సమంత (Samantha) అక్కినేని.. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న కథానాయికల్లో తన పేరు కూడా తప్పక ఉంటుంది. చెన్నైలో పుట్టి, పెరిగిన ఈ చిన్నది తెలుగింటి కోడలిగా మారినప్పటి నుంచి తన సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పుకొస్తుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన “ఓహ్ బేబీ” చిత్రం జులై 5 తేదిన విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ మూవీ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో ట్విట్టర్ బ్లూ రూమ్ ద్వారా లైవ్‌లో మాట్లాడిందామె.
అందులో కేవలం రాజీవ్ (Rajeev masand) అడిగిన ప్రశ్నలకు మాత్రమే కాదు.. అభిమానులు #AskSamantha అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చిందీ బ్యూటీ క్వీన్. మరి, సమంత చెప్పిన ఆ సమాధానాలేంటో మనమూ చూద్దాం రండి.
ఓహ్ బేబీ సినిమా ఒరిజినల్ కొరియన్ చిత్రం. మిస్ గ్రానీగా రూపొందిన ఆ చిత్రం ఏడు భాషల్లో రీమేక్ అయింది. అందులో ఆ యూనివర్సల్ అప్పీల్ ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరూ.. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను తమకు ఆపాదించుకోగలరు. అంతేకాదు.. సినిమా మొత్తం కామెడీతో నిండి ఉంటుంది. ఇలాంటి సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ సినిమా చూసిన తర్వాత నేను మా అమ్మ దగ్గరకి వెళ్లి “అమ్మా.. నీ డ్రీమ్ ఏంటి?” అని అడిగాను. ఒక కూతురుగా నేను తనని తనకేం కోరికలున్నాయో ఎప్పుడూ అడగలేదు.
సాధారణంగా అమ్మలు, అమ్మమ్మలు ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవాలని మనం భావిస్తాం. వారికి జీవితంలో ఏం చేయాలని భావిస్తున్నారో మనం ఎప్పుడూ అడగం. ఈ సినిమా అలా వారిలో మనకు తెలియని మరో కోణాన్ని చూపించి.. వారు మన కోసం చేసిన త్యాగాల గురించి వివరిస్తుంది. వాళ్ల కోరికలు, ఆకాంక్షలు, కలల గురించి చెబుతుంది. వాటిని మన కోసం వాళ్లు త్యాగం చేసిన తీరు గురించి కూడా చెబుతుంది. అందుకే ఈ సినిమాలో నటించాను. నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళల కోసం ఎవరు సినిమాలు చేస్తుంటారు చెప్పండి? ఈ సినిమా వారి కోసం ప్రత్యేకం. వారి కోసమే కాదు.. ప్రతి మహిళ కోసం ప్రత్యేకం. కామెడీ కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబంతో పాటు చూడాల్సిన సినిమా ఇది.
పక్కా ఫెమినిస్ట్ సినిమా కాకపోయినా.. ఇది పూర్తిగా ఓ మహిళ జీవితానికి సంబంధించిన కథ. అంతేకాదు.. సినిమా యూనిట్, సాంకేతిక వర్గంలోనూ ఎక్కువ మంది మహిళలే. అందుకేనేమో ఈ సినిమాను రికార్డ్ సమయంలో పూర్తి చేశాం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక్కరోజు కూడా షూటింగ్ క్యాన్సిల్ లేదా పోస్ట్ పోన్ అవ్వడం జరగలేదు. అంత ఇష్టంతో ఈ సినిమా కోసం పనిచేశాం. అనుకున్నదానికంటే చాలా ముందే విడుదలకు సిద్ధమయ్యేలా చేశాం. నేను నిజజీవితంలో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది. నేను నిజజీవితంలోనూ కమెడియన్‌లాగే ఉంటాను. అందరినీ నవ్విస్తూ ఉండడం నాకిష్టం. అందుకే ఎప్పటినుంచో కామెడీ పాత్రలు చేయాలనుకునేదాన్ని. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు చై “అచ్చం నీలా ఉంది” అంటూ కామెంట్ చేశాడు.
