Advertisement

Health

సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే

Lakshmi SudhaLakshmi Sudha  |  Jan 8, 2019
సెల్ఫ్ లవ్ :  మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే

Advertisement

ప్రతి నిమిషం మనల్ని మనం మెరుగుపరుచుకొంటూనే ఉండాలి. అది కెరీర్ అయినా.. ప్రేమైనా.. కుటుంబమైనా.. ఏదైనా సరే నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండాలి. అందుకే నూతన సంవత్సర ఆరంభమయ్యే రోజు.. తమని తాము మెరుగుపరచుకోవడానికి చాలామంది తీర్మానాలు (resolutions) చేసుకొంటారు. నేనూ అంతే. కాకపోతే.. ఈ సారి నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని భావించా. దానికోసమే నేను ఏడు తీర్మానాలు చేసుకొన్నా.

సైకాలజీ టుడే చేసిన అధ్యయనం ప్రకారం.. పెద్ద లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడం కంటే.. దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి పూర్తి చేయడం సులభమని తేలింది. దీనివల్ల గమ్యాన్ని చేరుకోగలననే నా ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. అందుకే నన్ను నేను ప్రేమించుకొంటానని నాకు నేను మాటిచ్చుకొన్నాను. మరి దానికి తగ్గట్టుగా నా లక్ష్యం ఉండాలి. అందుకే ఆరోగ్యంగా, ఫిట్‌గా తయారవడాన్ని నా రిజల్యూషన్‌గా పెట్టుకొన్నాను. దాన్ని ఏడు చిన్న లక్ష్యాలుగా విభజించుకొన్నా.

1. తక్కువ తినాలి. వంట చేయాలి.డబ్బు ఆదా చేయాలి.

నిన్నటి వరకు నేను ప్రతి రోజూ బయటి ఆహారాన్నే తినేదాన్ని. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్.. ఇలా నాకు నచ్చినవన్నీ తింటూ ఉండేదాన్ని. నా ఆహారపు అలవాట్లు మరికొంత కాలం ఇలాగే కొనసాగితే.. నా ఆరోగ్యం అటకెక్కుతుంది. అందుకే నేను ఈ అలవాటును మార్చుకోవాలని నిర్ణయించుకొన్నాను.

బయటి తిండి తినకుండా ఉండాలంటే నేను వంట చేయడం ప్రారంభించాలి. నేను అంత బాగా వంట చేయలేకపోవచ్చు. కానీ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఆకలిని తగ్గించడానికి అస్తమానూ చాక్లెట్లు తినే అలవాటు కూడా తగ్గుతుంది. మరి నా డబ్బు ఆదా అయినట్టే కదా..! కాకపోతే.. మొదటి నెల రోజులు ఈ నియమాన్ని నేను బ్రేక్ చేయకుండా ఉండాలి. అప్పుడే నేను కోరుకొన్న ఫలితాన్ని పొందగలుగుతాను.

2. అనవసరమైన యాప్‌లకు దూరంగా..

ఓ వ్యక్తి రోజులో సగటున రెండున్నర గంటల సమయాన్ని సామాజిక మాధ్యమాల కోసం కేటాయిస్తున్నాడట. రెండున్నర గంటలు తక్కువ సమయమేమీ కాదు కదా.. దాన్ని ఉపయోగించుకొంటే ఎంత సమయం ఆదా అవుతుంది? రోజులో నాకు తెలీకుండానే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నాను. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారానే పంచుకొంటున్నారు. ఇలాంటివే మరికొన్ని యాప్స్ నా ఫోన్‌లో ఉన్నాయి. వాటి వల్ల నా సమయం వృథా అవుతోంది. నేను యాక్టివ్‌గా ఉన్నవి మినహా.. మిగిలిన వాటిని నా ఫోన్‌లో అన్ ఇన్స్టాల్ చేసేస్తాను. ఇది నా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. లేనిపోని తలనొప్పులు రాకుండా ఉంటాయి.

