ప్రేమ.. ఇదొక అందమైన, అద్భుతమైన భావన. ఇలాంటి అపురూపమైన ఫీలింగ్ కేవలం మనం ప్రేమించే వ్యక్తి కళ్లలోనే కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతో మంది జంటల మధ్య, రోజూ మనతో మాట్లాడే వారిలో కూడా కనిపిస్తుంది. కాకపోతే మనం కాస్త మనసు పెట్టి చూడాలి అంతే..! మన సంగతి కాసేపు పక్కన పెడితే.. రోజూ ఎంతోమంది కొత్త వ్యక్తులతో కలిసి ప్రయాణించే క్యాబ్ డ్రైవర్స్ విషయంలో ప్రేమకు అద్దం పట్టే ఇలాంటి అందమైన అనుభవాలు చాలానే ఉంటాయి. వాటిలో కొందరు ఉబర్ (Uber) డ్రైవర్స్‌కు ఎదురైన సంఘటనలు వారి మాటల్లోనే..
ప్రేమకు రూపం ముఖ్యం కాదు..
నా ఉబర్ రైడ్‌లో నేను ఒక జంటను కలిశాను. అందులో అమ్మాయిని గమనిస్తే దాదాపు 56% కాలిన గాయాలతో ఉంది. ఒక దుర్మార్గుడి చేతిలో యాసిడ్ దాడికి గురైన కారణంగా తన అందమైన రూపాన్ని కోల్పోయినప్పటికీ ఆ అబ్బాయి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి రూపానికి కాకుండా తన మనసుకు, వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చి అతను తీసుకున్న ఆ నిర్ణయం నాకు ఎంతగానో నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎదుటివారికి గౌరవం ఇచ్చే వ్యక్తులు కనిపించడం అరుదనే చెప్పాలి. అందుకే ఆ జంటను చూసి నేను చాలా సంతోషించా. వాళ్లిద్దరూ జీవితాంతం అవే ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని మనసులోనే కోరుకున్నా!!
ప్రేమకు హద్దులు ఉండవు..!
మనసుని హత్తుకునే ఓ అందమైన ప్రేమకథను నేను కళ్లారా చూశా! ఓ రోజు ఒక వృద్ధ జంట నా క్యాబ్ బుక్ చేసుకున్నారు. వాళ్లు పాత దిల్లీ వద్ద ఉన్న స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. అది కాస్త దూరప్రయాణమే. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే వారిద్దరూ నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. వారి మాటల్లో నాకు తెలిసిందేంటంటే.. భారత్ – పాకిస్థాన్ విడిపోక ముందు వాళ్లిద్దరూ లాహోర్‌లో నివసించేవారట! వాళ్లు తొలిసారి కలుసుకున్నది కూడా లాహోర్ రైల్వేస్టేషన్లోనే! ఆ సమయంలో కర్ఫ్యూలు కాస్త ఎక్కువగా ఉండేవి.
దాంతో ఒకసారి అల్లర్లు జరుగుతున్న సమయంలో అతను ఆమెను రక్షించి సురక్షితంగా తన ఇంటి వద్ద దింపాడట! ఆ తర్వాత అప్పుడప్పుడూ ఇద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. భారత్ – పాకిస్థాన్ విడిపోయే సమయానికి యుక్త వయసులో ఉన్న ఈ జంట రెండు దేశాలు విడిపోయిన తర్వాత భారతదేశానికి వచ్చేశారు. కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి వయసు దాదాపు 80- 85 మధ్య ఉంటుంది.
వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక సంతానాన్ని కూడా పొందారు. అయితే వారి కుటుంబాల్లో మిగిలిన ఏకైక వ్యక్తులు వీరు మాత్రమే! సాధారణంగా ఇలాంటి కథలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి అద్భుతమైన ప్రేమ జంటను కలుసుకునే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మొత్తానికి ఈ ప్రయాణం నా జీవితంలో మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
జీవితాన్ని మార్చిన సలహా..!
ఒకసారి నా క్యాబ్‌లో ఒక జంట ఎక్కారు. ప్రయాణం ప్రారంభమైంది మొదలు ఇద్దరూ పరస్పరం వాదించుకుంటూ, తగువులాడుకుంటూనే ఉన్నారు. వాళ్లిద్దరూ కొన్ని నెలల క్రితమే విడాకుల కోసం కూడా అప్లై చేశారట! గమ్యం చేరే వరకు అలుపన్నది లేకుండా దంపతులిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. వారిని గమ్యస్థానంలో దించిన తర్వాత నిజ జీవితంలో వైవాహిక బంధాన్ని బలపరుచుకోవాలంటే ఎవరు ఏం చేయాలనే విషయంపై నేను ఇద్దరికీ చిన్న చిన్న సలహాలు ఇచ్చా. ఇది జరిగిన 15 రోజుల తర్వాత మీకు చాలా ధన్యవాదాలు అని వారిద్దరూ కలిసి నాకు మెసేజ్ పంపించారు.