మా కుటుంబంలో అందరితో నేను చాలా బాగా కలిసిపోతాను. ఇంకా చెప్పాలంటే వారితో చై కంటే నేనే క్లోజ్‌గా ఉంటా. నాగ్ మామ ఏం చేస్తున్నారు.. ఏ సినిమా ఒప్పుకున్నారు వంటి విషయాలన్నీ కూడా చై కంటే నాకే ఎక్కువగా తెలుస్తాయి. పెళ్లి తర్వాత నాకు వచ్చే సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అయితే దీనికి కారణం కూడా నేనే అని నా భావన.
ప్రతి సినిమాలోనూ విభిన్నంగా కనిపించాలని నేను కోరుకుంటున్నప్పుడు.. కేవలం ఓ రొమాంటిక్ హీరోయిన్గా కనిపించే పాత్రలను నాకు చెప్పరు. అందుకే సినిమాల సంఖ్య తగ్గుతోందని నా భావన. “ఏం మాయ చేశావే”కి.. “మజిలీ”కి మధ్య నాకు, చైకి ఎంతో మార్పొచ్చింది. ఇప్పుడు చై ఎంతో రెస్పాన్సిబుల్ హజ్బెండ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాదు.. పని విషయంలోనూ చాలా ఫోకస్‌గా ఉంటున్నాడు. నా మొదటి సినిమా సమయంలో నేను ఏమాత్రం టెన్షన్ పడలేదు. కానీ మజిలీ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను.
గత రెండేళ్ల నుంచి విభిన్నమైన చిత్రాల్లో కనిపిస్తున్నానని అందరూ చెబుతున్నారు. కానీ మొదటి నుంచి నేను కొద్దికొద్దిగా నేర్చుకుంటూ వస్తున్నా. సినిమా ఇండస్ట్రీకి నేను కొత్త. నేర్చుకుంటూ ఎదుగుతూ వచ్చాను. గత రెండేళ్ల నుంచే నేను నటించే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇండస్ట్రీకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో నేను ఎంతో నేర్చుకున్నా. 45 సినిమాల్లో నటించిన నేను.. ప్రతి ఒక్క టీమ్ నుంచి ఎంతో నేర్చుకున్నా.
నటిగా ఉండాలంటే ముందు మనపై మనకు నమ్మకం ఉండాలని నేను భావిస్తా. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటికంటే.. కొన్నేళ్లు గడిస్తే ఆ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇతరుల నుంచి స్పూర్తిని పొందడం, నాలాగా నేను జీవించడం నేర్చుకున్నా. నేను ఎలా ఉండాలో అలా ఉండకూడదని.. సినిమాల నుంచి కూడా వెళ్లిపోవాలనుకున్నా. కానీ దాని నుంచి బయటకు రావడానికి నాకు కాస్త సమయం పట్టింది. ప్రతి టీమ్ నుంచి.. ప్రతి సినిమా నుంచి నేను చాలా నేర్చుకున్నా. వాళ్లందరినీ నా కుటుంబంలా భావిస్తాను.
సూపర్ డీలక్స్ సినిమాలో నేను నటించాను. కానీ ఆ పాత్రకు నేను మొదటి ఎంపిక కాదు. నాకంటే ముందు చాలామంది హీరోయిన్స్‌ని ఈ పాత్ర కోసం అడిగినా వాళ్లు నిరాకరించారట. ఈ సినిమా చేయడానికి మూడు రోజుల ముందు నుంచి నాకు నిద్ర పట్టలేదు. అంత భయాన్ని కలిగించిందా పాత్ర. నాకే ఇంత భయంగా ఉందంటే.. థియేటర్లో సినిమాను చూసే ప్రేక్షకులకు ఇంకెంత భయమేస్తుందోనని అనిపించి ఈ పాత్రను ఒప్పుకున్నా. ఒక రకంగా ఇలా అఫైర్ కొనసాగిస్తోన్న వివాహితగా నటించడం నా కెరీర్లోనే ఓ సవాల్ అని నా భావన.
మజిలీ సినిమాలో చై సరసన నటించడానికే ఒప్పుకున్నా అనేది అబద్ధం. నేను ఇప్పుడు ఎంత స్వతంత్రంగా జీవిస్తోన్నా.. నేను గతంలో ఎదుర్కొన్న సమస్యల వల్లే నేను ఇలా అయ్యానేమో. అలాగే శ్రావణి కూడా.. తనకు నచ్చిన వ్యక్తి కోసం బాధను భరిస్తుంది. క్లైమాక్స్‌లోనూ తన ఫీలింగ్స్ బయటపెట్టదు. ఇలాంటి పాత్రలో నటించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
గతంలో ట్రోలింగ్ గురించి నేను చాలా బాధపడేదాన్ని. ఉదయం లేవగానే మొట్టమొదట అదే చూసేదాన్ని. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు ట్రోల్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. ఫన్ కోసం తప్ప.. అస్సలు వాటికి రిప్లై ఇవ్వను. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేముందు కూడా నేను పెద్దగా పట్టించుకోను. రూడ్‌గా ఉండే కామెంట్లను కూడా డిలీట్ చేయడానికి నేను సమయం తీసుకోను. వాళ్లు కామెంట్ చేయడం వాళ్ల ఇష్టం అంటూ వదిలేస్తాను.
మహానటి, సూపర్ డీలక్స్ వంటి చిత్రాల్లో నేను వేరే కథానాయికలతో కలిసి పనిచేశాను. నాకు వారితో కలిసి పనిచేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా తోటి కథానాయికలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను. చిత్ర సీమలో ఉన్నవాళ్లందరూ ఒకటని నేను భావిస్తా. మా మధ్య అలాంటి బంధం ఉంటుంది. మేమంతా ఒక్కటిగా లేకుండా.. బయటకు వాళ్లు మాకు సపోర్ట్ చేయాలి అనేది తప్పు. భవిష్యత్తులో నేను సినిమాలు కూడా నిర్మించి వారిని కథానాయికలుగా చేయాలనుకుంటున్నా.
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నాకు అసలు దీని గురించి ఏమీ తెలీదు. నేను ఇండస్ట్రీలో అడ్జస్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను. జీవితంలో నేను మొదటిసారి ఫ్లైట్ ఎక్కిందే సినిమా షూటింగ్ కోసం. అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఉదయాన్నే లేచి నా జీవితం ఇలా ప్రశాంతంగా ఉన్నందుకు.. దేవుడికి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటా. నేను నా జీవితంలో కేవలం యాభై లక్షల బ్యాంక్ బ్యాలన్స్ , ఓ సొంత ఇల్లు ఉంటే చాలు అనుకున్నాను.
దాన్ని ఎప్పుడో సాధించా. అది కాకుండా మిగితాది నా ప్లాన్ కాదు. మా జీవితంలో మేం చాలా ఇబ్బందిపడ్డాం. అమ్మ చాలా కష్టపడింది. ఇబ్బందులు పడుతున్నప్పుడు వేరేవాళ్లు వచ్చి మాకు సాయం చేశారు. అలా సాయం చేసినప్పుడు.. ఆ కుటుంబానికి ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ ఆనందాన్ని అందరికీ అందించాలని నేను సాయం చేస్తున్నా. ప్రత్యూష సపోర్ట్ ద్వారా అవసరం ఉన్నవారిని ఆదుకుంటున్నా అన్న ఆనందం నాకు చాలు.
నేను ఇప్పుడిప్పుడే దక్షిణాది చిత్ర పరిశ్రమ, అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నా. బాలీవుడ్ గురించి నాకేం తెలీదు. కాబట్టి నేను బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతానో నాకు తెలీదు. దక్షిణాదిలో ఇంకా చాలా చేయాలని నా కోరిక. అందుకే నేను ఇక్కడి స్క్రిప్ట్ ఎంపికలో.. కేవలం ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నా మొదటి ఐదు సినిమాలు పెద్ద హిట్. నన్ను అప్పుడు అందరు గోల్డెన్ లెగ్ అన్నారు. కానీ ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దానికీ హీరోయిన్నే అంటారు. హీరోలకు అలాంటిదేమీ ఉండదు. వాళ్లకు ఎలాంటి మార్పు ఉండదు. సినిమాలు చేస్తూనే ఉంటారు. నా ఆరో సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను బాధపడ్డా. కానీ ఇప్పుడు జయాపజయాలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.
ఇవి కూడా చదవండి
“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత
నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య
స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?