అమ్మాయిలు(women) అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోరని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తోన్న అమ్మాయిలు ఎంతోమంది. అయితే ఇలాంటి రోజుల్లోనూ అమ్మాయిలను తక్కువగా చూసేవారు ఎందరో..! కానీ మహిళలు జీవితంలో విజయం సాధించేందుకు పురుషుల తోడు అవసరం లేదని.. ఎవరి సహాయం లేకుండానే వారు అనుకున్నది సాధించగలరని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఎంతోమంది సూపర్ విమెన్ ఇది సాధ్యమని నిరూపించి చూపారు. నిజ జీవితంలోనే కాదు.. ఎవరి సాయం అవసరం లేకుండా ముందుకెళ్లే మహిళల కథలు వెండితెరపై కూడా ఎన్నో వచ్చాయి. వీటిని మనం ఫీమేల్ సెంట్రిక్ అన్నా.. విమెన్ ఓరియండెట్ అన్నా.. మహిళల కథతో విడుదలై ఎందరినో ఆకట్టుకున్నాయి ఈ చిత్రాలు(movies). జీవితంలో తనకు తానుగా ఏదైనా సాధించాలనుకునేవారికి ఈ సినిమాలు ఎంతో స్పూర్తినిస్తాయి.
రుద్రమదేవి
రుద్రమదేవి చరిత్రలోనే గొప్ప రాణి. మగవారితో సమానంగా తన రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలను కళ్లలో పెట్టుకుని చూసుకుంది. తన కథతో రూపొందిన రుద్రమదేవి చిత్రం కూడా అద్భుతమనే చెప్పుకోవాలి. మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా అన్ని పనులు అద్భుతంగా చేయగలరు. పురుషులతో సమానంగా రాజ్యాలు ఏలగలరు.. అని చెప్పిన వీరనారి రుద్రమదేవి కథను అద్భుతంగా వివరించి చెప్పిందీ సినిమా.. భవిష్యత్తు తరాలకు మహిళా నాయకురాలి గురించి పరిచయం చేయడమే కాదు.. ఎందులోనూ స్త్రీలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని తెలుసుకునేలా చేసింది ఈ సినిమా.
మయూరి
మయూరి ఓ పెద్ద డ్యాన్సర్. అయితే ఓ ప్రమాదం కారణంగా కాలు కోల్పోయిన తర్వాత అయినవాళ్లే ఆమెను దూరం పెడతారు. చివరికి ప్రేమించిన వ్యక్తి కూడా తనని కాదంటాడు. అప్పుడు తాను కోల్పోయింది కాలు మాత్రమే కానీ ఆత్మవిశ్వాసం తనతోనే ఉందని భావించిన మయూరి జైపూర్ కాలు సహాయంతో తిరిగి నాట్యం ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలిచ్చి తన పేరు తిరిగి సాధిస్తుంది. మనల్ని అందరూ వదిలేసినా ఫర్వాలేదు. సంకల్పం ఉంటే పోయినవన్నీ తిరిగి సాధించవచ్చు. దీనికి స్త్రీ, పురుషులనే తేడాలేవీ లేవని ఈ సినిమా నిరూపిస్తుంది.
అరుంధతి
అనుష్క నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద ట్రెండ్‌సెట్టర్ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు. ఇది మరో ఎత్తు. ఈ సినిమా అనుష్కకి పెద్ద స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. కామ పిశాచిగా మారిన ఓ వ్యక్తిని శిక్షించిన రాణిగా కనిపించే అనుష్క ఆపై తన రాజ్య ప్రజల కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడదు. తిరిగి మళ్లీ పుట్టిన ఆమె ప్రేతాత్మ రూపంలో సంచరిస్తున్న ఆ దుర్మార్గుని అంతం కోసం ప్రయత్నిస్తుంది. ఈ సినిమా మొత్తంలో అసలు హీరో కనపించడు. కాసేపు కనిపించినా.. అతని పాత్రే ఉండదు. ఎవరి సహాయం లేకుండానే ఓ రాక్షసుడిని అంతమొందించే అరుంధతిని చూస్తే సొంతంగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చన్న ఆత్మవిశ్వాసం మన సొంతమవుతుంది.
