అమీర్ ఖాన్ (Aamir khan).. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. సినిమా కోసం ప్రాణాలు పెట్టేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉంటారు. ఎన్ని రిస్కులైనా తీసుకుంటారు. పాత్ర కోసం తనని తాను మార్చుకోవడం అమీర్‌కి వెన్నతో పెట్టిన విద్య. అలా ఎంతో కష్టపడి సినిమాలు రూపొందిస్తూ ప్రతి కథలో కొత్తదనం చూపిస్తారు కాబట్టే అమీర్ చిత్రాలు దాదాపు అన్నీ ప్రేక్షకాదరణ పొందుతుంటాయి.
గతంలో ‘గజిని’ చిత్రం కోసం కండలు పెంచిన అమీర్.. ‘దంగల్’ కోసం ముందు లావై.. ఆ తర్వాత మళ్లీ బరువు తగ్గారు. అందరూ సిక్స్‌ప్యాక్ కోసం తహతహలాడుతోన్న సమయంలోనే ఎయిట్ ప్యాక్ శరీరంతో అబ్బాయిలకు కొత్త ఫిట్‌నెస్ గోల్స్ అందించిన అమీర్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ కోసం కూడా బరువు తగ్గుతున్నారట.
ఈ సినిమా గురించి చెబుతూ.. “సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. అయితే దీనికోసం మేం ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాం. ఈ సినిమాలో నేను పాతికేళ్ల యువకుడిగా కనిపించాలి. అందుకే దీనికోసం 20 కిలోల బరువు తగ్గాలని మేం నిర్ణయించాం. మరోసారి డైట్, వ్యాయామాలు ప్రారంభించాను. ఇప్పటికి రెండు వారాల నుంచి ఈ డైట్ చేస్తున్నా. ఈ రెండు వారాల్లోనే మూడు కిలోలు తగ్గాను.
ఇంకా పదిహేడు కిలోలు తగ్గాల్సి ఉంది. దీనికోసం ఫిట్‌నెస్ నిపుణుల సలహా మేరకు నా డైట్‌ని పూర్తిగా మార్చుకున్నాను. రోజూ కేవలం రోటీ, దాల్, సబ్జీ మాత్రమే తింటున్నా. ఎక్కడికైనా వెళ్లినా సరే.. వేరే ఆహారం తినకుండా ఉండేందుకు బాక్స్ తీసుకొని వెళ్తున్నా. పార్టీలకు వెళ్లినా బాక్స్ తీసుకెళ్లడం ఏంటని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. కానీ ఇది నిజం. ఇంతకుముందు దంగల్ సమయంలోనూ అలాగే చేశాను.
దంగల్ కోసం నేను బరువు తగ్గే సమయంలో ఇలాగే ఓసారి షారూఖ్ (shahrukh khan) ఇంటికి టిఫిన్ బాక్స్‌తో వెళ్లాను. ఈ విషయం మీరు షారూఖ్‌ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. అప్పట్లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌కి వచ్చినప్పుడు ఆయన కోసం షారూఖ్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించాడు. నేను ఆ పార్టీకి వెళ్లేటప్పుడే.. నాతో పాటు నేను తినే ఆహారాన్ని టిఫిన్ బాక్స్‌లో నింపి తీసుకువెళ్లాను.. మన్నత్‌కి వెళ్లాక అక్కడ అందరం కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత గౌరి భోజనం చేసి వెళ్లండి అని చెప్పింది. నేను సరేనన్నా. అందరూ కలిసి భోజనాలు చేసే సమయానికి నేను నా బాక్స్ తీశాను.. దాంతో గౌరీ ఆశ్చర్యపోయి.. పార్టీకి టిఫిన్ తీసుకురావడమేంటి? ఏమన్నా సమస్యా? అని అడిగింది.. దీనికి నేను అయ్యో.. సమస్యేమీ లేదు. నాకు మీ పార్టీలో అందరితో కలిసి కూర్చొని తినాలని ఉంది. అందుకే ఈ పార్టీకి వచ్చాను.కానీ నేను సినిమా కోసం డైటింగ్‌లో ఉన్నా. కాబట్టి వేరే ఆహారం తినకూడదు. నేను తినగలిగే ఆహారాన్ని డబ్బాలో తీసుకొచ్చాను.. అని చెప్పి ఆ డబ్బాలోని భోజనం తిన్నా” అని చెప్పాడు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అందుకే దంగల్ సమయంలో 22 కేజీలు తగ్గాడట అమీర్..
అంతేకాదు.. బరువు తగ్గడం అంటే చాలామంది తక్కువ ఆహారం తీసుకోవడమే దానికి మార్గం అని భావిస్తారని.. అయితే అది సరికాదని చెప్పాడు అమీర్. దంగల్ సమయంలో ఒకసారి తన బాయ్ భోజనం తీసుకొని వచ్చినప్పుడు అందులో అన్నం, పప్పు, గ్రేవీ ఉండడం చూసి చాలామంది తనని మీరు బరువు పెరగడానికి తింటున్నారా?
లేక తగ్గడానికి తింటున్నారా? మీరు తినే ఆహారం చాలా ఎక్కువగా ఉంది అని అడిగేవారు అంటూ చెప్పారు అమీర్. బరువు తగ్గడానికి తక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదని.. కేవలం తక్కువ క్యాలరీలలో ఎక్కువ పోషకాలు అందే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించాడు.
తన సినిమా లాల్ సింగ్ చద్దా గురించి చెబుతూ ఇది ఆంగ్ల సినిమా ఫారెస్ట్ గంప్ ఆధారంగా తీస్తున్న సినిమా. రంగ్ దే బసంతి సినిమాలో నటిస్తున్నప్పుడే దర్శకుడు అతుల్ కులకర్ణి ఈ సినిమా ఆధారంగా కథ రూపొందించుకొని నా దగ్గరికి వచ్చారు. అయితే నేను అప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ కథ నా దగ్గరికి వచ్చిన రెండున్నరేళ్లకు కథ చదివి చాలా బాగుందని భావించా. అందులో నటిస్తే బాగుంటుందనిపించింది.
అందుకే అతుల్‌ని తిరిగి సంప్రదించాను. సీక్రెట్ సూపర్ స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వయకామ్ 18 మోషన్స్ పిక్చర్స్ తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అమీర్. 1994లో హాలీవుడ్ హీరో టామ్ హాంక్ కథానాయకుడిగా విడుదలైన ఫారెస్ట్ గంప్ మంచి విజయాన్ని సాధించింది. మరి, ఇప్పుడు దాని ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి.
తమన్నా ఈ నటుడితో.. డేటింగ్‌కి వెళ్లాలని అనుకుందట. ఎందుకో తెలుసా?
ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!
సానియా మీర్జా 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గింది.. ఎలాగో తెలుసా..?