Fitness

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

Sandeep ThatlaSandeep Thatla  |  Aug 29, 2019
బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

నిద్ర అనేది మన శరీరానికి ఎంతో అవసరం.  మన దినచర్య సజావుగా సాగాలంటే కూడా నిద్ర ఎంతో ప్రధానమైనది.  రోజు ఉదయం నుండి రాత్రి వరకు వివిధ పనులతో శారీరకంగా, మానసికంగా అలిసిన మన శరీరం.. తిరిగి ఉత్సాహం నింపుకొని తరువాత రోజుకి సిద్ధం కావాలంటే.. దానికి కావాల్సింది సరైన నిద్ర. రోజుకి 8 గంటలు నిద్ర తప్పనిసరి అని చెబుతారు. లేదంటే కనీసం 6 గంటల పాటైనా నిద్రిస్తే తప్ప.. తరువాత రోజుకి మన శరీరం సిద్ధం కాదు.

అలాగే కంటినిండా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన నిద్రను పొందాలంటే.. మనం ఎటువంటి పొజిషన్స్‌లో పడుకోవాలి.. బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ అనుసరించపోవడం వల్ల (Best Sleeping Positions)  వల్ల వచ్చే ఇబ్బందులేమిటి? వాటిని ఎలా నివారించాలి అన్న ప్రశ్నలకి  విపులంగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. మీరు కూడా ఒకసారి వాటిని చదివి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.

ఈ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. సందేశాలు.. మీ కోసమే..

సరైన నిద్ర మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యం…

మన శరీరం,  సెల్ ఫోన్ దాదాపు ఒకటే. ఈ రెండు కూడా ఒక నిర్ణీత సమయం తరువాత పనిచేయడం ఆపేస్తాయి. సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ ఎలా అయితే పెడతామో.. అలాగే మన శరీరం కూడా రీఛార్జ్ కావాలంటే నిద్ర అత్యవసరం. 

ఫుల్ ఛార్జింగ్ అయిన తరువాత సెల్ ఫోన్ ఏవిధంగా అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో.. అదే రీతిలో అలసిన మన శరీరానికి కూడా.. అదేవిధంగా మంచి నిద్రని ఇవ్వగలిగితే.. అది కూడా తన శక్తి మేర పనిచేసే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఇప్పటికే చాలా మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు… మనిషి తన శరీరానికి కావాల్సినంత సమయం నిద్ర రూపంలో విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. తద్వారా ఆరోగ్య సమస్యలకి గురికాకుండా ఉంటారని తెలియజేస్తున్నారు.  ప్రపంచంలో కొంతమంది నిద్రలేమితో బాధపడుతున్న వారిని..  రోజుకి తప్పనిసరిగా 6 నుండి 8 గంటల పాటు నిద్రపోతున్న వారితో పోలుస్తూ పరిశోధనలు జరిపారట. ఈ క్రమంలో నిపుణులు పలు ఆసక్తికరమైన అంశాలని తెలుసుకున్నారట.

నిద్ర సక్రమంగా ఉండే వారిలో ఉన్న చురుకుదనం & పోటీతత్వం… నిద్ర సరిగా లేని వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందట. అదే సమయంలో చక్కగా నిద్రపోయే వ్యక్తులు.. తమ రోజు వారి కార్యక్రమాలని అనుకున్న సమయానికి పూర్తి చేస్తుంటే.. నిద్ర లేమితో బాధపడేవారు మాత్రం తమ రోజువారీ కార్యక్రమాల్లో పూర్తిగా వెనుకపడిపోతున్నారట. 

ఇక సరైన నిద్ర ఉంటే, ఈ క్రింది ఉపయోగాలను ఇట్టే పొందవచ్చు

అవేంటంటే –

* గుండె ఆరోగ్యంగా ఉంటుంది

* డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

* అధిక బరువు పెరుగకుండా ఉంటారు.

* బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది.

* స్ట్రెస్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

* జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

* రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* మనసు ప్రశాంతంగా ఉంటుంది.

