కొత్త సంవత్సరం మొదలు కాగానే చాలామందిలా మీరూ ఫిట్‌నెస్ కోసం యోగా మొదలుపెట్టాలనుకొని ఉండుంటారు. కానీ దాన్నిప్రారంభించగానే యోగా చేయాలంటే కేవలం శాకాహారం తినాలేమో.. యోగా(Yoga) కేవలం సూర్యోదయం సమయంలోనే చేయాలేమో.. అనుకుంటూ చాలామంది దాన్ని వాయిదా వేస్తుంటారు. ఇవే కాదు.. యోగా గురించి చాలామందికి చాలా అపోహలుంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. యోగా అంటే వ్యాయామం కాదు. అది ఒక జీవనశైలి. ఇదేంటో తెలియాలంటే అసలు యోగా గురించి ఉన్న అపోహలు(Myths).. వాస్తవాలు (Truths) తెలుసుకోవాల్సిందే.
1. యోగా చేయాలంటే శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండాల్సిందే.
ఇది మీరు జిమ్‌కి వెళ్లాలంటే సన్నగా ఉండాల్సిందేనని చెప్పినట్లుంది. విచిత్రంగా అనిపిస్తోంది కదూ.. అయినా ఇది నిజం. మనం ఏదైనా నేర్చుకోవాలంటే అందులో మొదటి మెట్టునుంచి ఎక్కుతూ వెళ్తాం తప్ప అందులో ప్రావీణ్యం సంపాదించాక గానీ అందులోకి అడుగుపెట్టం అంటే ఎప్పటికీ దానికి దూరంగానే ఉంటాం. అందుకే నిపుణులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫ్లెక్సిబిలిటీని సంపాదించాలని చెబుతూ ఉంటారు. అందుకే యోగా చేసిన మొదటిరోజే నేను వంగినప్పుడు నా కాళ్లు పట్టుకోలేకపోతున్నా.. అంటే అది కుదరదు. చేస్తూ ఉంటే కొన్నిరోజుల్లో అది సాధ్యమవుతుంది.
2. యోగా హిందూ మతానికి చెందిందా..?
యోగా భారతదేశంలో పుట్టింది కాబట్టి అది హిందూ మతానికి చెందిందని చాలామంది భావిస్తారు. అయితే ఇది పూర్తిగా తప్పు. యోగా భారతీయ సంప్రదాయంలో భాగం. అది కేవలం హిందూ మతానికి మాత్రమే చెందిన విషయం కాదు. పూర్తి భారత దేశానికి సంబంధించిన అంశం ఇది. యోగా అంటే హిందుత్వం కాదు.. భారతీయత. అందుకే దీన్నిఒక మతానికి చెందిన అంశంగా చూడకుండా మన దేశానికి సంబంధించినదిగా చూద్దాం.
3. యోగాసనాలు చేయడం అసాధ్యమా?
కొంతమంది తారలు, ఫిట్‌నెస్ నిపుణులు యోగాలో కఠినమైన ఆసనాలను సులువుగా చేసి చూపిస్తుంటారు. శరీరం మొత్తం బరువు చేతులపై ఉంచి ఆసనం వేయడం చూసి మనం ఇది చాలా కఠినం. మనం చేయలేం అనుకొని దానివైపు చూడడమే మానేస్తాం. అయితే ఈ కఠినమైన ఆసనాలే కాదు.. సులభమైనవీ యోగాలో చాలానే ఉంటాయి. అసలు యోగాలో ఈ ఆసనాలను చాలా తక్కువ ప్రాధాన్యం ఉంది. ఇక్కడంతా ప్రశాంతమైన మనసుతో చేయడమే ఉంటుంది. కానీ ప్రస్తుతం అందరూ ఆసనాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. అయినా మీరు సులువైన ఆసనాలు ప్రయత్నించవచ్చు.
4. యోగా చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందా?
మీరు సిక్స్ ప్యాక్ కోసం యోగా చేస్తుంటే మీరు తప్పు దారిలో వెళ్తున్నట్లే. కొన్ని రోజుల పాటు యోగా చేస్తే మంచి ప్రయోజనాలుంటాయి. శారీరకంగా ఫిట్‌గా తయారవుతారు. కానీ యోగా చేస్తే సిక్స్ ప్యాక్ రావడానికి చాలా కాలమే పడుతుంది. అందుకే ఇలాంటి గోల్స్ ఉంటే యోగా ఎంచుకోకపోవడం మంచిది. యోగా మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా మారుస్తుంది.
5. పుస్తకం చూసి యోగా నేర్చుకోవచ్చా?
సైన్స్ కూడా మనం పుస్తకంలో చూసే నేర్చుకుంటాం. కానీ మన సొంతంగా ప్రయోగాలు చేసినప్పుడే కదా.. దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది. మరి, యోగాను పుస్తకంలో చూసి ఎలా నేర్చుకోగలం.. యోగా గురించి పుస్తకంలో చదవచ్చు. కానీ ఆసనాలను మాత్రం మంచి యోగా ట్రైనర్ వద్దే నేర్చుకోవాలి.
6. సంగీతంతో చేస్తే యోగా చక్కగా వస్తుందా?
నూనె, నీళ్లను కలిపినట్లుగా ఉంటుందీ కాంబినేషన్. యోగా అనేది ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. అందుకే యోగా చేసే చోట ఎలాంటి శబ్దాలు రాకుండా చూసుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటిది సంగీతం పెట్టుకొని యోగా చేయడమంటే యోగా నియమాలను పూర్తిగా ఉల్లంఘించినట్లే.
7. యోగా ఎప్పుడు చేయాలి?
యోగా అనేది ఒక వ్యాయామం కాదు. అది జీవనశైలి. అందుకే దీన్ని రోజులో కేవలం ఒక సమయంలో చేయాలన్న నియమమేమీ లేదు. అయితే యోగా చేస్తున్నప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం ఉదయాన్నే చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. భారతీయ యోగుల్లో ప్రముఖులైన సద్గురు యోగా కేవలం ఉదయం లేదా సాయంత్రం చేసే వ్యాయామం కాదు. దాన్ని అలా వ్యాయామంలా భావిస్తే రోజంతా మీరు దానికి దూరంగా ఉంటారు. యోగా అంటే ఓ జీవనశైలి. దానిలోనే జీవించాలంటే రోజంతా మీరు దాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాల్సిందే అంటారు.
8. నొప్పులు ఉంటే యోగా చేయకూడదా?
మనం సాధారణంగా నొప్పి ఉంటే కొన్ని పనులు చేయకుండా ఆగిపోతాం. యోగా విషయంలోనూ దీన్ని పాటిస్తారు చాలామంది. అయితే యోగా నొప్పులను తగ్గిస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది. కొన్ని యోగాసనాలు వివిధ రకాల దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంలోనూ ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు తేల్చారు.
9. యోగా చేస్తే వెజిటేరియన్ అవ్వాలేమో..
యోగా చేసే వాళ్లందరూ శాకాహారులే అవ్వాల్సిన అవసరం లేదు. అయితే అహింస, యమస్ అనే పద్ధతులను పాటించేవాళ్లు మాత్రం శాకాహారం తీసుకుంటారు. ఇవీ పతంజలి చెప్పిన నియమాలే.. కానీ వీటిని అందరూ పాటించాలని నియమం లేదు.
10. ఇది కేవలం సాధువులదేనా
సాధువులు యోగా చేసినంత మాత్రాన యోగా వారి జీవనశైలి అనుకోవడం తప్పు. యోగా చేసేవారు రుద్రాక్షమాలలతో చెట్ల కింద నివసిస్తారనేది ఒక అపోహ మాత్రమే. యోగా మనల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుస్తుంది. అందుకే దాన్ని చేయాల్సిన అవసరం ఉంది.
యోగా గురించి ప్రస్తుతం సమాజంలో చాలా చెబుతున్నారు. చాలా ఆసనాలు వేస్తున్నారు. కానీ వారంతా అసలైన యోగాలో కేవలం ఒక చిన్న అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారు అంటూ సద్గురు చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ యోగాను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా మారేందుకు ఉపయోగించుకుందాం.
ఇవి కూడా చదవండి
30 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా
ఒత్తిడి నివారణకు ఈ యోగాసనాలు.. గర్భిణులకు ప్రత్యేకం
బాదంపప్పు తింటే ఉండదు.. మన ఆరోగ్యానికి ముప్పు