3. పాజిటివ్ ఇన్.. నెగటివ్ అవుట్

03 self love resolutions

ప్రతికూల ఆలోచనలు అన్నివిధాలుగా మన ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి. అందుకే వాటిని మన మెదడులో నుంచి బయటకు పంపించాలి. సానుకూల ఆలోచనలను మనలోకి ఆహ్వానించాలి. అదెలా సాధ్యం? దానికీ ఓ మార్గముంది. మన ఆలోచనలన్నీ ప్రతికూలంగానే ఉన్నప్పుడు.. సానుకూల ఆలోచన వచ్చినట్టుగా నటించాలి. ఇలా చేయడమంటే మెదడు సానుకూలంగా ఆలోచించేలా శిక్షణ ఇస్తున్నట్టే. క్రమంగా మనలో పూర్తిగా పాజిటివిటీ నిండిపోతుంది.

4. సంతోషాన్ని ఆహ్వానించి..

నిజానికి నాకు కవితలు రాయడమన్నా.. కథలు రాయడమన్నా చాలా ఇష్టం. కాస్త తీరిక చేసుకొనైనా ఆ పని చేయాలని చాలా సందర్భాల్లో అనుకొన్నా. కానీ ఒకటీ అరా మినహా పెద్దగా సాధించింది ఏమీ లేదు. కానీ ఆ రెండు సందర్భాల్లోనూ నాకు చాలా సంతోషం కలిగింది. ఇలా నాకు ఆనందాన్ని కలిగించేవాటిని పక్కన పెట్టేయడం నాకు నచ్చలేదు. అందుకే ఈ ఏడాదిలో సమయం కుదిరినప్పడల్లా నేను నా కలానికి పని చెబుతాను. మీరు కూడా నాలాగే మీ జీవితంలో సంతోషాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి.

5. ప్రశాంతంగా ఉండేలా..

02 self love resolutions - yoga

సెల్ఫ్ లవ్ చేసుకొనే క్రమంలో మనం చేరుకోవాల్సిన మరో మెట్టు.. ప్రశాంతంగా ఉండటం. దానికోసం మెడిటేషన్ చెయ్యడం మంచిది. ఇది నా మనసుని, మెదడుని రెండింటినీ ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పుడు నిద్ర బాగా పడుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగు పడుతుంది.

6. జ్ఞానార్జ‌న‌ చేయాలి..

04 self love resolutions - reading

ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం వాటితోనే గడిపేస్తున్నాం. ఇంతకు ముందు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది.  ఈ స్మార్ట్ ఫోన్ పుణ్యమాని ఆ పుస్తకాలన్నీ అటక మీదకి ఎక్కించేశాం. అసలైన జ్ఞానాన్ని ఇచ్చేవి అవే కదా.. అందుకే ఓ మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమన్నారు. అందుకే రోజులో కొంత భాగాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలనుకొంటున్నాను.

7. నన్ను నేను మెచ్చుకొంటూ..

మనం గుర్తించం కానీ.. రోజూ మనం ఎన్నో ఫలితాలను సాధిస్తూ ఉంటాం. అనుకొన్న సమయానికి వాకింగ్ చేయడం, డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయడం, సమయానికి భోజనం చేయడం ఇవన్నీ మెచ్చుకోదగిన అంశాలే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా నన్ను నేను మెచ్చుకోవాలని నిర్ణయించుకొన్నాను. అది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.

ఇన్ని రిజల్యూషన్స్ పెట్టుకొన్నాం కదా.. మరి వాటిని ఎలా సాధించడం? దానికి కూడా నా దగ్గర ఓ మార్గం ఉంది. మొదటి నెల ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ నెల గడిచేసరికి అది నాకు అలవాటుగా మారిపోతుంది. మరుసటి నెల దీన్ని కొనసాగిస్తూనే రెండో లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇలా మిగిలినవన్నీ పూర్తి చేస్తాను. అలా కొన్ని నెలలు గడిచేసరికి ఇవన్నీ నా జీవనశైలిలో భాగంగా మారిపోతాయి.

GIFs – Giphy 

Featured Image – Shutterstock

ఇవి కూడా చదవండి

అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి చేయాల్సిన పనులివే

ప్రేమ వివాహం మీకు ప్రేమతో నేర్పించే విషయాలివే

లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..