తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి సంక్రాంతి (Sankranthi) సీజన్ మంచి వసూళ్ళకి అవకాశం ఉండేదిగా ప్రసిద్ధి. అలాగే ఈ సీజన్లో విడుదలయ్యే చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కురిపించడమే కాకుండా పండగ సమయంలో సినీ అభిమానులకి కూడా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంటాయి.
ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి నాలుగు చిత్రాలు వచ్చాయి. మరి ఆ చిత్రాలు ప్రేక్షకుల మనసుని ఎంతవరకు గెలుచుకున్నాయి అనే విషయాన్ని కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం…
ముందుగా జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) గురించి మాట్లాడుకుంటే – ఈ చిత్రం పైన విడుదలకి ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని దర్శకుడు క్రిష్ (Krish) అందుకోగలడా అన్న మీమాంసల నడుమ ఈ చిత్రం విడుదలకావడం.. హిట్ అవ్వడం జరిగిపోయాయి.
అభినయం విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగానే ఈ పాత్రని చేయడంతో.. ఆ పాత్రకి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇతర నటీనటుల వర్గం కూడా తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ చిత్రం రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పండగ సమయానికి హౌస్ ఫుల్స్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఇక ఈ సీజన్లో విడుదలైన రెండవ చిత్రం – పేట (Petta). సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తమిళంలో చేసిన ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ చేయబడింది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్ దొరకడం లేదు అన్న విమర్శల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అలా విడుదలైన ఈ చిత్రానికి కాస్త మందకొడిగానే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే తమిళనాట వచ్చిన పాజిటివ్ టాక్‌కి తోడుగా ఇక్కడ కూడా పర్వాలేదు అన్న మౌత్ పబ్లిసిటీ వల్ల రెండో రోజు నుండి కాస్త వసూళ్ళు మెరుగుపడ్డాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక తెలుగులో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది ఈ చిత్రం అన్నది మొదటివారం పూర్తయ్యాక కాని తెలవదు.
ఈ సంక్రాంతి సందర్బంగా ముచ్చటగా విడుదలైన మూడవ చిత్రం వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama). మొదటిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Powerstar Ram Charan) & దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలయికలో వస్తున్న ఈ చిత్రం పై మెగా అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.
అలాగే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో కూడా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది అన్న నమ్మకం వ్యక్తం చేయడం జరిగింది. తీరా విడుదలయ్యాక చూస్తే, ఈ చిత్రం మిశ్రమ స్పందనలను పొందింది. ఇక కొందరు అభిమానులు సైతం ఈ చిత్రం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మొదటిరోజు వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నా.. రెండవ రోజు నుండి వసూళ్ళు తగ్గుముఖం పడుతున్నాయని పలు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సీజన్లో ఆఖరుగా వచ్చినా.. ఆకర్షణీయంగా వచ్చిన చిత్రం F2. టీజర్ విడుదలైన రోజే ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రతిఒక్కరిలో కలిగింది. అదే నమ్మకాన్ని పెంచుతూ ట్రైలర్ సైతం సూపర్ హిట్ ఆశలని రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రం విడుదలయ్యాక సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేష్ (Venkatesh)-వరుణ్ తేజ్ (Varun Tej)ల అభినయానికి తమన్నా-మెహ్రీన్‌లు గ్లామర్ తోడవ్వడంతో సినిమా అభిమానులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచింది.
ప్రకాష్ రాజ్ (Prakash Raj), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) లతో పాటు సుమారు 10 మంది ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోయిందని… ఈ సీజన్లో చూడదగ్గ కుటుంబకథా చిత్రమని ప్రేక్షకులు అంటున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోయే అవకాశం ఉందని.. ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవండీ.. ఈ నాలుగు పందెం కోళ్ళ (సినిమాల) విశేషాలు. ఇదే మేము అందిస్తున్న ఈ సంవత్సరపు సినిమాలకి సంబంధించిన సంక్రాంతి సీజన్ ప్రోగ్రస్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి
F2 (ఫన్ & ఫ్రష్ట్రేషన్) సినిమాని ఎందుకు చూడాలంటే.. ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?
సంబరాల సంక్రాంతి.. ఈసారి టాలీవుడ్‌కి ఎలాంటి విజయాలను అందిస్తోంది..?