అందాల పోటీలు (Beauty Pageants).. ఇవంటే మనలో చాలామందికి ఎంతో ఇష్టం. మరికొందరికి మాత్రం అవంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ వీటిలో పాల్గొనడం మాత్రం కాస్త కష్టమేనని చెప్పుకోవాలి. అటు అందాన్ని, ఇటు నాజూకైన శరీరాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. అందాల పోటీలు గెలిస్తే ఎన్నో అవకాశాలు మన చేతికి అందుతాయి. అందులో ముఖ్యమైనవి సినిమా అవకాశాలు. అందాల పోటీల్లో గెలిచినవారు బాలీవుడ్‌లోకి అడుగుపెడతారనేది సాధారణంగా అందరూ అనుకునే విషయం.
ఇది చాలా మంది అందాల రాణులు ఫాలో అయ్యే రూటే. సినిమాలను కాదని ఇతర రంగాలను ఎంచుకున్న అమ్మాయిలు కూడా ఉన్నా.. అవి కూడా గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన రంగాలే అయి ఉంటాయి. అయితే ఈ పద్ధతులన్నింటినీ పక్కన పెట్టి ఎవరూ ఎంచుకోని దారిలో వెళ్లి ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైంది గరిమా యాదవ్ (Garima yadav).. మరి, అందాల కిరీటాన్ని గెలిచిన ఆమె శారీరకంగా ఎంతో శ్రమకోర్చి చేయాల్సిన ఆర్మీ ఆఫీసర్ విధులను ఎందుకు ఎంచుకుంది? తెలుసుకుందాం రండి..
గరిమా యాదవ్.. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీకి చెందిన విద్యార్థిని. కాలేజీ చదువు పూర్తియిన తర్వాత ఐఏఎస్‌కి ఎంపిక కావాలన్నది తన లక్ష్యం. కానీ గరిమ తాను అనుకున్నది సాధించలేకపోయింది. కానీ సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) పరీక్షను మొదటి సారే పాసై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో స్థానం సంపాదించింది గరిమ. అయితే కాలేజీ పూర్తి చేసుకోవడం, ఐఏఎస్‌కి ప్రయత్నించి విఫలమవ్వడం, సీడీఎస్ పరీక్షలో పాసవ్వడంతో పాటు గరిమ తన జీవితంలో మరో ముఖ్యమైన ఘనతను కూడా సాధించింది.
2017లో ఇండియాస్ మిస్ ఛార్మింగ్ ఫేస్ అనే అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని కూడా గెలుచుకుంది గరిమ. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఇంటర్నేషనల్ మిస్ ఛార్మింగ్ ఫేస్ పోటీల్లో పాల్గొనడానికి ఇటలీ వెళ్లే అవకాశాన్ని కూడా అందుకుంది గరిమ. ఇటు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం.. అటు అంతర్జాతీయ స్థాయిలో జరిగే అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం.. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం ఎవరికైనా కాస్త కష్టమైన విషయమే..
ఇంకెవరైనా అయితే అందాల పోటీలు, గ్లామర్, డబ్బు ఎక్కువగా ఉండే అంతర్జాతీయ పోటీలనే ఎంచుకునే వారేమో.. కానీ గరిమ మాత్రం ఈ పోటీలను కాదని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో తన శిక్షణను పూర్తి చేయడానికి ఇష్టపడింది. అలా ఆర్మీని తన రంగంగా ఎంచుకొని శిక్షణ పూర్తి చేసి లెఫ్టినెంట్‌గా మారింది.
తన గురించి చెబుతూ – నాన్న లేకపోయినా మా అమ్మ నన్ను చిన్నతనం నుంచి ఎంతో ధైర్యంగా పెరిగేలా పెంచింది. తనలోని ధైర్యమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. చిన్నతనంలో నేను ఆర్మీ స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినా అందులో ఎంపికవ్వలేదు. నేను ఆర్మీలో చేరాలని రాసి ఉందనుకుంటా. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైంగా ఓ మార్కెటింగ్ కన్సల్టెన్సీతో కలిసి ఈవెంట్లలో పాల్గొనేదాన్ని. అలా నాకు ఇండియాస్ మిస్ ఛార్మింగ్ ఫేస్ పోటీల్లో పాల్గొనే అవకాశం దొరికింది.
నవంబర్ 2017లో ఈ పోటీలను గెలుచుకున్నా. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ అది కేవలం నా హాబీ మాత్రమే.. నాకు ఇష్టమైన వృత్తి ఆర్మీ.. అందుకే ఇందులోకి అడుగుపెట్టాను. ఓటీఏ (ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ)లో నా అనుభవం చాలా బాగుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించేది. ట్రైనింగ్ కాస్త కష్టంగా ఉంది. వాతావరణం కూడా అనుకూలించలేదు. మొదట కొన్ని నెలలు ఏదోలా గడిపేశాను. కానీ ఆ తర్వాత మాత్రం అన్ని యాక్టివిటీల్లో పాల్గొనేదాన్ని. ఎస్ఎస్‌బీ(సర్వీస్ సెలక్షన్ బోర్డ్)లో ఎంపికవ్వాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి.
అన్ని ఆటల్లో ఆరితేరి ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. మీ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు.. ట్రైనింగ్ పూర్తయ్యేలోపు మీరు శారీరకంగా బలంగా మారుతారు. రోజు నిన్నటికంటే బెటర్‌గా మారేందుకు ప్రయత్నించడంతో పాటు పాజిటివిటీ, క్రియేటివిటీ, నిజాయతీ వంటివి అలవర్చుకోవాలి… అని చెప్పింది గరిమ.
ఇవి కూడా చదవండి.
జయహో భారత్.. శభాష్ ఇండియన్ హీరోస్ (సోషల్ మీడియాలో ఆనంద హేల)
“రిపబ్లిక్ డే” ప్రత్యేక కథనం: చరిత్రను తిరగరాసిన మన మహిళా దళాలు.. !
ఆర్మీ పటాలానికి తొలి మహిళా నాయకురాలు భావనా కస్తూరి ..!
Images : SSB Crack Instagram