* ఒంటి నొప్పులు కూడా తగ్గు ముఖం పడతాయి.

* చురుగ్గా ఉంటారు

మీరే గమనించారు కదా! పైన చెప్పిన లక్షణాలన్ని.. ప్రతిరోజు ఆరోగ్యకరమైన నిద్ర ఉంటేనే మీ సొంతమవుతాయి. లేదంటే అనవసరంగా లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుంది.

స్లీపింగ్ పొజిషన్స్‌కి ఎందుకంత ప్రాధాన్యత..? మంచి ఆరోగ్యం కోసం బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ వివరాలు

స్లీపింగ్ పొజిషన్స్ (sleeping positions) మన శరీరంపై.. తెలియకుండానే చాలా ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా కొన్ని భంగిమల్లో పడుకుంటే.. వాటి వల్ల  ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఉదాహరణకి కొన్ని భంగిమల్లో పడుకుంటే మెడ నొప్పి & నడుము నొప్పి వంటివి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే నిద్రించే సమయంలో కూడా.. సరైన పొజిషన్‌లో పడుకోవాలి.

మంచి ఆరోగ్యం కోసం.. ఈ  స్లీపింగ్ పొజిషన్స్ ఎవరైనా పాటించాల్సిందే. 

బ్యాక్ స్లీపింగ్ పొజిషన్ (Back Sleeping Position)

మనం బెడ్ పైన వెల్లకిలా పడుకొని నిద్రపోతే.. దానిని బ్యాక్ స్లీపింగ్ పొజిషన్ అంటారు. ప్రధానంగా నడుము నొప్పి ఉన్న వారు వెల్లకిలా పడుకుని.. తమ మోకాళ్ళ క్రింద పిల్లో పెట్టుకుని నిద్రపోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ బ్యాక్ పొజిషన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి.

Postureg.com

సైడ్ స్లీపింగ్ పొజిషన్ (Side Sleeping Position)

మనలో ఎక్కువ శాతం మంది సైడ్ స్లీపింగ్ పొజిషన్‌లోనే నిద్రిస్తుంటారు. ఎందుకంటే పడుకోవడానికి ఇది చాలా వరకు సౌకర్యంగా ఉంటుంది. అదే సమయంలో ఇలా పడుకోవడం వల్ల చాలా ఎక్కువగానే ఉపయోగాలు ఉన్నాయి.

Postureg.com

ఫీటల్ స్లీపింగ్ పొజిషన్ (Fetal Sleeping Position)

ఫీటల్ స్లీపింగ్ పొజిషన్ లేదా బేబీ స్లీపింగ్ పొజిషన్ అని కూడా దీనికి పేరుంది. ఎందుకంటే ఈ ఫీటల్ పొజిషన్‌లో ఒక పక్కకి పడుకొని నిద్రపోతూ.. మన కాళ్ళని మోకాళ్ళ వరకు ముడుచుకుని పొట్టకి దగ్గరగా పెట్టుకుంటారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఇదే తరహాలో నిద్రిస్తారు. కాబట్టి ఈ పొజిషన్‌కి బేబీ పొజిషన్ అని కూడా పేరొచ్చింది.

Purple.com

స్టమక్ స్లీపింగ్ పొజిషన్ (Stomach Sleeping Position)

‌బె‌డ పైన బోర్లా పడుకొని,, మొత్తం మన శరీర బరువుని మన ఉదార భాగం పైనే కేంద్రీకరించే పొజిషన్‌‌ని స్టమక్ స్లీపింగ్ పొజిషన్ అని అంటారు. అయితే ఇలా స్టమక్ పొజిషన్‌లో పడుకోవడం వల్ల ఉన్న ఉపయోగాల కన్నా ఇబ్బందులే ఎక్కువ.

purple.com

లాగ్ స్లీపింగ్ పొజిషన్ (Log Sleeping Position)