కళ్ల ముందు ఉంటేనే ప్రేమ కాదు..!
ఒకసారి ఒక అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు నా క్యాబ్ బుక్ చేసింది. వెళ్లే దారిలో ఇద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఆ క్రమంలోనే ఆమె తను ప్రేమించిన అబ్బాయిని రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్తున్నట్లు నాతో చెప్పింది. అతను 5 సంవత్సరాలుగా బెంగళూరులోనే ఉంటూ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఈ ఐదేళ్ల వ్యవధిలో ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప కలుసుకున్నది లేదు.. చూసుకున్నది లేదు.. అయినప్పటికీ ఇద్దరూ తమ ప్రేమలో ఎంతో నిజాయతీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఆ రోజు నేను నేర్చుకున్న పాఠం ఒకటే.. అది – ప్రేమించుకోవడం అంటే కళ్లతో చూసుకోవడం లేదా ఒకరి చుట్టూ మరొకరు తిరగడం కాదు.. వేరొక వ్యక్తిని మన జీవితంగా భావిస్తూ జీవించే ఓ మధురమైన భావన.
ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు!
ఒకసారి నా క్యాబ్‌లో ఒక వృద్ధ జంట ఎక్కారు. వాళ్లు దిల్లీ నుంచి బెంగళూరుకి వచ్చారు. వాళ్లు నా కారు ఎక్కే సమయానికి 70ల నాటికి చెందిన బాలీవుడ్ హిట్స్ ప్లే అవుతున్నాయి. ఒక పాట రావడం ప్రారంభం అయిన వెంటనే వాల్యూమ్ పెంచమని నాకు చెప్పి ఆయన ఆ పాటను తన భార్యకు అంకితం ఇస్తున్నా.. అంటూ దానిని పాడడం ప్రారంభించాడు. అలా ఆయన పాట పాడుతున్నంత సేపు ఆమె సిగ్గుపడుతూ మురిసిపోయింది. నేను ఇప్పటివరకు చూసిన జంటల్లో బెస్ట్ కపుల్ అంటే నిస్సందేహంగా వారే అని చెబుతా.
అందమైన ప్రేమ ప్రతిపాదన..
ఒకసారి ఒక యువజంట నా క్యాబ్‌లో రైడ్ బుక్ చేశారు. వాళ్లని గమ్యస్థానంలో దింపేసిన అరగంట తర్వాత ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి తన గిఫ్ట్ ఒకటి నా కారులో ఉండిపోయిందని అన్నాడు. నిజమే.. అది కారులో కింద పడిపోయింది. వాళ్లు కారు దిగే సమయంలో నేను కూడా దానిని గమనించలేదు.
వెంటనే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుని ఆ గిఫ్ట్ వారికి అందించా. నా ముందే ఆ అబ్బాయి ఆ గిఫ్ట్ తెరచి అందులో ఉన్న ఉంగరం అమ్మాయి వేలికి తొడుగుతూ తన మనసులో ఉన్న ప్రేమను తెలియజేశాడు. ఆ సమయంలో అతను నన్ను అక్కడ నుంచి వెళ్లనీయలేదు. పైగా ఆ అమ్మాయిని నా కారు వద్ద ఉండమని, 5 నిమిషాల్లో వస్తా అంటూ ఎక్కడికో పరుగందుకున్నాడు. అలా ఐదు నిమిషాల తర్వాత చేతిలో కేక్‌తో మా ముందు ప్రత్యక్షమయ్యాడు. అది నాకు ఎంతో అభిమానంగా ఇచ్చి తినమని కోరాడు. ఇప్పటివరకు నేను చూసిన ప్రేమ ప్రతిపాదనల్లో ఇదే ది బెస్ట్ అని చెప్తా!
అసాధ్యం అంటూ ఉండదు..
నాకు గుర్తున్నంత వరకు ఈ సంఘటన జరిగే సమయానికి ముంబయి మహానగరంలో బంద్ జరుగుతోంది. ఆ రోజు టాటా హాస్పిటల్ నుంచి బోరివలికి వెళ్లేందుకు ఓ జంట నా క్యాబ్ బుక్ చేసుకున్నారు. వాళ్లను రిసీవ్ చేసుకునేందుకు ఆ ప్రదేశానికి వెళ్లేసరికి 50ల వయసులో ఉన్న ఇద్దరు దంపతులు నా క్యాబ్ కోసమే ఎదురుచూస్తున్నారు. అక్కడకు వెళ్లగానే మమ్మల్ని బోరివలిలో దింపుతావా అని నన్ను అడిగారు. ముంబయిలో బంద్ జరుగుతోంది. వెళ్లడం కష్టం అని చెప్పా. వెంటనే ఆ పెద్దాయన బాబు.. మమ్మల్ని దయచేసి అక్కడకు తీసుకెళ్లు.. నా భార్య రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతోంది.
