ఇటీవలి కాలంలో తెలుగుచిత్ర పరిశ్రమలో చాలా మంది యువ దర్శకులు వినూత్నమైన శైలిలో చిత్రాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భావోద్వేగభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. అలాంటి దర్శకుడే కేవీఆర్ మహేంద్ర. తన తొలిప్రయత్నంగా “దొరసాని” (Dorasani) అనే చిత్రంతో మన ముందుకి వస్తున్నారు ఆయన. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ “దొరసాని” చిత్ర ట్రైలర్ (Trailer) ప్రస్తుతం అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. నిజం చెప్పాలంటే.. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది.
అలాగే ఈ చిత్రంతో జీవిత, రాజశేఖర్ల కుమార్తె శివాత్మిక (Shivathmika Rajasekhar), హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ (Anand Deverakonda) సినీ పరిశ్రమకు పరిచయం కావడం విశేషం.
మల్లేశం మూవీ రివ్యూ – ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దాదాపు 30 ఏళ్ళ క్రితం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా.. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ గ్రామంలో ఊరిపెద్ద కుమార్తెతో.. అదే ఊరికి చెందిన ఓ సామాన్యుడు ప్రేమలో పడడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ విషయం ఈరోజు విడుదలైన ట్రైలర్‌ను చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది.
ఇంతకీ దొరసాని ట్రైలర్ ఎలా ఉందంటే –
ఈ సినిమాలో చిన్న దొరసానిగా అమాయకమైన చూపులతో కనిపించే శివాత్మిక.. తన మనసుకి నచ్చినవాడి కోసం తన కుటుంబ కట్టుబాట్లని దాటే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఒక 18 ఏళ్ళ అమ్మాయిగా పాత్రలో చక్కగా నటించింది. ఇక ప్రేమికుడి పాత్రలో ఆనంద్ కూడా చాలా సహజంగా.. ఎటువంటి మేకప్ నటించడం గమనార్హం.
ఇక ఈ ట్రైలర్‌లోని ఒక సన్నివేశంలో చిన్న దొరసాని తన ప్రేమికుడికి తాగడానికి నీళ్ళు ఇస్తే –
“మేము తాగొచ్చా?” అని ఆ ప్రేమికుడు అడుగుతాడు..
దానికి సమాధానంగా అతనిని ఆమె ‘ముద్దు‘ పెట్టుకుంటుంది..
అలా ఒకే సన్నివేశంలోనే అతడి పై ఆమెకి ఉన్న ప్రేమని.. అదే సమయంలో గ్రామాల్లో ఉండే అంటరానితనం గురించి చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఇదే సందర్భంలో.. మరో రెండు డైలాగ్స్ కూడా మనకు వినిపిస్తాయి.
“అయినా గీ ఊళ్ల ప్రేమించుడు గిట్ల అయ్యే పని కాదు లేరా”…
“ఇప్పుడు మీరు మనసుపడ్డందుకు.. ఆ పొలగాని పాణం తీత్తరు దొరసాని… వాడొక కూలోని కొడుకు గదా!”
ఈ లైన్లు చదివితే చాలు మనకి ఈ చిత్ర కథ అర్ధమైపోతుంది. ఈ కథలో ఒకవైపు అప్పటి తెలంగాణ ప్రాంత నేపథ్యాన్ని తీసుకొని.. మరోవైపు నక్సలిజాన్ని చూపిస్తూ.. జమీందార్ల పై చేసే ప్రజలు చేసే పోరాటాన్ని కథలో మిళితం చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా.. ఒక సంభాషణను ఇందులో పెట్టాడు దర్శకుడు.
అదేంటంటే –
“ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే” …. అని ఒక నక్సలైట్ చెబితే
“మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే” అని ఆ యువకుడు చెబుతాడు.
మొత్తానికి ఈ ట్రైలర్ చాలా సహజంగా.. ఒక సగటు ప్రేక్షకుడికి ఈ చిత్రం పై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్, యశ్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. జులై 12 తేదిన.. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి బాణీలు సమకూర్చారు.
నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?
ఇక ఈ ట్రైలర్‌లోని.. ఒక సన్నివేశంలో మనకి ఒక గోడ పై రాసిన పలు వాక్యాలు కనిపిస్తాయి
కదిలించావు నన్నే గుండెని మీటి …
కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి…
ఈ చిత్ర కథ మొత్తం ఈ రెండు వాక్యాలలో.. దర్శకుడు కేవీఆర్ మహేందర్ మనకి పూర్తిగా చెప్పినట్టు అనిపిస్తుంది కదా. ఏదేమైనా ఒక మంచి చిత్రం మనముందుకు రాబోతుందని మీకు ఈపాటికే అర్థమవ్వచ్చు.
ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!