Bollywood

ఒక రాజ‌కీయ నాయ‌కుడిని.. ప్ర‌జా నేత‌గా మార్చిన “యాత్ర” (సినిమా రివ్యూ)

Sandeep Thatla  |  Feb 8, 2019
ఒక రాజ‌కీయ నాయ‌కుడిని.. ప్ర‌జా నేత‌గా మార్చిన “యాత్ర”  (సినిమా రివ్యూ)

టాలీవుడ్ (Tollywood) మొద‌లుకొని బాలీవుడ్ (Bollywood) వ‌ర‌కు.. ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ట్రెండ్ (Biopic Trend) బాగా న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖుల జీవితాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను నిర్మించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. వీటి జ‌యాప‌జ‌యాల సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వైపు ర‌ప్పించ‌డంలో ఈ చిత్రాలు బాగా స‌ఫ‌ల‌మ‌వుతున్నాయనే చెప్పాలి. అలా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతోన్న ఈ బ‌యోపిక్ ల ప‌ర్వంలో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్ర‌మే “యాత్ర” (Yatra).

అయితే ఈ సినిమాను బ‌యోపిక్ అన‌డం కంటే ఒక మ‌హానేత‌గా ఎదిగిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి జీవితంలో జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌ల స‌మాహారం అని చెప్ప‌డం స‌బ‌బు. ఒక వ్య‌క్తి జీవితంలోని కీల‌క సంఘ‌ట‌న‌లు, వాటి ద్వారా ఎదురైన ప‌రిణామాల ఆధారంగానే ఈ సినిమాను చిత్రీక‌రించారు. “యాత్ర” చిత్రం విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు మ‌హీ వీ రాఘ‌వ్ (Mahi V Raghav) కూడా ఇదే విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈ సినిమాను దివంగ‌త మ‌హా నాయ‌కుడైన వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలోని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించ‌డంతో అంతా దీనిని బ‌యోపిక్ అనే భావించారు.

ఈ సినిమా ట్రైల‌ర్‌లో కూడా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రి కాకమునుపు చేసిన పాదయాత్ర (Padayatra).. ఆ సమయంలో ఆయనకు ప్రజల నుంచి ల‌భించిన స్పంద‌న‌.. ప్రజలు పడే కష్టాలను ఆయన ఎలా తెలుసుకోగలిగారు?? పాదయాత్ర ఆయనని ఒక వ్యక్తిగా ఎలా మార్చింది? అనే అంశాల‌ను స్పృశిస్తూనే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని క‌లిగించారు.

“కోపం న‌రాన్ని నేను తెంపేసుకున్నాను..” అంటూ వైఎస్సార్ చెప్ప‌డంతో అందుకు గ‌ల కార‌ణ‌మేంటా అని క‌థ ప‌ట్ల మ‌రింత ఆతురుత‌గా ఎదురుచూశారు ప్రేక్ష‌కులు. మ‌రి, ద‌ర్శ‌కుడు తాను అనుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు చూప‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడా?? ప‌్ర‌ధాన పాత్ర‌ల‌తో పాటు, కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన పాత్ర‌ధారుల న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకోగ‌లిగింది?? తెలియాలంటే ఒక‌సారి మ‌నం క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

