పూజ హెగ్డే (Pooja Hegde).. తెలుగులో ఈమధ్యకాలంలో మంచి విజయాలు అందుకున్న నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకి సినీ అభిమానులు ఎర్ర తివాచి పరిచారనే చెప్పాలి.
ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన చిత్రాలు కొన్నే అయినా… ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రంగస్థలం”లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక అంతకముందు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 25వ చిత్రం “దువ్వాడ జగన్నాధం”లో హీరోయిన్గా మెరిసింది. ఎన్టీఆర్ సరసన “అరవింద సామెత వీర రాఘవ”లో టైటిల్ పాత్రతో పాటుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం “మహర్షి”లో కూడా లీడ్ రోల్లో నటించింది.
Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?
ఈ చిత్రాలన్నీ ఆమెకి మంచి పేరు తీసుకురావడంతో పాటుగా.. బ్లాక్ బస్టర్స్గానూ నిలిచాయి. ఇదిలావుండగా.. ప్రస్తుతం, ఆమె వరుణ్ తేజ్ (Varun Tej) సరసన “వాల్మీకి” (Valmiki) అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ చిత్రంలో “శ్రీదేవి” (Sridevi) అనే పాత్రలో ఆమె మనకి కనిపించనుంది. అందుకే శ్రీదేవి పాత్రలో.. పూజ సైకిల్ తొక్కుతున్న లుక్‌ని విడుదల చేశారు నిర్మాతలు. ఆ లుక్‌లో అచ్ఛం పల్లెటూరి అమ్మాయి మాదిరిగానే పూజ కనిపించడం విశేషం. ఈ లుక్‌ని దర్శకుడు హరీష్ శంకర్, పూజ హెగ్డేలు స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఇప్పటివరకు దాదాపు అన్ని మోడర్న్ లుక్స్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఇలా పల్లెటూరి అమ్మాయిలా దర్శనిమివ్వగానే.. ప్రేక్షకులతో పాటుగా ఆమె ఫ్యాన్స్ కూడా స్వీట్ షాక్‌కి గురయ్యారు. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో మోడ్రన్ లుక్‌తో ఉండే అమ్మాయిగా అభినయం ప్రదర్శించిన పూజ… ఈ చిత్రం ద్వారా ఒక పల్లెటూరి అమ్మాయి అభినయం ప్రదర్శించనుంది. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈమె నటన ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేస్తుంది అని ట్వీట్ చేశాడు.
ఇక ఈ వాల్మీకి చిత్రం తమిళంలో వచ్చిన “జిగర్తాండా”కి (2014) రీమేక్‌గా చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించగా… సిద్ధార్థ్, లక్ష్మి మీనన్ & బాబీ సింహాలు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి 14 రీల్స్ ప్లస్ అనే పతాకం పైన రామ్ ఆచంట & గోపీచంద్ ఆచంటలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తయి, నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే నెల సెప్టెంబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. అయాంక్ బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు “పూరి జగన్నాధ్ – లావణ్య”ల లవ్ స్టోరీ..!
ఈ చిత్రం ద్వారా ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు పెద్ద హీరోల పక్కన నటించిన హీరోయిన్గా పేరు కొట్టేసింది పూజ. రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇప్పుడు వరుణ్ తేజ్.. ఇలా వీరందరితో నటించి మెగా హీరోయిన్ అనే ట్యాగ్‌ని కూడా సంపాదించేసింది. ఇటీవలి కాలంలో పూజ హెగ్డే మరోసారి అల్లు అర్జున్ & త్రివిక్రమ్‌లతో కలిసి పనిచేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రమే – అలా వైకుంఠపురంలో.
ఇక అదే సమయంలో ఆమెకి బాలీవుడ్లో కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో హౌస్ ఫుల్ 4 చిత్రం ఉంది. ఇది గనుక విజయ సాధిస్తే, ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎంత బిజీగా అయితే ఉందో.. అంతే బిజీగా బాలీవుడ్లో కూడా ఛాన్స్‌లు కొట్టేస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.
ఆఖరుగా చెప్పేదేమిటంటే.. పూజ హెగ్డే … శ్రీదేవి అనే పల్లెటూరి పిల్ల పాత్రలో తెలుగునాట మరింతమంది అభిమానులని సంపాదించుకోవాలని మనమూ మనసారా కోరుకుందాం. ఏదేమైనా.. పూజ హెగ్డే శ్రీదేవి లుక్ చూస్తుంటే కచ్చితంగా ఇది బొమ్మ హిట్ అవుతుందని అర్ధమవుతుంది.
“వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు తప్పక చూడండి..!