ADVERTISEMENT
home / Family Trips
గండికోట – ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్ర‌దేశాన్ని అంద‌రూ చూసి తీరాల్సిందే..!

గండికోట – ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్ర‌దేశాన్ని అంద‌రూ చూసి తీరాల్సిందే..!

ఆంధ్ర‌ప్రదేశ్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతాలు అన‌గానే చాలామందికి అర‌కు, పాపికొండలు, లేపాక్షి.. వంటి ప్ర‌దేశాలే గుర్తొస్తాయి. కానీ గండికోట (Gandikota) పేరు ఎప్పుడైనా విన్నారా?? మీరు మ‌న‌సులో అనుకుంటున్న‌ది నిజ‌మే.. ఈ పేరు మీద ఒక సినిమా కూడా ఉంది. అదే గండికోట ర‌హ‌స్యం. ఎన్టీఆర్, జ‌య‌ల‌లిత ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు విఠాలాచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా 1969లో విడుద‌లై ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు కూడా పొందింది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?? అని ఆలోచిస్తున్నారా??

కాస్త ఆగండి.. మేం మాట్లాడాల‌ని అనుకుంటున్న‌ది గండికోట గురించే కానీ.. సినిమా గురించి కాదు. అవునండీ. . గండికోట పేరు మీద నిజంగానే ఒక అంద‌మైన ప‌ర్యాటక ప్ర‌దేశం కూడా ఉంది. దీనినే ది ఇండియ‌న్ గ్రాండ్ కాన్య‌న్ (The Indian Grand Canyon) అని కూడా అంటారు. అస‌లు ఇంత‌కీ ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది? ఈ ప్ర‌దేశం ఎక్క‌డ ఉంది? అక్క‌డకు ఎలా వెళ్లాలి? ఆ ప్రాంతం ప్ర‌త్యేక‌త‌లేంటి?? అక్క‌డికి చేరుకునేందుకు గ‌ల ర‌వాణా మార్గాలు, వ‌స‌తి సౌక‌ర్యాలు.. మొద‌లైన వివ‌రాల‌న్నింటి గురించి మాట్లాడుకుందాం..

gandikota-wikipedia

Image: Wikipedia

ADVERTISEMENT

ఏ ప్ర‌దేశం గురించి చెప్పేట‌ప్పుడైనా ముందుగా అది ఎక్క‌డుందో చెప్పాలి. సో.. మేము కూడా అక్క‌డి నుంచే మొద‌లుపెడుతున్నాం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు (Jammalamadugu) నియోజకవర్గానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని పెన్నా నదికి కుడి పక్కన ఉన్న గ్రామమే ఈ గండికోట.

ఈ ప్ర‌దేశానికి ఆ పేరు రావ‌డానికి గ‌ల కార‌ణం ఏంటంటే- ఎర్ర‌మ‌ల్ల కొండ‌లు మ‌ధ్య‌లో పెన్నా న‌ది వ‌ల్ల ఏర్ప‌డిన గండితో ఒక పెద్ద కొండ ప్రాంతం ఏర్ప‌డింది. ఇది శ‌త్రుదుర్భేధ్యంగా ఉండ‌డంతో అప్ప‌టి పాల‌కులు ఈ కొండ‌పై రాళ్ల‌తో ఒక పెద్ద కోట‌ను నిర్మించారు. అలా కొండ‌ల మ‌ధ్య ఏర్ప‌డిన గండిపై కోట క‌ట్ట‌డంతో ఈ ప్రాంతానికి గండికోట అని పేరు వచ్చింద‌ని చెబుతారు.

అయితే ఈ ప్రాంతాన్ని ప‌లువురు ప‌రిపాల‌కులు పాలించ‌డంతో హిందూ ఆల‌యాలతో పాటు జామా మ‌సీద్ కూడా మ‌న‌కు ఇక్కడ క‌నిపిస్తుంది. ఈ ప్ర‌దేశాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (Rajamouli) తెర‌కెక్కించిన మ‌ర్యాద రామ‌న్న (Maryada Ramanna) సినిమాలో కూడా చూడ‌చ్చు. ఈ సినిమా చిత్రీక‌రించేట‌ప్ప‌టికే గండికోట ప్రాంతానికి కాస్త గుర్తింపు ఉండేది. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగ‌మ‌య్యాక ఈ ప్ర‌దేశానికి మ‌రింత గుర్తింపు ల‌భించింది.

gandikota-tripadvisor-1

ADVERTISEMENT

మ‌రి, దీనిని చూసేందుకు ఏ ప్రాంతం నుంచి ఎలా వెళ్లాలో తెలుసా?? ఈ ప్రాంతానికి బాగా ద‌గ్గ‌ర‌గా ఉన్న రైల్వే స్టేష‌న్స్ ముద్ద‌నూరు & జ‌మ్మ‌ల‌మ‌డుగు. గండికోట నుంచి ముద్ద‌నూరు రైల్వేస్టేష‌న్‌కు సుమారు 26 కిలోమీట‌ర్ల దూరంగా కాగా; జ‌మ్మ‌ల‌మ‌డుగుకు మాత్రం కేవ‌లం 17 కిలోమీట‌ర్లే! అలాగే గుత్తి రైల్వే జంక్ష‌న్ నుంచి కూడా ఇక్క‌డికి రైలు స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఈ ప్ర‌దేశానికి చేరుకునేందుకు ఆర్టీసీ బ‌స్సులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అలాగే బెంగ‌ళూరు (Bengaluru) నుంచి రోడ్డు మార్గంలో వ‌చ్చే.. వారికి వీలుగా బ‌స్సులు ఎప్ప‌టిక‌ప్పుడు తిరుగుతూ ఉంటాయి. హైద‌రాబాద్ నుంచి నేష‌న‌ల్ హైవే 7 మీదుగా ఇక్క‌డ‌కు చేరుకోవ‌చ్చు.