వైఎస్సార్ చేసిన పాద‌యాత్ర‌తో క‌థ మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆయ‌న ముఖ్య‌మంత్రి (Chief Minsiter) అయ్యే వ‌ర‌కు జ‌రిగిన ఇతివృత్తాన్నే ప్రేక్ష‌కుల‌కు చూపించారు. ఈ క్ర‌మంలో వైఎస్సార్ ఆయ‌న హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు (Welfare Schemes), వాటి ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు, మ‌రింత బాగా పాలించేందుకు ఆయ‌న ప‌డిన శ్ర‌మ‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఈ క్ర‌మంలో వాస్త‌వంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు కాస్త డ్రామా కూడా జోడించారు. అలా త‌న‌దైన శైలిలో ఎక్క‌డికక్క‌డ సినిమాటిక్ ట‌చ్ ఇవ్వ‌డం ద్వారా తెర‌పై ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ సినిమాను చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం కూడా చేసిన‌ట్లు మ‌న‌కు అనిపిస్తుంది. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు చాలా వ‌ర‌కు స‌ఫ‌ల‌త సాధించార‌నే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో ప్ర‌ధానమైన వైఎస్సార్ పాత్రలో జాతీయ ఉత్త‌మ న‌టుడిగా గుర్తింపు సాధించిన మ‌మ్ముట్టి (Mammootty) తన శక్తిమేరకు రాణించారు. ఆ పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ప‌లు కీల‌క సన్నివేశాల్లో త‌న న‌ట ప్ర‌తిభ‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు; తెలుగు రాక‌పోయినా సంభాష‌ణ‌లు నేర్చుకుని మ‌రీ.. తెలుగులో ఆయ‌న పాత్ర‌కు ఆయ‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం కూడా ఈ చిత్రానికి ఒక ప్లాస్ పాయింట్‌గా మారింది. ఆయ‌న కేవ‌లం వెండితెర‌పై అభిన‌యించ‌డమే కాదు.. త‌న గాత్రంలోనూ ఎంతో చ‌క్క‌గా హావ‌భావాల‌ను ప‌లికించారు. ఈ పాత్ర కోసం ఆయ‌న చేసిన కృషి, ప‌డిన శ్ర‌మ నిజంగా అభినంద‌నీయం. ముఖ్యంగా ఆయ‌న చెప్పిన “ఒక్కసారి మాటిచ్చాక ముందుకెళ్ళాల్సిందే.. “మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీ కొడుకుని ఇంజనీరింగ్ సీటు కోసం ప్రిన్సిపాల్‌ని కలవమను.. ఒకవేళ మేము ఓడిపోతే వచ్చి నన్ను కలవమను” అంటూ ఆయ‌న ఒక తల్లికి చెప్పే డైలాగ్స్ కు థియేటర్ లో మంచి స్పంద‌న ల‌భించింది.

ఇక ఇందులో మిగ‌తా పాత్ర‌ల గురించి మాట్లాడుకుంటే..

వైఎస్సార్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో బాహుబ‌లి ఫేం ఆశ్రిత వేముగంటి (Ashritha Vemuganti) న‌టించ‌గా; ఆయ‌న ఆత్మ‌గా పిల‌వ‌బ‌డే కేవీపీ పాత్ర‌లో రావు ర‌మేష్ (Rao Ramesh), పార్టీ రాష్ట్ర ఇంఛార్జి పాత్రలో సచిన్ ఖేద్కర్ (Sachin Khedekar), వైఎస్సార్ తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu), హ‌త్య‌గావించ‌బ‌డిన ఒక ఎక్స్ ఎమ్మెల్యే కుమార్తె పాత్ర‌లో అన‌సూయ (Anasuya)ల‌తో పాటు సుహాసిని (Suhasini), పృథ్వీ (Prithvi), పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali).. తదిత‌రులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. వీరంతా త‌మ త‌మ పాత్ర‌ల‌కు త‌మ ప‌రిధి మేర‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

అలాగే చిత్ర సాంకేతిక వ‌ర్గం విష‌యానికొస్తే సంగీత ద‌ర్శ‌కుడు కె (K) ఈ సినిమాకు త‌గ్గ‌ట్టుగా నేప‌థ్య సంగీతం, పాట‌లు అందించారు. ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి (Sirivennela Seetarama Sastry) సాహిత్యం పాట‌ల్లో మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఛాయాగ్రాహ‌కుడు స‌త్య‌న్ సూర్య‌న్ (Sathyan Sooryan) & ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ (Sreekar Prasad)ల ప‌నిత‌నం కూడా ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. నిర్మాణ విలువ‌ల ప‌రంగా కూడా చిత్రానికి ఏమేమి ఎంత‌వ‌ర‌కు అవ‌స‌ర‌మో అవ‌న్నీ స‌మ‌కూర్చ‌డంలో నిర్మాత‌లు విజయ్ చిల్లా (Vijay Chilla) & శశి దేవిరెడ్డి (Shashi Devireddy)లు స‌క్సెస్ సాధించార‌ని చెప్పుకోవ‌చ్చు.

చివ‌రిగా ఒక్క మాట‌లో చెప్పాలంటే- ఒక‌ మ‌హా నాయ‌కుని రాజ‌కీయ జీవితంలో భాగంగా ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ చిత్రం. అంతేకాదు.. ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఒక రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌జా నాయ‌కుడుగా మారిన తీరుని మ‌నం వెండితెర‌పై గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

రామ్ చరణ్‌ సరసన “RRR”లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?

“ప‌ల్లె కోయిల” ప‌స‌ల బేబీ నోట.. హృద్యమైన మట్టి మనిషి పాట..!

టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!

Read More From Bollywood