దీనిని లాగ్ స్లీపింగ్ పొజిషన్ లేదా సోల్జర్ స్లీపింగ్ పొజిషన్ అని అంటారు. నిద్రపోయే సమయంలో.. ఎడమ లేదా కుడి వైపు మాత్రమే పడుకుంటూ.. మన బరువుని కేవలం మన భుజం పైనే వేస్తూ చేతులని కూడా సమాంతరంగా ఉంచడమే ఈ లాగ్ స్లీపింగ్ పొజిషన్. సైనికులు ఎక్కువమంది ఇలానే పడుకోవడానికి అలవాటు పడతారు. కాబట్టి దీనికి ఆ పేరు కూడా వచ్చింది.

alaskasleep.com

ఫ్రీఫాల్ స్లీపింగ్ పొజిషన్ (Freefall Sleeping Position)

మనం బెడ్ పైన బోర్లా పడుకుని.. అలాగే మన రెండు చేతులు పిల్లో పైకి వేసి చాలా ఫ్రీగా నిద్రపోతే దానిని ఫ్రీఫాల్ స్లీపింగ్ పొజిషన్ అంటారు. మన ఇళ్లలో కూడా కచ్చితంగా ఒకరు లేదా ఇద్దరిని ఈ ఫ్రీఫాల్ స్లీపింగ్ పొజిషన్‌లో చూసే ఉంటాము.

bedroom.solutions

స్టార్ ఫిష్ స్లీపింగ్ పొజిషన్ (Star Fish Sleeping Position)

ఈ స్టార్ ఫిష్ స్లీపింగ్ పొజిషన్ ప్రకారం, మనం బెడ్ పైన వెల్లకిలా పడుకుని మన చేతులని పిల్లోకి ఆనించి నిద్రపోవడం జరుగుతుంది. ఈ పొజిషన్‌లో చాలా తక్కువమంది నిద్రిస్తుంటారు. అన్ని రకాల స్లీపింగ్ పొజిషన్స్‌తో పోలిస్తే.. ఈ పొజిషన్‌లో నిద్రించే వారి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి.

 

bedroom.solutions

ఈ పైన పేర్కొన్న 7 రకాల స్లీపింగ్ పొజిషన్స్‌లో సాధారణంగా మనుషులు నిద్రిస్తుంటారు. అయితే పైన పేర్కొన్న పొజిషన్స్ వల్ల ప్రయోజనాలతో పాటుగా.. కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. అయితే మీకు ఉన్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని.. వాటికి తగ్గట్టుగా మీరు సరైన స్లీపింగ్ పొజిషన్‌ని ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ క్రమంలో మనం కూడా బ్యాడ్ స్లీపింగ్ పొజిషన్స్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను గురించి చదివేద్దాం.

బ్యాడ్ స్లీపింగ్ పొజిషన్స్ (Bad Sleeping Positions) వల్ల ఏర్పడే దుష్ప్రయోజనాలు

నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో అనేది స్పష్టమైంది కదా. అలాగే సరైన పొజిషన్‌లో పడుకోకపోతే వచ్చే ఇబ్బందులు.. చాలా వరకు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి.

గురక & స్లీప్ యాప్నియా (Snoring & Sleep Apnoea)

బ్యాక్ పొజిషన్‌లో పడుకుంటే మీకు గురక సమస్య వస్తుంది. అలాగే స్లీపింగ్ యప్నియా కూడా పెరుగుతుంది. ఈ రెండు తగ్గు ముఖం పట్టాలంటే.. బ్యాక్ పొజిషన్‌లో నిద్రించకపోవడమే బెటర్.

పొట్ట లేదా ఉదర భాగంలో వచ్చే ఇబ్బందులు (Stomach Problems)

స్టమక్ పొజిషన్‌లో పడుకునే వారిలో ఈ ఇబ్బందులు ఎక్కువగా చూడడం జరిగింది. ఉదర భాగంలో సమస్యలు ఉన్న వారు.. స్టమక్ పొజిషన్‌లో నిద్రపోకుండా జాగ్రత్త పడితే ఈ ఇబ్బందులు దూరమవుతాయి.

