home / Bollywood
రాణీ లక్ష్మీబాయి పాత్రకు వన్నె తెచ్చిన.. కంగనా రనౌత్ చిత్రం “మణికర్ణిక” (సినిమా రివ్యూ)

రాణీ లక్ష్మీబాయి పాత్రకు వన్నె తెచ్చిన.. కంగనా రనౌత్ చిత్రం “మణికర్ణిక” (సినిమా రివ్యూ)

మణికర్ణిక (Manikarnika) అలియాస్ ఝాన్సీ లక్ష్మీబాయి అనగానే మన క‌ళ్ల ముందు మెదిలేది- వీపుకు బిడ్డని కట్టుకుని గుర్రాన్ని అత్యంత వేగంగా స్వారీ చేస్తూ బ్రిటిష్ సైనికుల్ని చీల్చి చెండాడే ఒక యోధురాలు. అయితే బ్రిటిష్ వారి పైన యుద్ధం చేయ‌డానికి ముందు అసలు ఆమె ఎవ‌రు? ఎక్కడ పుట్టారు? ఎవరిని వివాహం చేసుకున్నారు? వంటి అంశాలను మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (The Queen Of Jhansi) చిత్రంలో మనకి చూపించే ప్రయత్నం చేశారు దర్శక-నిర్మాతలు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే, లక్ష్మీబాయి – ఝాన్సీ రాజ్యానికి కోడలిగా; ఆ తరువాత రాణిగా మారక మునుపు ఆమె పేరు మణికర్ణిక. మహారాష్ట్ర నుంచి వారణాసికి వలస వచ్చిన ఒక బ్రాహ్మణ జంటకి మణికర్ణిక‌ ఘాట్‌లో జన్మించిన కారణంగా ఆమెకి అదే పేరుతో నామకరణం చేస్తారు. చిన్నతనం నుంచే ఆమెను బితూర్ పేష్వా పర్యవేక్షణలో ఒక క్షత్రియ రాజపుత్రికలా పెంచుతారు. కాలక్రమంలో ఆమె యుద్ధవిద్యల్లో ప్రావీణ్యం పొందుతుంది. అది ఎంతలా అంటే ఒకే బాణంతో ఒక పెద్ద పులిని మట్టికరిపించేంతలా…!

kangana-ranaut-in-manikarnika-1

మణికర్ణిక ధైర్యసాహసాల‌ను చూసిన ఝాన్సీ రాజ ద‌ర్బారుకి చెందిన వ్య‌క్తులు ఆమెని ఝాన్సీ మహారాజు గంగాధర రావుకి సరైన జోడిగా ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు. ఇక ఆ సమయం నుంచి ఆమె ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఝాన్సీ సింహాసనాన్ని అధిష్టించింది? బ్రిటిష్ వారి పై దండెత్తి వారికి ఒక సింహస్వప్నంలా ఎలా మారింది? అన్నది మీరు తెరపైనే చూడాలి.

సాధార‌ణంగా ఇటువంటి యోధుల క‌థ‌ల ఆధారంగా సినిమాలు తెర‌కెక్కించేట‌ప్పుడు ఆయా పాత్ర‌లకు పూర్తి న్యాయం చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న న‌టీన‌టుల‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మ‌ణిక‌ర్ణిక చిత్ర‌బృందం ఈ విష‌యంలో స‌ఫ‌ల‌మైంద‌నే చెప్ప‌చ్చు. కంగనా రనౌత్ (Kangana Ranut) జాతీయ అవార్డుని సైతం దక్కించుకుని నటనలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న క‌థానాయిక‌.

kangana-in-manikarnika-movie

అలాంటి ఒక అద్భుత‌మైన నటి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో క‌నిపించ‌నుంద‌న‌గానే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇలా అభిమానులు పెంచుకున్న అంచ‌నాలు, వూహ‌ల‌ను ఏమాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా తన శక్తిమేరకు ఈ పాత్ర‌కు ప్రాణం పోసింది కంగ‌న‌. కుమార్తెగా, భార్య‌గా, త‌ల్లిగా, ఒక రాణిగా.. విభిన్న‌మైన కోణాల్లో త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించి త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేసింది.