వాస్త‌వానికి కోట ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాక అక్క‌డ బ‌స చేసేందుకు ఎలాంటి వ‌స‌తులు ఉండ‌వు. ఆ ప్రాంతంలో మీరు బ‌స చేయాల‌ని అనుకుంటే కోట‌కు కిలోమీట‌రు దూరంలో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారి హ‌రిత హోట‌ల్ (Haritha Hotel) లో ఉండాల్సిందే! ఇక్క‌డ మీరు ఉండేందుకు అన్ని వ‌స‌తులు ఉంటాయి. అలాగే జ‌మ్మ‌ల‌మ‌డుగులో కూడా కొన్ని హోట‌ల్స్ ఉంటాయి. అయితే మీ బ‌స గురించి ముందుగానే మీ ట్రావెల్స్ వారితో మాట్లాడుకుంటే వారు మీకు ఉండేందుకు వ‌స‌తులు ఏర్పాటు చేస్తారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు పెన్నా న‌ది ఒడ్డున టెంట్స్ (Tents) కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వివ‌రాల కోసం మీరు అంత‌ర్జాలంలో గండికోట టూరిజం అని టైప్ చేస్తే చాలు.. ప‌లు ర‌కాల ప్యాకేజీలు అన్ని వివ‌రాల‌తో స‌హా మీ క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. సాధార‌ణంగా ఈ ప్ర‌దేశంలో విహ‌రించ‌డానికి చిన్న జీపులు స‌రిపోతాయి. కాబ‌ట్టి వాటిలో ప్ర‌యాణిస్తేనే ఇక్క‌డ సౌక‌ర్య‌వంతంగా ఉండ‌వ‌చ్చు. అలాగే పెన్నా న‌దిలో బోటింగ్ (Kayaking) చేసే సౌకర్యం కూడా ఉంటుంది.

ఇక ఇక్క‌డ చూడ‌ద‌గిన ప్ర‌దేశాల విష‌యానికి వ‌స్తే.. ఈ కోట‌పై నుంచి సూర్యోద‌యం & సూర్యాస్త‌మ‌యం చూడ‌డం ఒక మంచి అనుభ‌వం అని వీక్షించిన వారంతా చెబుతారు. అలాగే ఈ కోట‌లో ఆ రోజుల్లోనే భూమి అడుగున గొట్టం ద్వారా నీటి స‌దుపాయాన్ని ఏర్పాటుచేశార‌ట‌! దీంతో పాటు కోట లోప‌ల ఉన్న మాధవరాయ దేవాల‌యం (Madhavaraya Temple), రంగనాథ (Ranganatha Temple) ఆలయాలతో పాటుగా మీర్ జుమ్లా నిర్మించిన‌ జామా మసీదును (Jama Masjid) కూడా మ‌నం చూడవచ్చు.

ADVERTISEMENT

అలాగే అప్ప‌టి పాల‌కులు నిర్మించిన ఎత్తైన గోడ ప్రాకారం, పావురాల గోపురం, జైలు, రంగ‌మ‌హ‌ల్, మందుగుండు సామాగ్రి గిడ్డంగి, ధాన్యాగారం.. మొద‌లైన వాటి ఆన‌వాళ్ల‌ను కూడా మ‌నం ఇక్క‌డ గ‌మ‌నించ‌వ‌చ్చు. అప్ప‌ట్లో నీటి సౌక‌ర్యం నిమిత్తం పాల‌కులు ఏర్పాటు చేసుకున్న రాజుల చెరువు, క‌త్తుల కోనేరు.. వంటివి కూడా ఇక్క‌డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పుకోవ‌చ్చు. చుట్టూ ఉన్న రాళ్ల మ‌ధ్య‌లో కోనేరు చాలా అందంగా క‌నిపిస్తూ చూప‌రుల దృష్టిని మ‌రింత ఆక‌ట్టుకుంటుంది.

ఈ ప్ర‌దేశాన్నే ఇండియ‌న్ గ్రాండ్ కాన్య‌న్ అని కూడా అంటారు. అమెరికా (America) లోని అరిజోనా రాష్ట్రంలో కొలరాడో న‌ది (Colarado River) ప‌క్క‌న ఇలాగే ఏర్ప‌డిన ప్రాంతాన్ని గ్రాండ్ కాన్య‌న్ (Grand Canyon) గా పిలుస్తుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఈ ప్రాంతం కూడా అచ్చం అలానే ఉండ‌డంతో గండికోట‌ను ఇండియ‌న్ గ్రాండ్ కాన్య‌న్‌గా పిలుస్తారు.

చూశారుగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పేరు, ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న గండికోట ప్రాంతం గురించి. ఇంకెందుకాల‌స్యం.. మీరు కూడా ఓసారి వారాంతంలో స‌ర‌దాగా ఈ ప్ర‌దేశానికి రెండు రోజుల పాటు ఒక ట్రిప్ వేసి వ‌చ్చేయండి. కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితుల‌తో క‌లిసి వెళ్లేందుకు ఇది చాలా అనువైన ప్రాంతం.

Featured Image: Tripadivsor.in

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

“SH(OUT)”తో లైంగిక వేధింపుల‌కు.. ఇక చెక్ పెడ‌దాం..!

మెట్రో రైల్.. హైద‌రాబాద్‌కు ఒక వ‌రం.. ఇది నా అనుభ‌వం..!

ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్

ADVERTISEMENT
05 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT