ఏక్తా కపూర్ (Ekta kapoor).. సీరియల్ క్వీన్‌గా హిందీలోనే కాదు.. తెలుగులోనూ పేరు సంపాదించిన నిర్మాత ఆమె. నలభైల వయసులో ఉన్న ఆమె దేశంలోనే పాపులర్ నిర్మాతగా పేరుపొందింది. తాజాగా ఈ డైలీ సీరియల్ క్వీన్ సరోగసీ (Surrogacy) ద్వారా తల్లిగానూ మారింది. తన కొడుకుకి రావీ కపూర్ అని పేరు కూడా పెట్టింది. ఈ రోజు ఏక్తా పుట్టిన రోజు. స్టార్ కిడ్స్‌లో ఎంతో స్పెషల్ అయిన ఏక్తా 44వ పడిలోకి అడుగుపెట్టింది.
సెలబ్రిటీల పిల్లలందరూ నటనలో తమ కెరీర్ మలచుకుంటుంటే .. ఏక్తా మాత్రం దర్శకురాలిగా, నిర్మాతగా మారింది. 19 సంవత్సరాల వయసులో తన కెరీర్‌ని ప్రారంభించిన ఏక్తా.. పాతికేళ్లుగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనదైన ప్రత్యేకతను చూపుతూ వస్తోంది. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ సోదరి, నటుడు జితేంద్ర కూతురైన ఏక్తా దేశమంతా డైలీ సోప్ క్వీన్‌గా పేరు సంపాదించుకుంది.
వందలకొద్దీ సీరియళ్లు చేస్తూ తన కెరీర్‌ని దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ఏక్తా కపూర్ (Ekta Kapoor) .. వెబ్ సిరీస్ కూడా నిర్మించింది. కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే (Single) ఉంది. ఏక్తాకి సరైన వరుడు దొరకక కాదు. కానీ తను పెళ్లి చేసుకోవాలని అసలు భావించనే లేదట.
పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఆమెకు లేదని.. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింది ఏక్తా. కానీ దానికి ముఖ్య కారణం ఏంటో ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఆ కారణాన్ని కూడా వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పెళ్లి విషయంలో తనకు సల్మాన్ ఖాన్ ఆదర్శమని.. ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నానని చెప్పింది.
అయితే ఒకప్పుడు (అంటే తనకు 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు) పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని భావించానని చెప్పింది ఏక్తా. కానీ ఆమెకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే.. తండ్రి జితేంద్ర ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చారట. అందులో ఒకటి పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలవ్వడం. ఇంకొకటి కెరీర్‌లోకి అడుగుపెట్టి నచ్చిన పని చేయడం. ఈ రెండింటిలో రెండోదాన్నే ఏక్తా ఎంచుకుందట. ఆ మాటకు కట్టుబడే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అంతేకాదు.. బాలాజీ టెలీ ఫిల్మ్స్‌లో పనిచేయడం కంటే ముందు.. ఓ యాడ్ ఏజెన్సీలో కూడా పనిచేసిందట ఏక్తా.
దీని గురించి చెబుతూ “మా నాన్న మాకు చాలా తక్కువ పాకెట్ మనీ ఇచ్చేవారు. పాకెట్ మనీ ఖర్చయిపోతే వేరే డబ్బు కూడా ఇచ్చేవారు కాదు. అన్ని ఖర్చులకూ దాన్నే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అందుకే నేను డబ్బు సంపాదించడం కోసం ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించాను. ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసి అక్కడి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకున్నాను. అందుకే పెళ్లికి బదులు పనిని ఎంచుకున్నందుకు నేనెప్పుడూ బాధపడలేదు” అని చెబుతోంది ఏక్తా.
అంతేకాదు.. పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ పెళ్లి చేసుకున్న నా స్నేహితులు కూడా.. ఇప్పుడు విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో నేను విడాకులు తీసుకున్న జంటలను చాలామందినే చూశాను. వీరిని చూసిన తర్వాత.. నేను చాలా మంచి పని చేశానని నాకు అనిపిస్తోంది..” అంటూ పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పింది ఏక్తా.
నలభై నాలుగేళ్ల ఈ సీరియల్ క్వీన్ పెళ్లికి నో చెప్పినా పిల్లలకు మాత్రం నో అని చెప్పలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ ఏడాది జనవరి 27న పుట్టిన ఆ బాబుకి రావీ కపూర్ అని పేరు కూడా పెట్టింది. తల్లిగా మారిన తర్వాత తన అనుభవాల గురించి వెల్లడిస్తూ –
“అమ్మయిన తర్వాత నేను చాలా విషయాల్లో ఇంతకుముందులా ఉండలేకపోతున్నా. వర్కింగ్ మదర్ గిల్ట్ వేధిస్తోంది. నేను ఆఫీసులో పనిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నా అని బాధగా ఉంటోంది. అదే ఇంట్లో ఉంటే ఆ సమయంలో నేను ఆఫీస్‌లో ఉండి చేయాల్సిన పనులన్నీ ఆగిపోతున్నాయని బాధనిపిస్తోంది. ఈ ఫీలింగ్ పోయేందుకే నేను రావిని ఆఫీస్‌కి తీసుకొస్తున్నా. తను నా ఆఫీస్‌లో అందరితో సమయం గడుపుతున్నాడు. చెబితే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మూడు నెలలకే నా టీంలో అందరినీ రావీ గుర్తుపడుతున్నాడు..” అంటూ అమ్మగా తన అనుభవాలను, ఆనందాన్ని పంచుకుంది ఏక్తా. ఏక్తా కంటే ముందు ఆమె సోదరుడు తుషార్ కపూర్ కూడా.. ఇలాగే సరోగసీ ద్వారా లక్ష్య కపూర్ అనే బిడ్డకు జన్మనివ్వడం విశేషం.
ఇవి కూడా చదవండి.
తారక రాముడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా? (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)
మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?
తన పుట్టినరోజున నేనిచ్చిన సర్ ప్రైజ్ చూసి.. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఫీలయ్యాడంటే..!
Images : Instagram