తనకు ఈరోజు కీమోథెరపీ చేయాల్సి ఉండడంతో ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు తను నిలబడే స్థితిలో కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బోరివలి చేరుకోవడం కష్టమే. మాకు సహాయం చేయు.. అని నాతో అన్నారు. వెంటనే వారిపై నాకు జాలి కలిగింది. అయినప్పటికీ వాస్తవం చెప్పాలి కాబట్టి గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రయత్నిస్తా.. అని అన్నాను. అలా మా ప్రయాణంలో నేను ఊహించిన విధంగానే చాలా సమస్యలు ఎదురయ్యాయి.
కానీ ఆ భగవంతుడి దయ వల్ల ఎలాగోలా మలాద్ స్టేషన్ వరకు చేరుకోగలిగాం. అక్కడ వారు కారు దిగేశారు. అప్పుడు కూడా ఆమె నడవలేని స్థితిలోనే ఉంది. వెంటనే ఆయన ఆమెను పసిపాపని ఎత్తుకున్నట్లుగా చేతులతో ఎత్తుకుని స్టేషన్లోకి తీసుకెళ్లారు. ఆ దృశ్యం చూసిన నాకు ఒక్కటే అనిపించింది.. మనం పెళ్లాడిన వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారి మధ్య అసాధ్యం అనే మాటే రాదు!!
ప్రేమకు వయసుతో పని లేదు..
నా ఉబర్ రైడ్స్‌లో భాగంగా నేను ఎన్నో జంటలను చూశా. కానీ ఎప్పటికీ మరిచిపోని సంఘటన అంటే ఒక వృద్ధ దంపతులదే! ఓ రోజు వయసులో బాగా పెద్దవారైన ఒక జంట నా కారు ఎక్కారు. చూడడానికి వాళ్లు తాతయ్య, బామ్మల్లా కనిపిస్తున్నా వారి మనసుల్లో ఉన్న ప్రేమ మాత్రం నవయవ్వనంగా కనిపించింది. ఆ ప్రయాణం సాగినంత సేపు ఇద్దరూ సరదాగా పాటలు పాడుకుంటూ అంత్యాక్షరి ఆడుకున్నారు.
కొత్తగా పెళ్లైన జంట..
ఓసారి రైడ్ కోసం నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే వాళ్లు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నా. అక్కడకు వెళ్లిన తర్వాత నన్ను ఒక అబ్బాయి కలిశాడు. 15 నిమిషాలు వేచి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. అందుకు సమ్మతించి 15 కాదు.. ఏకంగా 25 నిమిషాలు వేచి చూశా. అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది. ఓవైపు హుషారెత్తించే డప్పులు వినిపిస్తుంటే మరోవైపు వధూవరుల ముందు కుటుంబ సభ్యులు, స్నేహితులు కొందరు సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు.
అలా వారంతా కాసేపటికి సంతోషంగా నృత్యం చేస్తూ వధూవరులను నా కారు వద్దకు తీసుకొచ్చారు. కొత్త దంపతులిద్దరూ వెనక సీట్లలో కూర్చోగా నాతో మాట్లాడిన అబ్బాయి ముందు సీట్లో నా పక్కన కూర్చున్నాడు. అప్పటికే ఆశ్చర్యంలో ఉన్న నేను రైడ్ మొదలుపెట్టచ్చా అని అతన్ని అడిగి కార్ స్టార్ట్ చేశా. వారిని గమ్యస్థానం చేర్చిన తర్వాత కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పా. ఆ తర్వాత అతను నాకు పేమెంట్‌తో పాటు 101 రూపాయలు టిప్ ఇస్తూ నీ కంటే ముందు నేను మరొక క్యాబ్ బుక్ చేశా. కానీ వారు రాలేదు. అందుకే ఈసారి ఉబర్‌లో రైడ్ బుక్ చేశా.
అదీకాకుండా ఇంతసేపు వేచి ఉండేందుకు ఎవ్వరూ అంతగా ఒప్పుకోరు కూడా! కానీ మీరు మమ్మల్ని అర్థం చేసుకుని ముందుకు వచ్చారు. మాకు ఎంతగానో సహకరించినందుకు మీకు ధన్యవాదాలు అని అన్నాడు. డబ్బు మాట పక్కన పెడితే.. నా కారులో కొత్త జంటను ఎక్కించుకోవడం ఇదే తొలిసారి. అందుకే ఇది నాకు ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజమే.. మనం ప్రేమతో చూడాలే కానీ ఈ సృష్టిలో ప్రతిదీ ప్రేమతో ముడిపడినదే..! చూసే కళ్లను బట్టి అది కనిపిస్తుంది అంతే.. ఏమంటారు??
ఇవి కూడా చదవండి
సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే