మీరు ఇంట్లోనే ఉన్నా.. లేదా చదువు నిమిత్తమో.. ఉద్యోగం నిమిత్తమో.. వేరే చోట ఉన్నా.. అనునిత్యం మనం ఎలా ఉన్నామో అని పరితపిస్తుంది అమ్మ. అందుకే ఎప్పుడూ జాగ్రత్తలు చెబుతూ.. ప్రతిక్షణం మనల్ని కంటికి రెప్పలా కాచుకొంటుంది. మనం గమనిస్తే.. రోజూ దాదాపుగా ఒకే విధమైన ప్రశ్నలు వేస్తుంది. వాటివల్ల అప్పుడప్పుడూ మనకి చెప్పలేనంత కోపం వస్తుంటుంది. ఒక్కోసారి ‘mom.. ఎప్పుడూ ఇలా ప్రశ్నలు వేస్తూనే ఉంటావా?’ అని కూడా అంటుంటాం. అయినా అమ్మ వాటిని అడగడం మానదు. ఆ ప్రశ్నలేంటో ఓసారి చూద్దామా..
1. ఏం తిన్నావు?
స్కూలు, కాలేజీ రోజుల్లో అయితే.. ఎంత కష్టమైనా సరే.. పొద్దున్నే లేచి మన కోసం వంట చేసి క్యారేజి పెట్టిస్తుంది అమ్మ. ఇంటికి దూరంగా పొరుగూరిలో హాస్టల్లో ఉన్నప్పుడు అలా చేయడం కుదరదు కదా.. అందుకే ప్రతి రోజూ టిఫిన్ చేశావా? భోజనం చేశావా? ఏం తిన్నావు? అని అడుగుతుంది. అంతేనా.. టైంకి భోజనం చేయమని రోజూ చెబుతుంటుంది. బిడ్డ ఆకలి గురించి అమ్మకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది?
2. ఎవరే ఆ అబ్బాయి?(కనుబొమ్మలు ముడిచి.. కాస్త సీరియస్ గా)
అమ్మకి తెలుసు.. అబ్బాయిల వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని. అందుకే మీరు ఎవరితో.. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో తెలుసుకోవాలనుకొంటుంది.
3. హవ్వ.. అందరూ ఏమనుకొంటారు?
డీప్ నెక్ బ్లౌజ్, బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకొన్నప్పుడు అమ్మ అడిగే ప్రశ్న ఇది.
4. ఉదయం 9 గం.లకు: ఇంటికి త్వరగా వచ్చెయ్. ఆలస్యం చేయకు.
సాయంత్రం 6 గం.లకు: ఇంకా బయలుదేరలేదా?
సాయంత్రం 6.30 గం.లకు: ఇంకా ఎంత టైం పడుతుంది?
సాయంత్రం 6.45 గం.లకు: ఇంకెప్పుడు ఇంటికి వస్తావే?
సాయంత్రం 7.00 గం.లకు: ఇంటికి రావద్దులే.. అక్కడే ఉండిపో..
దాదాపు ప్రతిరోజూ అమ్మ ఇలాగే చేస్తుంది. ఇది మనకు కాస్త చిరాకునే కలిగిస్తుంది. ఇంటికి రాక ఇంకెక్కడికిపోతాం అనిపిస్తుంది. “అరె.. ట్రాఫిక్‌లో కాస్త లేటయ్యింది. ఆ మాత్రానికే ఇన్ని ఫోన్లు చేయాలా” అని కూడా అనిపిస్తుంది. ఆ అసహనం ఫోన్లోనే కాదు.. ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మపైన కూడా చూపిస్తాం. కానీ ఒక్క రోజు అమ్మ నుంచి ఫోన్ రాకపోతే.. ఏదో మిస్సయిన ఫీలింగ్ వస్తుంది. అమ్మ నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి అని ఎదురుచూస్తాం. ఇంటికి వెళ్లిన తర్వాత ‘అమ్మా ఈ రోజు ఫోన్ చేయలేదేంటి?’ అని అడుగుతాం.
