సాధారణంగా ప్రజలందరికీ తెలిసిన వ్యక్తుల జీవిత కథల్లో మనకు తెలియని కోణాలను కలిపి బయోపిక్స్(Biopics)గా రూపొందించడం మనకు తెలిసిందే. ఇప్పటివరకూ ఎంతోమంది బయోపిక్‌లు అలా వెండితెరపై కనిపించాయి. మహానటి, హసీనా, తాజాగా మణికర్ణిక.. ఇలా తెరపై సక్సెస్ఫుల్ విమెన్ బయోపిక్స్ (Women achievers movies) ఎన్నో కనిపించాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు 2019లో కొందరు సాహసనారుల జీవిత గాథలను మనకు వెండితెరపై చూపనున్నారు దర్శకనిర్మాతలు. అందులో ముఖ్యమైన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం రండి..
1. అరుణిమా సిన్హా కథతో..
అరుణిమా సిన్హా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దివ్యాంగురాలిగా పేరు ప్రఖ్యాతలు సాధించిందీ ధీర వనిత. వాలీబాల్ ప్లేయర్ అయిన అరుణిమ రైల్లో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోని ఆమె ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సాధించింది.
అలాంటి సాహస వనిత జీవిత కథ అయిన “బర్న్ ఎగైన్ ఆన్ ది మౌంటెయిన్ – ఎ స్టోరీ ఆఫ్ లూసింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండిగ్ ఇట్ బ్యాక్” అనే పుస్తకం ఆధారంగా సినిమా రూపొందనుంది. దీన్ని కరణ్‌జోహర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ బబ్లీ గర్ల్ అలియా భట్ ఓకే చెప్పేసిందట. ఇప్పటికే హైవే, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలతో పేరు సాధించిన అలియా ఈ సినిమాలో అరుణిమను మరిపిస్తుందా? చూడాల్సిందే..
2. యాసిడ్ దాడి బాధితురాలిగా..
లక్ష్మి అగర్వాల్. దిల్లీలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగింది. పదిహేనేళ్ల ప్రాయంలో యాసిడ్ దాడికి గురైంది. అయితే ఆ యాసిడ్ దాడి ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేకపోయింది సరికదా.. మరింత పెంచింది. యాసిడ్ అమ్మకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నో పోరాటాలు చేసి చివరకు అనుకున్నది సాధించింది. టీవీ హోస్ట్‌గా, ర్యాంప్‌పై మోడల్‌గా ఇలా.. ఎన్నోచోట్ల కనిపిస్తూ అందం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని చాటింది.
ఇప్పుడు తన కథ వెండితెరపై చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాలో యాసిడ్ బాధితురాలిగా కనిపించనుంది దీపిక. మేఘనా గుల్జార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా కోసం నిర్మాతగా మారనుంది దీపిక. ఇదొక్కటే కాదు. ముంబయి మాఫియా క్వీన్ సప్నా దీదీ కథతో ఇర్ఫాన్ ఖాన్ సరసన మరో చిత్రంలో నటించనుంది దీపిక.
3. ఫైటర్ పైలట్‌గా..
దేశ రక్షణ దళాల్లో ఐఏఎఫ్ది ఓ ప్రత్యేక స్థానం. తాజాగా మన వాయుసేన పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టి తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సాహసోపేతమైన విభాగంలో అడుగుపెట్టిన మొదటి మహిళ గుంజన్ సక్సేనా. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టింది గుంజన్.
దీంతో ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా పేరుగాంచింది. ఎక్కువ మందికి పరిచయం లేని గుంజన్ కథను సినిమాగా రూపొందించి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో గుంజన్ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకి కూడా కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుంజన్ పాత్ర కోసం అటు ఫ్లైయింగ్ పాఠాలతో పాటు ఇటు ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ షూటింగ్లో పాల్గొంటోందట జాన్వి.
4. షకీలా కథతో
షకీలా.. మనందరికీ తెలిసి ఆమె ఓ శృంగార తార మాత్రమే. అలాగే మనకు తెలిసిన మొదటి అడల్ట్ ఫిల్మ్‌స్టార్ ఆమె..! కానీ ఆమె జీవితంలో కేవలం సినిమా మాత్రమే కాదు.. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆమె కథను సినిమాగా రూపొందిస్తున్నారు దర్శకుడు ఇంద్రజీత్ లంకేష్. ఇందులో షకీలా పాత్రలో రిచా చద్దా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ వేసవిలోనే చిత్రం విడుదల కానుంది. చిన్న స్థాయి నుంచి వచ్చి.. ఆ తర్వాత ఎంతో పాపులారిటీ సాధించుకున్నా.. దాన్ని నిలుపుకోలేక తిరిగి పేదరికాన్ని చవిచూసింది షకీలా. తన కథను వెండితెరపై చూస్తే ఆమె జీవితంలోని లోటుపాట్లు మనకు కనిపిస్తాయి అంటారు దర్శకుడు ఇంద్రజీత్.
5. జయలలిత – ది ఐరన్ లేడీ
జయలలిత- తమిళనాట అందరూ అమ్మ అని పిలుచుకునే తిరుగులేని రాజకీయవేత్త. సినిమా కథానాయికగా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళనాట అందరినీ ఆదరించే తల్లిగా.. తనకంటూ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆమె కథతో రూపొందిస్తోన్న చిత్రమే “ద ఐరన్ లేడీ” సినిమా. ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకురాలుగా వ్యవహరించడం విశేషం. ఇప్పటివరకూ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామేనన్ కనిపించనుంది.
6. షూటర్ దాదీలుగా..
చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్.. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన షార్ఫ్ షూటింగ్ అమ్మమ్మలు. సాధారణంగా నలభై, యాభై సంవత్సరాలకే కంటిచూపు మందగించే ఈ రోజుల్లో చంద్రో (87), ప్రకాశీ (82)లు ఇంకా షూటింగ్‌ని కొనసాగిస్తున్నారంటే ఆశ్చర్యమే. కేవలం షూటింగ్ చేయడమే కాదు.. మెడల్స్ కూడా సాధించారీ బామ్మలు. తన మనవరాలు షూటింగ్ నేర్చుకుంటానంటే.. తనతో పాటు వెళ్లిన చంద్రో తోమర్ ఆ క్రీడ నచ్చి దాన్ని కొనసాగించింది. అదే ముసలి వయసులోనూ వారికి పేరు సాధించి పెట్టింది. వీరిద్దరి కథతో “సాండ్ కీ ఆంఖ్” అనే సినిమా రూపొందుతోంది. దీనికి తుషార్ హీరా నందానీ దర్శకత్వం వహిస్తుండగా.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మర్లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో చంద్రో పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించనుండగా.. ప్రకాశీగా తాప్సీ నటిస్తోంది.
ఇవే కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కూడా ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రియాంక చోప్రా కల్పనా చావ్లాగా నటిస్తోన్న సినిమా.. విద్యాబాలన్ ఇందిరాగాంధీగా కనిపించబోయే చిత్రం సెట్స్‌పైకి వెళ్తాయని అప్పట్లో వార్తలొచ్చాయి. వీటితో పాటు పీవీ సింధు, మిథాలీ రాజ్, పీటీ ఉష కథలతో కూడా బయోపిక్స్ రూపొందనున్నాయట. మరి, అవి ఎప్పుడు విడుదలవుతాయో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి.
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..