అనామిక
తన భర్త ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ఓ అమ్మాయి చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఒంటరిగా ప్రయత్నం చేస్తుంటే మనకు సాయం చేసేవారు ఎక్కడో కోటికో నూటికో ఒక్కరుంటారు. కానీ మన అవసరాన్ని అవకాశంగా మార్చుకొని మనల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకునేవారు చాలామందే. అయితే ఇలాంటివారికి మనం తలొగ్గాల్సిన అవసరం లేదు. సంకల్పం బలంగా ఉంటే ఒంటరిగా ఉన్నా.. మనం అనుకున్నది సాధించగలం అని ఈ చిత్రం నిరూపిస్తుంది.
ప్రతిఘటన
ఓ కాలేజీలో పనిచేసే లెక్చరర్ కి, రాజకీయ నాయకుడికి మధ్య గొడవైతే ఎవరైనా ఏం చేస్తారు.. పెద్దవాళ్లతో ఎందుకు గొడవ అనుకుంటారు. కానీ ఝాన్సీ అలా అనుకోలేదు. ఆ రాజకీయ నాయకుడిని కోర్టు బోనులో నిలబెట్టాలనుకుంది. దీని కోసం ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటుంది. తన కుటుంబ సభ్యులు, చివరకు భర్త కూడా సాయం చేయకపోతే.. ఒంటరిగానే అతడిని ఎదుర్కొంటుంది. చివరకు అపరకాళికగా మారి ఆ వ్యక్తిని చంపేస్తుంది. ఆడవాళ్లు కూడా అన్యాయం జరిగితే పోరాడేందుకు మగవాళ్ల కంటే ముందుంటారని చాటుతుందీ సినిమా. మనం న్యాయంగా ఉంటూ సమాజంలో ప్రతిచోటా న్యాయం జరిగేలా చూడాలని ఆడవాళ్లకు నేర్పుతుందీ సినిమా.
భాగమతి
ఇది కూడా అనుష్క నటించిన అద్భుత చిత్రరాజమే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఊళ్లను ఖాళీ చేయిస్తూ తనకు కాబోయే భర్తను చంపిన రాజకీయ నాయకుడిపై ఓ ఐఏఎస్ తెలివితో గెలిచిన కథ ఇది. భాగమతిగా అనుష్క నటన అద్భుతం అని చెప్పాలి.. నువ్వు ఒంటరివైనా.. చట్టం, న్యాయం అన్నీ నీకు అడ్డుగోడలుగా నిలిచినా.. నీ సంకల్పం మంచిదైతే.. అంతకంటే అద్భుతమైన ఆలోచన నీ సొంతమవుతుంది. అదే నిన్ను గెలిపిస్తుంది అని చెప్పే ఈ సినిమా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగకుండా గెలుపు దిశగా ముందుకు సాగాలని అమ్మాయిలకు చాటుతుంది.
హిందీలో కూడా..
కేవలం తెలుగులోనే కాదు.. వివిధ భాషల్లో స్త్రీ శక్తి విలువను తెలియజెప్పే సినిమాలు కోకొల్లలు. బాలీవుడ్‌లో అలాంటి సినిమాల గురించి చూస్తే..అబ్బాయి మనల్ని మోసం చేస్తే జీవితం అక్కడితో ఆగిపోదు అని ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లే క్వీన్ కూడా మనకెంతో నేర్పుతుంది. (ఈ చిత్రం దటీజ్ మహాలక్ష్మి పేరుతో తమన్నా కథానాయికగా తెలుగులో త్వరలో విడుదల కానుంది.) ఇక మన దేశం నుంచి పాకిస్థాన్‌కి గూఢచారిగా వెళ్లినా.. అటు భార్య బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎవరికీ తెలియకుండా దేశ రహస్యాలను మన దేశానికి అందించిన అమ్మాయిగా రాజీ చిత్రంలో అలియా నటన అద్భుతం. దీంతో పాటు చనిపోయిన తన సోదరికి న్యాయం చేయాలని ఓ మహిళ పాటు పడిన కథతో విడుదలైన నో వన్ కిల్‌డ్ జెస్సికా, స్త్రీ తలచుకుంటే ఏదైనా సాధించగలదని నిరూపించే ఇంగ్లిష్ వింగ్లిష్, రాణి ముఖర్జీ పోలీస్‌గా నటించిన మర్దానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే హిందీలోనూ బోలెడన్ని చిత్రాలు స్త్రీ శక్తిని చాటిచెబుతాయి.
ఇవి కూడా చదవండి.
ఈ భూమి మీద అసలు మహిళ లేకపోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?
విజేతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మకు మాత్రం పసిబిడ్డే..!
ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశభక్తిని మరింత పెంచుతాయి..!
Source : Wikipedia