గుర్రపు స్వారీ (Horse Riding), కత్తి యుద్ధం (Sword Fight).. మొద‌లైన‌ యుద్ధ నైపుణ్యాల‌తో పాటు తుపాకీ గురి పెట్ట‌డం వంటి అంశాల్లో కూడా శిక్ష‌ణ తీసుకుంది కంగ‌న‌. త‌ద్వారా ఈ చిత్రంలో యుద్ధ స‌న్నివేశాల్లో ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా చ‌క్క‌గా న‌టించింది. ఇక రాణిగా ఆమె ఆహార్యం అద్భుతం. ఆమె నడకలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా ఈ చిత్రం చూస్తే అర్ధమవుతుంది. ఝాన్సీ రాణిగా సింహాస‌నాన్ని అధీష్టించాల్సి వచ్చిన సమయంలో ఆమె పలికే సంభాషణలు చాలా బాగున్నాయి. తమ రాజ్యంలోని ప్రజలని ముఖ్యంగా మహిళలని యుద్ధరంగంలోకి తీసుకురావడానికి ఆమె చెప్పే మాటల్లో బలం కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం మొత్తం కంగనా అలియాస్ రాణి లక్ష్మీబాయి తప్ప వేరే పాత్రలు మ‌న‌ల్ని పెద్దగా ప్రభావితం చేయవు.

kangana-in-manikarnika-screening-1

ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ (Vijayendraprasad)కూడా సినిమా మొదటి నుంచి చివరి వరకు లక్ష్మీబాయి పాత్ర స్థాయిని పెంచే విధంగా క‌థ‌ను సిద్ధం చేశారు. ఆమె పాత్ర గ్రాఫ్ ఎక్క‌డా కూడా పడిపోదు. అయితే క‌థ‌లోని స‌హాయ పాత్ర‌ల‌కు సైతం స‌మ‌ప్రాధాన్యం ఇచ్చిన‌ప్పుడే ఆ క‌థ‌కి మంచి ప‌ట్టు ల‌భిస్తుంది. ఇక ఈ చిత్రంలో న‌టించిన మిగ‌తా ప్ర‌ధాన తారాగ‌ణం త‌మ పాత్ర‌ల‌కు బాగానే న్యాయం చేశారు.

ఈ చిత్రానికి సంభాషణలు రాసిన ప్రసూన్ జోషి (Prasoon Joshi)ని మనం అభినందించి తీరాల్సిందే. కొన్ని సన్నివేశాల్లో ఆయన రాసిన మాటలే ఆ సన్నివేశం స్థాయిని మ‌రింత‌ పెంచాయ‌నడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన శంకర్-ఎహసాన్-లాయ్ (Shankar-Ehsaan-Loy)లు పాట‌ల‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. శంకర్ పాడిన భారత్ అనే పాట సినిమా మొత్తం మనకి వినిపిస్తూనే ఉంటుంది.

Kangana-Ranaut-in-Fierce-Look

ద‌ర్శ‌క‌త్వం విష‌యానికి వస్తే, ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు. ఒకరు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) (Radhakrishna Jagarlamudi); కాగా మరొకరు కంగనా రనౌత్. క్రిష్ (Krish) ముందుగా ఈ చిత్ర షూటింగ్‌ని మొదలుపెట్టి చాలావ‌ర‌కు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ప్యాచ్ వ‌ర్క్స్ పూర్తి చేసే నిమిత్తం  ఈ చిత్ర ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను త‌న‌పై వేసుకొని సినిమాను పూర్తి చేసింది కంగ‌నా ర‌నౌత్. ఇలా ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఈ చిత్రానికి ప‌ని చేయ‌డంతో సినిమా చూసే స‌మ‌యంలో ప్రేక్షకులకు క‌థ‌తో మ‌మేక‌మ‌య్యేందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది .సినిమాలో స‌న్నివేశాలు చూడ‌డానికి బాగానే ఉన్నా.. ఒక‌దానితో మ‌రొక‌టి లింక్ చేసిన క్ర‌మంలో చిన్న చిన్న లోపాలు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంది.

నిర్మాతలు కమల్ జైన్ & నిశాంత్‌లతో కలిసి ZEE స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సినిమాలో కోటలు, గుర్రాలు, ఖరీదైన దుస్తులు, సెట్స్ ఘనంగానే కనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ టీం చాలా సమర్థంగా పనిచేసిందని చెప్పొచ్చు.

మొత్తానికి ఈ చిత్రం ఒకసారి అయితే చూడొచ్చు. మ‌ణిక‌ర్ణిక బాల్యం, వివాహం, రాణీగా మారడానికి దారి తీసిన ప‌రిస్థితులు.. వంటి అంశాల‌తో పాటు మ‌హిళలు త‌మ‌ని తాము బ‌ల‌వంతులుగా ఎందుకు మార్చుకోవాలి? దేశానికి మ‌న‌మంతా ఏ విధంగా సేవ చేయాలి?? అనే అంశాల గురించి కూడా చ‌క్క‌ని స్ప‌ష్ట‌త‌ను ఇస్తుందీ చిత్రం.

ఇవి కూడా చదవండి

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

2019లో కంగనా రనౌత్‌కు.. ‘మణికర్ణిక’ చిత్రం ఎందుకు స్పెషల్ అంటే..?

 

25 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this