మెడ నొప్పి (Neck Pain)

మీరు స్టమక్ పొజిషన్‌లో పడుకోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులలో ప్రధానమైనది మెడ నొప్పి. మీరు పూర్తిగా మీ ఉదర భాగం పైనే బరువుని ఉంచి పడుకోవడం.. అదే సమయంలో మెడని కూడా ఎటు కదల్చకుండా ఉండే సరికి తీవ్రమైన మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది.

నడుము నొప్పి (Back Pain)

సహజంగా ఎక్కువ మందిలో ఈ ఇబ్బందిని గమనిస్తుంటాము. పడుకునే సమయంలో సైడ్ పొజిషన్‌లో & ఫీటల్ పొజిషన్‌లో నిద్రకి ఉపక్రమించడం వల్ల ఈ నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముఖం పైన ముడతలు (Wrinkles on Face)

సైడ్ పొజిషన్‌లో మనం నిద్రించినప్పుడు మన ముఖంలో ఒక వైపు బెడ్‌కి అత్తుకుని ఉంటుంది. దానితో ఆ భాగంలో రక్తప్రసరణ కావాల్సినంత మోతాదులో జరగదు. దాని వల్ల ప్రధానంగా ముఖం పైన ముడతలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అలా మనం సైడ్ పొజిషన్‌లో గనుక నిద్రించడం మానేస్తే… ఈ ముఖం పైన ఏర్పడే ముడతల నుండి బయటపడవచ్చు.

ప్రియమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈ మెసేజెస్ మీకోసమే…

ఈ పైన పేర్కొన్న అయిదు ఇబ్బందులు మీ బ్యాడ్ స్లీపింగ్ పొజిషన్స్ వల్ల ఎదురుకావచ్చు. వాటికి తగిన చర్యలు తీసుకుంటే, ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఏ స్లీపింగ్ పొజిషన్‌లో పడుకుంటే బ్యాక్ పెయిన్ (Back Pain) తగ్గుతుంది?

మనం రోజు నిరంతరం ప్రయాణం చేయడం లేదా కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేయడం వల్ల ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ (నడుము నొప్పి) వస్తుంటుంది. అలా వచ్చిన ఈ నడుము నొప్పిని తగ్గించుకోవాలంటే, నిద్రించే సమయంలో మనం బ్యాక్ పొజిషన్‌‌‌ను ఎంచుకోవాలి. 

ఇంతకీ బ్యాక్ స్లీపింగ్ పొజిషన్‌లో పడుకునే సమయంలో.. మన నడుము భాగంలో ఒక పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవడం ద్వారా కూడా.. నడుము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. లేదా ఎటువంటి బెడ్ లేకుండా నేల పైన బ్యాక్ పొజిషన్‌లో పడుకోవడం ద్వారా కూడా.. నడుము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఏ స్లీపింగ్ పొజిషన్‌లో పడుకుంటే మెడ నొప్పి (Neck Pain) తగ్గుతుంది?

ఎక్కువగా సరైన పిల్లో వాడకపోవడం వల్ల లేదా స్టమక్ పొజిషన్ & ఫీటల్ పొజిషన్‌లో నిద్రించడం వల్ల మనకి మెడ నొప్పి వస్తుంది. దీనిని నుండి ఉపశమనం పొందడానికి మనం ఎక్కువగా బ్యాక్ పొజిషన్ లేదా సైడ్ పొజిషన్ పైన ఆధారపడాలి. ఒకవేళ బ్యాక్ పొజిషన్‌లో ఎటువంటి పిల్లో లేకుండా పడుకుంటే.. శరీరం మొత్తం స్ట్రెయిట్‌గా ఉండటం వల్ల మెడ నొప్పి తగ్గుతుంది. అదే సమయంలో సైడ్ పొజిషన్‌లో పడుకుంటూ.. మన మెడ క్రింద గుండ్రటి పిల్లో పెట్టుకోవడం ద్వారా కూడా ఈ మెడ నొప్పి నుండి రిలీఫ్ పొందవచ్చు.

