వీట‌న్నింటికీ తోడు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. ప్రతి చోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు మ‌హిళ‌లు.

ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మీటూ ఉద్యమం కారణంగా సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ.. మంచి అనే ముసుగు వేసుకొని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మేక వన్నె పులుల గురించి క్ర‌మంగా వాస్త‌వాలు బయటకు వ‌స్తున్నాయి. ఇంకా బయటపడాల్సిన‌వారు ఇంకెంత‌ మందో..! ఇలాంటి దుర్మార్గుల ఉక్కు పిడికిళ్ల నుంచి స్వాతంత్య్రం కోసం మ‌న మ‌హిళ‌లంతా నేటికీ పోరాడుతూనే ఉన్నాం. ఈ విషయంలో న్యాయపరమైన పోరాటానికి దిగినా.. చట్టపరంగా హక్కులను కాపాడుకొనే ప్రయత్నం చేసినా.. తిరిగి మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది నిజంగా బాధాక‌ర‌మైన విష‌యం.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం. కానీ చట్టాలను రూపొందించే ఆ చట్టసభల్లో మహిళలకున్న ప్రాధాన్యమెంత? ఇప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల ఆమోదం ఎందుకు పొందడం లేదు? నిజమే.. స్థానిక సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

కానీ ఎంతమంది మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సర్పంచైనా కూడా కొంద‌రు భర్త చాటు భార్యగానే బతుకుతున్నారు. ఇంకొంద‌రు పురుషులు భార్య‌ పదవిని అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయించ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉంటాం. ఆఖ‌రికి అధికారిక స‌మావేశాల‌కు సైతం ప్ర‌జాప్ర‌తినిధి అయిన మ‌హిళ కాకుండా ఆమె భ‌ర్త వెళ్తున్నారు. మ‌న రాజ్యాంగం మ‌హిళ‌ల‌కు క‌ల్పించిన హ‌క్కుల‌కు భంగం క‌లుగుతోంద‌ని చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు అనేకం!!

మ‌న‌కు స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లవుతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 69 ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో ఎందుకు మహిళలు ఇప్పటికీ freedom కోసం పోరాడాల్సి వస్తోంది? వారిని అణచివేస్తోన్న లేదా బంధించి ఉంచుతున్న విషయాలేంటి? సాధికారత సాధించే క్రమంలో వారికి అడ్డుగా నిలుస్తున్నవేంటి? మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మహిళలను వస్తువుగా చూసే భావన ఇంకా పోలేదు.

అందుకే వారి ఇష్టాయిష్టాలకు నేటికీ పూర్తిస్థాయిలో ఆమోదం లభించడం లేదు. అనాదిగా మహిళలను తక్కువగానే చూస్తూ వ‌స్తున్నారు. నిరంతర పోరాటంతో స్త్రీలు కొంత‌మేర‌కు స్వేచ్ఛను సాధించుకొన్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయి స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. మ‌రి, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇంకెప్పుడు వారు పొందగలుగుతారు? మ‌హిళ‌ల‌ విషయంలో సెంటిమెంట్‌తో కట్టిపడేయడం కాకుండా సెన్సిటివిటీతో వ్యవహరించినప్పుడే మన హక్కులను మ‌నం అనుభవించగలుగుతాం. స్వేచ్ఛగా ఎదగగలుగుతాం. ఇలాంటి రోజులు త్వ‌ర‌లోనే రావాల‌ని మ‌న‌మంతా ఆశిద్దాం..

ఇవి కూడా చ‌ద‌వండి

రిప‌బ్లిక్ డే స్పెష‌ల్.. ట్రై క‌ల‌ర్ నెయిల్ ఆర్ట్స్ మీరూ ప్ర‌య‌త్నించండి..!

ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!

అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

ఎప్ప‌టికీ మీ వయసు ఇర‌వైలానే క‌నిపించాలా?? అయితే ఇలా చేయ‌కండి..!

జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?

Read More From Lifestyle