యూట్యూబ్ వేదికగా ఏదైనా వీడియో వైరల్ అయిందంటే చాలు.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి ఫ్రీగా ప్రొమోషన్ దొరికినట్టే! అయితే ఆ ఫాలోయింగ్ మనకి 105 ఏళ్ళ వయసులో లభిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించండి.
ఇలాంటి ఒక వింత అనుభవమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పరిసర ప్రాంతంలో నివసించే మస్తానమ్మ అనే ఆవిడకు దక్కింది. తన 105వ ఏట అనుకోకుండా చేసిన ఒక వంటతో ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ వచ్చి పడింది. తన దూరపు బంధువుకి అతడి స్నేహితుడికి రెండేళ్ళ క్రితం ఒకసారి వంట చేసిపెట్టగా ఆ సదరు వ్యక్తి మస్తానమ్మ వంట చేస్తున్న వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఆ ఇద్దరు స్నేహితులు ఆ బామ్మతో కలిసి వంట వీడియోలు (Cookery Videos) చేయడం మొదలుపెట్టారు.
అయితే ఆమె చేసే వంటలకన్నా.. ఆమె వంట చేసే విధానం చాలా మందిని ఆకర్షించింది అని చెప్పాలి. ఎందుకంటే మస్తానమ్మ తన వంటలను చాలా సహజ సిద్ధమైన విధంగా.. అదే సమయంలో చాలా చౌకగా దొరికే పదార్ధాలతో చేయడంతో ఆ వీడియోలకి మరింత ఆదరణ వస్తోంది. అలాగే అవే వీడియోలు లెక్కలేనన్ని లైకులు, షేర్లు సంపాదించుకుంటున్నాయి.
మస్తానమ్మ వీడియోలకి ఫాలోయర్స్ మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలలో కూడా ఉన్నారు . మస్తానమ్మ 106వ జన్మదినాన్ని ఆమెకున్న ఫాలోయర్స్ చాలా ఘనంగా జరిపించారు. 100 ఏళ్ళ పైబడిన అతికొద్దిమంది యూట్యూబ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మస్తానమ్మ పేరు ఇప్పటికే రికార్డులలో చేరిపోయింది.
అయితే గత కొంతకాలంగా మస్తానమ్మ నుండి ఎటువంటి వీడియోలు రాకపోవడంతో ఆమె ఫాలోయర్స్ ఆందోళన చెంది ఈ జాప్యానికి కారణమేంటి అని విచారించగా.. ఆమె ఈమధ్యనే తన 107వ ఏట తుదిశ్వాస విడిచినట్టుగా తెలిసింది. ఈ వార్త ఆమె అభిమానులని తీవ్ర కలతకి గురిచేసిందని చెప్పాలి .
ఈ విషయం తెలియగానే , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలపగా అందులో ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉండడం విశేషం … అయితే ఇంతటి ఫాలోయింగ్ ఉన్నట్టుగా బహుశా ఆమెకి కూడా తెలిసి ఉండకపోవచ్చు . ఇంతటి వయసులో కూడా ఆమె తన కుటుంబసభ్యులతో కాకుండా ఒంటరిగా జీవించడానికే మొగ్గుచూపింది. ఈ బామ్మ తనకి తెలియకుండానే ఏదైనా జీవితంలో సాధించడానికి వయసు, ప్రాంతం, చదువు అడ్డుకాదని నిరూపించగలిగింది .
ఇక ఆమె లేని వార్త తెలిసాక … తమకి ఎంతగానో నచ్చే సహజమైన పద్దతిలో వంటలు చేస్తూ బోసి నవ్వులు చిందించే ఆ బామ్మ లేదు అని తెలిసి ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు ఆమె అభిమానులు.
Photos Courtesy: Instagram/Country Foods