Lifestyle

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..?

Lakshmi SudhaLakshmi Sudha  |  Feb 8, 2019
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి  ఎదుర్కొంటుందంటే..?

రాత్రి వేళల్లో అమ్మాయిలు (girls) రోడ్డుపై నడిచి వెళుతున్నా.. బస్టాపులో ఉన్నా ఆమెకు తోడుగా నిలిచే మగవారి కన్నా.. ఆమెను లైంగికంగా వేధించాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. ఇది నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. నాకే కాదు.. ఏ అమ్మాయి పరిస్థితి అయినా ఇంతే. రాత్రి తొమ్మిది దాటిన తర్వాత బస్టాపులో బస్ కోసం వేచి ఉండే అమ్మాయిని తప్పుగా చూసేవారే ఎక్కువగా ఉంటారు. ఆమె ఒంటరిగా ఉండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించే పురుష పుంగవులే ఎక్కువగా ఉంటారు. అసలు అమ్మాయిలు ఒంటరిగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాంటి సందర్భాల్లో మీరెలా వ్యవహరించాలి? ఆకతాయిలను ఎలా నిలువరించాలి?

1. బస్టాపులో ఒంటరిగా వేచి చూస్తున్న అమ్మాయిని వెంట పడి వేధించేవారు కూడా ఉంటారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి కనిపించిన బస్సో.. ఆటో ఎక్కి అక్కడి నుంచి బయటపడినా.. వారు మాత్రం అమ్మాయిని వదిలిపెట్టరు. వెనకే ఫాలో అవుతుంటారు. ఆమె భయపడే కొద్దీ భయపెట్టేస్తుంటారు.

2. కాస్త చీకటి (night) పడిన తర్వాత రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళుతుంటే.. వెనక నుంచో.. ముందు నుంచో.. బండిపై వేగంగా వచ్చి.. అసభ్యంగా తాకి వెళ్లిపోతుంటారు. ఏం జరుగుతుందో గుర్తించే లోపే.. వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంటారు. ఇలాంటి సందర్భాలు మీకెదురైతే.. వాడి వెహికల్ నెంబర్ నోట్ చేసుకొని 100 కు సమాచారం ఇవ్వండి. ఆ తర్వాత పని వారే చూసుకొంటారు.

ఆడపిల్ల స్వేచ్ఛగా ఎదగాలంటే ఆమెకు ఎలాంటి వాతావరణం కల్పించాలి?

3. ఆఫీసులో పని ముగించుకొని కాస్త ఆలస్యంగా బైక్ పై ఇంటికి వెళుతున్న అమ్మాయిని టార్గెట్ చేసుకొని వేధించే మహానుభావులూ ఉంటారు. ఆమె వెనకనే అనుసరిస్తూ.. పెద్దగా హారన్ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తారు. ఇలా మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తే.. వరుసగా నాలుగు రైట్ టర్న్స్  తీసుకోండి. అప్పటికీ వారు మీ వెనకే వస్తున్నట్టు మీకనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. నాలుగు రైట్ టర్న్ లు తీసుకొంటే.. తెలియని చోటుకి వెళ్లిపోతామేమోనని భయపడకండి. మీరు ఎక్కడున్నారో… మళ్లీ అక్కడికే వచ్చేస్తారు.

1-girl-at-night

4. నీ రేటెంత? బహుశా రాత్రి ఒంటరిగా బస్టాపులో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొనే అతి ఇబ్బందికరమైన ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్న అడిగిన వారికి ఎదురుతిరిగి ధైర్యంగా సమాధానం చెప్తే తోక ముడుచుకొని పారిపోతారు. భయపడిపోయి బేలగా చూస్తే.. మరింతగా మాటలతో హింసించడం ప్రారంభింస్తారు.

నేటి మహిళ స్వేచ్ఛగా తన హక్కులను అనుభవించగలుగుతోందా?

5. ఒంటరిగా బస్టాపులో అమ్మాయి కనిపిస్తే.. కొందరు పోకిరీలకు చేతులు దురద పెట్టేస్తుంటాయి. వారిని  అసభ్యంగా తాకే ప్రయత్నం చేస్తారు. వారిని నిలువరించే ప్రయత్నం చేసే కొద్దీ వారు రెచ్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మొదట మీరు సురక్షితంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు తోడుగా నిలబడేవారెవరైనా ఉన్నారేమో చూడండి. అలాంటి వారెవరూ మీకు కనిపించకపోతే.. పోలీసులకు సమాచారం అందించండి. వారొచ్చి మీకు సాయం చేస్తారు. అంతేకానీ కనిపించిన ఆటో లేదా ట్యాక్సీ(మీరు బుక్ చేసుకొన్నదైతే తప్ప) వెళ్లి ఎక్కే ప్రయత్నం మాత్రం చేయకండి. అది మిమ్మల్ని మరింత ప్రమాదంలో పడేయచ్చు.

రాత్రి వేళల్లోనే కాదు.. పగటి సమయంలోనూ.. ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఎవరైనా వేధిస్తుంటే.. భయపడిపోవద్దు. ధైర్యం తెచ్చుకోండి. లేదా ధైర్యంగా ఉన్నట్టైనా నటించండి. మీరు ధైర్యాన్ని చూసి వారే వెనకడుగు వేస్తారు. చుట్టుపక్కల ఉన్నవారి సాయం తీసుకోండి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రానట్లైతే 100కు ఫోన్ చేయండి. సమాచారం అందిన కొన్ని నిమిషాల్లోనే షీ టీం సభ్యులు మీరున్న ప్రదేశానికి చేరుకొంటారు. మీకు తోడుగా నిలబడటంతో పాటు.. మిమ్మల్ని వేధించేవారికి గుణపాఠం చెబుతారు. కాబట్టి అనవసరంగా భయపడిపోకుండా.. ధైర్యం కూడదీసుకొని పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యక్తులు మీకూ మార్కెట్లో ఎదురయ్యారా?

Images: Shutterstock