Also Read: సినిమాలో చూపించినట్లు కాలేజీ జీవితం ఉంటుందా?
5. వర్షం వచ్చేలా ఉంది.. ఈ గొడుగు పట్టుకెళ్లు..
ఇంటి నుంచి బయలుదేరే చివరి నిమిషంలో బయటి వాతావరణాన్ని చూసి అమ్మ మనకు ఇచ్చే సలహా ఇది. సలహా మాత్రమే కాదు.. గొడుగు కూడా ఇస్తుంది. వర్షం విషయంలో తన అంచనా ఎప్పుడూ తప్పు కాదు.
6. జాగ్రత్తగా చూడు.. అక్కడే ఉంటుంది
మనకేది కావాలన్నా.. ఏది కనిపించకపోయినా ముందు అమ్మనే అడుగుతాం. ఎందుకంటే.. అమ్మే కదా అన్నీ చక్కగా సర్ది మనకు అమర్చి పెడుతుంది.
7. ఏం లావయిపోవులే.. ఇంకొంచెం తిను..
ఆరోగ్యం కోసం మనం పాటించే డైట్ ప్లాన్ అమ్మకు ఏదో పనికిమాలిన విషయంలా కనిపిస్తుంది. అందుకే ‘తిండీ తిప్పలూ మానేసి ఏం సాధిస్తావు?’ అని కసురుకొంటుంది. అందులోనూ మనకు ప్రేమే కనిపిస్తుంది.
Also Read: అల్లరి పిడుగు బుడుగు మనింట్లో చిచ్చర పిడుగైతే..?
8. ఎవరితోనే రోజంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావ్?
మనం ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అమ్మకు చాలా కోపం వచ్చేస్తుంది. అలా ఫోన్ మాట్లాడటం తప్పంటుంది. కొన్నిసార్లు అమ్మ చెప్పే మాటలు మనకు సిల్లీగా అనిపించినా.. ఆమె చెప్పిందే నిజం. ఏమంటారు?
9. నీ పెళ్లయ్యాక మీ ఆయనతో కలసి ఎక్కడికైనా వెళ్లు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్లొద్దు..
ఎందుకంటే.. ఆమె మెదడులో మీ పెళ్లికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏ విషయం గురించి చెప్పినా దాన్ని పెళ్లితో లంకె పెట్టి మాట్లాడుతుంది.
10. నాకు తెలీదమ్మా.. మీ నాన్నని అడుగు
కొన్ని విషయాల్లో అమ్మ నో అని చెప్పడానికి ఇష్టపడదు. అలాంటి సందర్బాల్లో ఇదుగో ఇలా మీ నాన్నని అడుగు అంటుంది.
11. నీ కోసం దీన్ని వండాను. నీ ఫ్రెండ్సందరికీ పంచిపెట్టకుండా నువ్వే తిను
అసలు మనం ఎప్పుడూ సరిగ్గా తినమని అమ్మ అనుకొంటూ ఉంటుంది.(మన బీఎంఐ దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుందనుకోండి). అందుకే ఇలా చెబుతుంది.
12. బీరువా నిండా కొత్త బట్టలే ఉన్నాయి. మళ్లీ షాపింగ్ ఎందుకు చేశావు?
అబ్బా అమ్మా.. అవన్నీ పార్టీలకు, ఫంక్షన్లకు కట్టుకెళ్లేవి. డెయిలీ వేర్ ఉండాలి కదా.. ఈ సమాధానం మీరూ చెప్పే ఉంటారు కదా..
13. నీకు పిల్లలు పుడితే.. నీకూ అర్థమవుతుందిలే..
మనం ఏ విషయంలోనైనా వాదనకు దిగినప్పుడు అమ్మ చెప్పే సమాధానం ఇది. ఇది విన్న తర్వాత ఇక మనం ఒక్క ముక్క కూడా మాట్లాడలేం. ఏమంటారు?
Also Read: ఈతరం అమ్మాయిలకు ఉపకరించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..