సరైన నిద్ర కోసం మంచి పిల్లోని (Pillow) ఎంచుకోవడానికి కావాల్సిన ప్రాతిపదికలు

మనం హాయిగా నిద్రపోవాలంటే మంచి బెడ్ ఉంటేనే సరిపోదు…. అలాగే దాని పైన మనకి ఎంతగానో సపోర్ట్‌గా ఉండే పిల్లో కూడా అవసరం. ఈ క్రమంలో మంచి పిల్లోని ఎంచుకోవడానికి కావాల్సిన ప్రాతిపదికలు ఏంటి అనేది ఈ క్రింద వివరించడం జరిగింది

* శుభ్రం చేయడానికి వీలుగా ఉండే మెటీరియల్.

* మన శరీరానికి సరిపోయే ఆకారాల్లో పిల్లో ఉండేలా చూసుకోవడం.

* పిల్లో సున్నితంగా లేదా మృదువుగా ఉండాలి.

* నడుము లేదా మెడ నొప్పి ఉండే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన పిల్లోస్‌ని ఎంపిక చేసుకోవడం.

* పిల్లో‌ని తయారుచేసిన మెటీరియల్ పైన కూడా దృష్టిపెట్టాలి.

 

సరైన నిద్ర కోసం మంచి బెడ్‌ని (Bed) ఎంచుకోవడానికి కావాల్సిన ప్రాతిపదికలు

మనం దేని పైన నిద్రిస్తున్నామనే విషయం పైనే.. మన నిద్ర ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఉపయోగించే బెడ్ వల్లనే మన శరీరంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఉదాహరణకి మీరు నిద్రించే బెడ్ మొత్తం ఒక ఆకారంలో లేకుండా.. ఎత్తు పల్లాలు ఉంటే మీ శరీరంలో చాలా భాగాల్లో ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో బెడ్ మధ్య భాగంలో గ్యాప్ ఉంటే.. దాని వల్ల కూడా మీకు నడుము నొప్పి వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అందుకే మంచి నిద్ర కావాలంటే ఒక మంచి బెడ్ కూడా తప్పనిసరి అని చెబుతుంటారు. అందుకే ఒక బెడ్‌ని కొనే ముందు.. మనం ఏ అంశాలు పరిగణంలోకి తీసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం

* బెడ్ మొత్తం ఒకే ఆకారంలో.. ఎటువంటి ఎత్తు పల్లాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి.

* అలాగే బెడ్ తయారీలో ఎటువంటి మెటీరియల్‌ని ఉపయోగించారు అన్నది కూడా మనం పరిగణంలోకి తీసుకోవాలి.

* అలాగే బెడ్ కొలతలు కూడా మన ఎత్తుతో సరి చూసుకుని ఖరీదు చేయాలి.

* మనకి  నడుము నొప్పి లేదా ఇతరత్రా సమస్యలుంటే… మన అవసరాలను తీర్చేవిధంగా ప్రత్యేకంగా తయారుచేసిన బెడ్స్‌ని కొనుగోలు చేయాలి.

* చివరగా… మన బెడ్ మన అవసరాలకి తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూడాలి తప్ప.. ఇతరులు కొనుగోలు చేస్తున్నారు అనే ఉద్దేశ్యంతో.. ఏది పడితే అది కొనుగోలు చేయకూడదు.

ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!

మంచి నిద్ర కోసం ఎటువంటి పొజిషన్స్‌లో పడుకోవాలి..? అలాగే ఏ పొజిషన్‌లో పడుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? వాటిని ఎలా నివారించాలి? అనే విషయాలను తెలుసుకున్నారుగా..!  చివరిగా చెప్పేదేమిటంటే.. మంచి నిద్రకి కావాల్సిన బెడ్, పిల్లోని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకోవాలన్న విషయం కూడా విపులంగానే తెలియజేశాం. 

ఈ ఆర్టికల్ ద్వారా.. మీ అనుమానాలన్నీ తీరాయనే భావిస్తున్నాం.. మీకు ఏదైనా ఇతర సమాచారం కావాలంటే  కామెంట్ సెక్షన్‌లో తెలియచేయగలరు.