సుమ కనకాల (Suma Kanakala).. బుల్లితెరలో ప్రసారమయ్యే వినోదాత్మకమైన కార్యక్రమాలను ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. వినోద రంగంలో ఎంత మంది యాంకర్లు పుట్టుకొస్తున్నప్పటికీ మకుటం లేని మహారాణిలా నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు సుమ. అయితే ఆమె మాటల ప్రవాహంలోనే కాదు.. చేతల్లో కూడా దిట్టే అని అంటున్నారు అందరూ. ఇంతకీ ఆమె గురించి అంతా ఎందుకు అలా అంటున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే..
బుల్లితెర వ్యాఖ్యాతగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న సుమ తనదైన వాక్చాతుర్యం, హాస్యస్ఫురణతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అంతేనా.. అధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్‌గా రికార్డులు సైతం సృష్టించారు. టెలివిజన్ చరిత్రలోనే తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న ఆమె ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోను, అవసరార్థులకు సాయం అందించడంలో కూడా ముందుంటానని నిరూపించుకున్నారు.
గతేడాది కేరళలో వచ్చిన వరదలు (Kerala Floods) ఎంతటి అపార నష్టాన్ని కలిగించాయో మనందరికీ తెలిసిందే. ఈ ప్రకృతి విళయానికి కేరళ చిగురుటాకులా వణికిపోయింది. పెద్ద పెద్ద భవంతులు సైతం ఈ వరదల కారణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇలా దెబ్బతిన్న భవంతులు, ఇళ్లతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన పాఠశాల, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ (Primary Health Care Centre) వంటివి కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఇలా అన్ని విధాలుగా కష్టాల ఊబిలో కూరుకుపోయిన కేరళను తిరిగి పునర్నిర్మించడానికి ఎంతోమంది దాతలు డబ్బు, వస్తు రూపంలో ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేశారు. ఈ జాబితాలో ప్రముఖులు ఎందరో కూడా ఉన్నారు.
కేరళ వరదల సమయంలో ఆ రాష్ట్ర సబ్ కలెక్టర్ కృష్ణ తేజ కేరళలో పునరావాస పనుల కోసం సోషల్ మీడియాలో ఐ యామ్ ఫర్ అలప్పి (I am for Alappuzha) అనే పేజీని ప్రారంభించారు. ఇందులో భాగంగా అక్కడ పాక్షికంగా మొదలుకొని బాగా దెబ్బతిన్న భవంతులు, ప్రదేశాల గురించి పోస్ట్ చేశారు. సబ్ కలెక్టర్ కృష్ట తేజ ఈ పేజీ ద్వారా కేరళ పునర్నిర్మాణానికి సుమ, రాజీవ్ దంపతులను సహాయం చేయాలని కోరగా వీరిరువురూ స్థానికంగా ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆ భవంతిని బాగు చేసేందుకు దాదాపు 8 లక్షల రూపాయల విరాళం అందించారు. అయితే.. ఇదంతా గతేడాది వరదలు వచ్చిన తర్వాత జరిగిన విషయం. మరి, దీని గురించి ఇప్పుడెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా?? అక్కడికే వస్తున్నామండీ..
సుమ, రాజీవ్ అలా ఆర్థికంగా సహాయం చేసి బాగుచేసిన ఆ భవంతిని స్థానిక అధికారులు ఇటీవలే ప్రారంభించారు. మునుపటి కంటే మరింత చక్కగా అభివృద్ధి చేసిన ఈ పీహెచ్ సెంటర్‌ను కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఘనంగా ప్రారంభించగా ఆ కార్యక్రమానికి సుమ కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు సుమ మాటల్లోనే కాదు.. మనసులోనూ మాణిక్యమే అంటున్నారు.
సుమా కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినప్పటికీ ప్రస్తుతం భర్త రాజీవ్ కనకాలతో కలిసి హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పాటు సినీ ఆడియో ఫంక్షన్లకు కూడా యాంకరింగ్ చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి
స్త్రీల ఆత్మగౌరవానికి.. అభ్యున్నతికి పెద్దపీట వేసిన “కళా తపస్వి” చిత్రాలు..!
తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన.. యూట్యూబ్ ఛానల్స్ ఇవే..!
గణితంలో భారతీయుల సత్తాని ప్రపంచానికి చాటిన .. “హ్యూమన్ కంప్యూటర్” శకుంతలా దేవి
హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!
వాలెంటైన్స్ డే రోజు విడుదలైన.. “లవర్స్ డే” ప్రేమను పంచలేకపోయింది..!(సినిమా రివ్యూ)
వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు – ఆర్య & సాయేషా